నాని (Nani).. చూడగానే మన పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈతరం కథానాయకుడు. తనదైన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవడమే కాకుండా.. తను పోషించే పాత్రలతో ఒక ప్రత్యేకమైన ముద్రను కూడా వేయగల సత్తా ఈ హీరో సొంతం. అందుకే నానీకి ‘న్యాచురల్ స్టార్’ అనే టైటిల్ కూడా ఇచ్చేశారు అభిమానులు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యువ హీరో.. తాజాగా ‘జెర్సీ (Jersey)’ సినిమాతో మనల్ని అలరించేందుకు సిద్ధమైపోయాడు.
ఈ చిత్రం వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ రోజు జెర్సీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అని ముందుగానే దర్శక, నిర్మాతలు చెప్పడంతో.. ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న ఈ అంచనాలు అమాంతం పెరిగాయని చెప్పచ్చు. అయితే ట్రైలర్ చూస్తే ఈ సినిమా తండ్రీ, కొడుకుల మధ్య జరిగే భావోద్వేగాల సమాహారమని ఇట్టే చెప్పేయవచ్చు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. చూడగానే ఇది చాలా సహజమైన కథ అనే భావన మనకు కలగడం ఖాయం. కారణం.. చాలామంది యువకులు 20 ఏళ్ల వయసులో క్రీడలపై మక్కువ పెంచుకొని.. వేరే ఏ పనీ చేయలేక.. అదే రంగంలో విజయం సాధించాలని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు మనకు నిజజీవితంలోనూ ఎందరో తారసపడుతూ ఉంటారు. హీరో నాని కూడా జెర్సీలో ఈ తరహా పాత్రనే పోషించాడు.
అర్జున్ అనే పాత్రలో క్రికెట్ క్రీడ కోసం ప్రాణమిచ్చే కథానాయకుడిగా ఈసారి నానీ మనకు ఈ సినిమాలో కనిపించనున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. క్రికెట్ విడిచిపెట్టిన తర్వాత.. వేరే ఏ పనీ చేయలేక.. తన కొడుకు కోసం దాదాపు పదేళ్ల తర్వాత.. మళ్లీ క్రీడలో తన ప్రతిభను నిరూపించుకోవాలని భావించే తండ్రిగా నాని ఇందులో కనిపిస్తున్నాడు.
అలాగే నానీకి ప్రేమికురాలిగా తన ప్రేమను పంచుతూ; ఏ పనీ చేయకుండా ఇంట్లో ఉండే భర్తతో మానసికంగా కుంగిపోయే భార్య పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) కనిపించనుంది. మళ్లీ రావా.. (Malli Raava) వంటి హిట్ చిత్రం తర్వాత గౌతమ్ (Gowtham Tinnanuri) నుంచి వస్తోన్న సినిమా ఇది. తాజాగా విడుదలైన జెర్సీ ట్రైలర్ చూస్తుంటే .. గౌతమ్ మరో హిట్‌కి దగ్గర్లోనే ఉన్నారని మనకు అనిపించక మానదు. దర్శకుడిగా తనదైన మార్కును ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఆయన తపన.. మనకు ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. అలాగే సినిమాలో సాంకేతిక విలువలు కూడా రిచ్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది.
సాను వర్గీస్ (Sanu Varghese) కెమెరా పనితనం, అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన సంగీతం.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తుండగా.. నవీన్ నూలీ (Naveen Nooli) ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.
అయితే గత వారం నాగ చైతన్య-సమంత (Naga Chaitanya – Samantha) జంటగా నటించిన మజిలీ (Majili) చిత్రం కూడా క్రికెట్ నేపథ్యంలో సాగిన ప్రేమ కథే కావడం గమనార్హం. అయితే అది పూర్తిస్థాయి ప్రేమ కథ కాగా; జెర్సీలో తండ్రీ, కొడుకుల సెంటిమెంట్ కూడా చిత్రానికి ప్లస్ కావడం విశేషం. జెర్సీ విడుదలయ్యాక ఒకే నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాల మధ్య ఉన్న తేడాలు మనకు మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.
మీకు అసలు విషయం చెప్పనేలేదు కదూ.. ఈ చిత్రంలో “నాని” కొడుకు పాత్ర పేరు కూడా “నాని”యే కావడం మరో ట్విస్ట్.
ఇవి కూడా చదవండి
సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ..!
జయలలిత జీవితంలో.. చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!