Beauty

ఈ ఫేస్ మాస్క్స్ ట్యాన్ తొలగించి.. చర్మాన్ని మెరిపిస్తాయి..!

Lakshmi Sudha  |  Mar 8, 2019
ఈ ఫేస్ మాస్క్స్ ట్యాన్ తొలగించి.. చర్మాన్ని మెరిపిస్తాయి..!

వేసవి ఇలా మొదలయ్యిందో లేదో.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో మనం బయటకు వెళితే చర్మంపై ట్యాన్ పెరిగిపోతుంది. మరి దాన్ని తొలగించుకోవడం ఎలా? బ్యూటీ పార్లర్‌కి వెళ్లడానికి ముందు మేం చెప్పే ఈ నేచురల్ ట్యాన్ రిమూవల్ ఫేస్ మాస్క్‌లను (tan removal face masks)  ప్రయత్నించండి. ఇవి ట్యాన్ తొలగించడం మాత్రమే కాదు.. మీ చర్మానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తాయి. 

ట్యాన్‌ని తొలగించే సహజసిద్ధమైన చిట్కాలు

1. ఓట్ మీల్ ఫేస్ మాస్క్

ఓట్స్ నేచురల్ ఎక్స్ఫోలియేటర్‌గా పనిచేసి ట్యాన్, బ్లాక్ హెడ్స్, మృత‌క‌ణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. దీనికోసం ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగ, కొద్దిగా తేనె కలిపి మిశ్రమంగా చేయాలి.

దీన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసిన నీటితో కడిగితే సరిపోతుంది. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read: ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్, హెయిర్ మాస్క్‌లు (Ayurvedic Face Packs)

2. ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్..

కమలాఫల తొక్కల పొడిలో ఉన్న విటమిన్ ఇ స్కిన్ కాంప్లెక్షన్, స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. దీన్ని పాలతో కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకొంటే ట్యాన్ పోవడంతో పాటు చర్మం సాఫ్ట్‌గా తయారవుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల పాలలో సరిపడినంత కమలాఫల తొక్కల పొడి కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చిన నీటిలో మెత్తని వస్త్రాన్ని ముంచి దానితో తుడుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకొంటే చర్మంపై ట్యాన్ ఏర్పడకుండా ఉంటుంది.

3. బొప్పాయి ఫేస్ మాస్క్

బొప్పాయిలో ట్యాన్ తొలిగించి, చర్మాన్ని మెరిపించే ఎంజైములుంటాయి. దీన్ని తేనెతో కలిపి ముఖానికి మాస్క్‌లా అప్లై చేసుకొంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. తాజా బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి అప్లై చేసుకొని మర్దన చేసుకోవాలి.

ఆపై పావుగంట సమయం ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో.. మైల్డ్ సబ్బు ఉపయోగించి శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. నెలకు మూడుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా ట్యాన్ సమస్య ఎదురవకుండా చూసుకోవచ్చు.

Also Read: ట్యాన్ స్కిన్‌ను మెరిపించే.. సెల‌బ్రిటీ మేక‌ప్ టిప్స్ మీ కోసం..!

4. పైనాపిల్ జ్యూస్ మాస్క్

పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలిగిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. మిక్సీలో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసి జ్యూస్‌గా చేయాలి. జ్యూస్‌ను గిన్నెలోకి వడపోసి.. దానిలో టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసుకొని కాసేపు ఆరనివ్వాలి.

ఆ తర్వాత తడి టవల్‌తో మాస్క్‌ను తొలగించాలి. చివరిగా చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది.

5. ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్

ముల్తానీ మట్టి చర్మంపై పేరుకొన్న మురికి, జిడ్డుతో పాటు ట్యాన్‌ను కూడా సమర్థంగా తొలిగిస్తుంది.  ఈ ఫలితం పొందడం కోసం అరకప్పు టమాటా జ్యూస్‌లో.. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.

పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. రోజు విడిచి రోజు ఇలా చేస్తే చర్మంపై ట్యాన్ ఏర్పడకుండా ఉంటుంది.

Also Read: ఓ కామన్ గర్ల్.. నేటితరానికి చెప్పిన అతిగొప్ప సౌందర్య చిట్కా ఇదే..!

6. కీరాదోస ఫేస్ ప్యాక్

ఎండ వల్ల ట్యాన్ సమస్య మాత్రమే కాదు చర్మం కమిలిపోవడం, ఎర్రటి పొక్కులు వంటివి వస్తుంటాయి. వీటిని కీరాదోస రసంతో తగ్గించుకోవచ్చు. ఇది కూలింగ్ ఏజెంట్‌గా పనిచేసి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు వాడిపోయినట్టుగా తయారైన చర్మాన్ని తిరిగి ఫ్రెష్‌గా మారుస్తుంది.

కీరాదోసను మెత్తని గుజ్జులా చేసి దానిలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. ఆపై గంట సమయం ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి సాంత్వన చేకూరుతుంది.

7. టమాటా ఫేస్ మాస్క్

సూర్యరశ్మి కారణంగా చర్మంపై ఏర్పడిన ట్యాన్ తొలిగించడానికి టమాటా బాగా పనిచేస్తుంది. సహజసిద్ధమైన టోనర్‌గా పనిచేసి చర్మాన్ని మెరిపిస్తుంది. టామాటా ఫేస్ మాస్క్ తయారుచేయాలంటే.. బాగా ముగ్గిన టమాటాలు రెండు తీసుకొని వాటిని చిన్న చిన్న ముుక్కలుగా కోసి మెత్తగా చేయాలి. దీన్ని ట్యాన్డ్ స్కిన్ పై అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత స్పాంజ్ ను నీటిలో తడిపి మాస్క్ తొలిగించుకొంటే సరిపోతుంది. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read: ఈతరం అమ్మాయిలకు ఉప‌క‌రించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..

8. కలబంద ఫేస్ ప్యాక్

అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కలబంద ముందు వరుసలో ఉంటుంది. దీనిలో చర్మ పోషణకు అవసరమైన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

కొద్దిగా కలబంద గుజ్జును తీసుకొని దానిలో టీస్పూన్ నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని అరగంట ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను నెలలో కనీసం ఐదుసార్లు వేసుకొంటే.. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

9. బంగాళాదుంప ఫేస్ మాస్క్

బంగాళాదుంపలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థం పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉన్న విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బంగాళాదుంపను మిక్సీలో వేసి జ్యూస్‌గా చేయాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆపై 30-40 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఈ సమయంలో ముఖాన్ని తాకకూడదు. నిర్ణీత వ్యవధి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

చర్మాన్ని మెరిపించే నేచురల్ టిప్స్ (Homemade Beauty Tips In Telugu)

10. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీలో చర్మాన్ని మెరిపించే గుణాలున్నాయి. ఇది చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని ముడతలు పడకుండా చేసి.. దానిని మాయిశ్చరైజ్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ తయారుచేయాలంటే.. తొలుత బాగా మగ్గిన స్ట్రాబెర్రీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

దీన్ని ముఖానికి ఫేస్ మాస్క్ల్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. దీనిపై మిల్క్ క్రీంను లేయర్ మాదిరిగా అప్లై చేయాలి. ముప్పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. వారానికోసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

Images: Shutterstock

Read More From Beauty