Lifestyle

లివిన్ రిలేషన్షిప్ గురించి ప్రతిఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..!

Lakshmi Sudha  |  Apr 9, 2019
లివిన్ రిలేషన్షిప్ గురించి ప్రతిఒక్కరూ కచ్చితంగా  తెలుసుకోవాల్సిన విషయాలివే..!

‘ఓకే బంగారం’ సినిమా చూసిన తర్వాత యువతలో లివిన్ రిలేషన్షిప్ ఇంత అందంగా ఉంటుందా? అనే అభిప్రాయం కలిగింది. అసలు బాయ్ ఫ్రెండ్ తో ఒకే ఇంట్లో ఉంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందని చాలామంది అనుకొనే ఉంటారు. కుటుంబాలతో సంబంధం లేకుండా ఒకే గదిని పంచుకోవడమంటే మాటలా? అయితే ఇలాంటి బంధాలను సైతం వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ నేటి యువత లివిన్ రిలేషన్షిప్స్(Live-in relationship) పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రకమైన బంధంలోకి అడుగుపెట్టే ముందు సానుకూల అంశాలనే పరిగణనలోకి తీసుకొంటారు కానీ.. ప్రతికూల అంశాలను పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల కొంత కాలం తర్వాత బంధంలో కలతలు రేగడం, బ్రేకప్ అవడం వంటివి జరుగుతున్నాయి. అసలు లివిన్ రిలేషన్షిప్ లో మనకు తెలియని వాస్తవాలు ఏముంటాయి? ఒకసారి తెలుసుకొందాం రండి..

మనల్ని మనం మార్చుకోవాల్సిందే..

సాధారణంగా లివిన్ రిలేషన్షిప్ అంటే ‘నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అనుకొంటారు చాలామంది. అలా అనుకోవడం సమంజసం కాదు. అది భార్యభర్తల బంధమైనా.. స్నేహబంధమైనా.. ఏ బంధమైనా సరే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాక తప్పదు. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది కూడా. ఈ నియమం సహజీవన బంధానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. సహజీవన బంధంలోకి అడుగుపెట్టే ముందు వరకు మీరు ఇధ్దరు. ఆ తర్వాత ఒక్కటి గా బతకాలి. నలుగురిలో ఒకలా నాలుగ్గోడల మధ్య మరోలా బతకడం మానవ సహజ లక్షణం. ఈ నేపథ్యంలో అతని అలవాట్లలో కొన్ని మీకు నచ్చకపోవచ్చు. అలాగే మీరు చేసే పనులు అతడికి నచ్చకపోవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం తగ్గాల్సి వస్తుంది. అప్పుడే బంధంలో కలతలు రేగకుండా ఉంటాయి.

Also Read: అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఇలా చేయక తప్పదు బ్రదర్..! (Tips To Impress A Girl)

మనం అనుకొన్నంతేమీ ఉండదు..

లివిన్ రిలేషన్షిప్ లో ఉంటే భాగస్వామితో హ్యాపీగా బతికేయచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీరకంగా కలవొచ్చని కూడా అనుకొంటారు. బహుశా లివిన్ రిలేషన్షిప్ ఆధారంగా రూపొందిన సినిమాలు ఈ అభిప్రాయం ఏర్పడటానికి కారణం కావచ్చు. మొదట్లో కొన్ని రోజులు పాటు చాలా ఉత్సాహంగానే గడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఉత్సాహం ఉండదు. ఎందుకంటే.. ఉద్యోగం, దాని వల్ల కలిగే పని ఒత్తిడి, ట్రాఫిక్ జాంలు, ప్రయాణాలు అన్నీ మన శక్తిని పీల్చేస్తాయి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏదో నాలుగు మెతుకులు తినేసి నిద్రపోదామనిపిస్తుంది.

విడిపోవాల్సి వస్తే..

సాధారణమైన ప్రేమబంధంలో ఉన్నవారితో పోలిస్తే.. లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న జంట విడిపోవాల్సి వచ్చినప్పుడు చాలా మానసిక వేదన అనుభవిస్తారు. ఎందుకంటే.. ఇద్దరూ కలసి కొంత కాలం జీవితం పంచుకొన్నారు. దీని వల్ల వీరి మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా మారిపోతుంది. కొంత కాలం గడిచేటప్పటికి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరస్థితి వస్తుంది. అయినా కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ తీపి గుర్తులు మనల్ని మరింత బాధపెడుతుంటాయి.

సామాజికపరమైన ఇబ్బందులు..

ప్రస్తుతం మన దేశంలోని నగరాల్లో లివిన్ రిలేషన్షిప్ కల్చర్ పెరుగుతోంది. కానీ దీన్ని ఆమోదించే వారి శాతం చాలా తక్కువ. ఎందుకంటే ఇది తప్పని చాలామంది ఉద్దేశం. అందుకే సహజీవనం చేస్తున్న జంట సమాజం నుంచి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్పి వస్తోంది. లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నవారిని తప్పు పట్టడం, వారి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడం, వారిని చిన్న చూపు చూడటం వంటివి చేస్తుంటారు. వీటన్నింటినీ తట్టుకొని నిలడేంత బలంగా మీ మానసిక పరిస్థితి ఉండాలి.

అమ్మాయిలు ఇబ్బందుల్లో పడతారు..

ఆధునిక సమాజమని మనం గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ అమ్మాయిల విషయంలో మాత్రం ఆలోచనలు మారడం లేదు. ఎందుకంటే.. పురుషాధిక్యపు అహంకారం, పితృస్వామ్య భావజాలం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తప్పు ఎవరి వల్ల జరిగినప్పటికీ ఆ భారాన్ని మహిళే మోయాల్సి వస్తోంది. రిలేషన్షిప్ నుంచి విడిపోయిన బాధ కంటే ఇతరుల మాటల వల్ల కలిగే వేదనే ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి లివిన్ రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు ఈ విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఏమంటారు?

ఇవి కూడా చదవండి

మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!

స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!

చాటింగ్ టిప్స్: మాట ఇలా కలిపితే మనసుకి దగ్గర అవుతారు..!

Read More From Lifestyle