ప్రపంచం ఎంత ఆధునికంగా మారినప్పటికీ కూడా.. ఎక్కువ శాతం ప్రజానీకం ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ.. ఆరోగ్యపరంగా ఇక్కట్లను ఎదుర్కొంటున్నారనేది మాత్రం వాస్తవం. దీనికి సూచికగా ప్రపంచంలోని 415 మిలియన్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో 46 శాతం మందికి.. ఆ వ్యాధి తమకుందనే విషయం కూడా తెలియదట. ఇది నిజంగా బాధాకరమైన విషయమే.
రోజులో గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే
ఈ లెక్కల ప్రకారం చూస్తే.. నూటికి 11 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని ఇట్టే చెప్పేయచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2040 సంవత్సరానికి గాను.. ప్రపంచంలో దాదాపు 642 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రతీ ఒక్కరు మధుమేహ వ్యాధికి సంబంధించి కనీస అవగాహనను కలిగుండాలని.. వీలైతే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు
ఈ క్రమంలో మనం కూడా.. ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes day) సందర్భముగా.. ఈ వ్యాధి బారిన పడకుండా పలువురు వైద్యులు సూచించిన విలువైన సలహాలు & సూచనలను (Suggestions & Precautions) పాటించేద్దాం.
సలహాలు, సూచనలు, జాగ్రత్తలు
* ప్రతి రోజు మన శరీరానికి శారీరక శ్రమ అనేది అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే, మిగతావారు మాత్రం రోజులో తప్పనిసరిగా.. ఒక గంట సేపు శరీరానికి ఏదో ఒక రకమైన శ్రమను కలిగించాలి. ఉదాహరణకి నడక, పరుగు లేదా కసరత్తులు వంటివి తప్పనిసరిగా చేయాలి.
* అలాగే మనం భోజనంలోకి తీసుకునే వైట్ రైస్ స్థానంలో.. బ్రౌన్ రైస్ లేదా క్వినోవా రైస్‌ని తీసుకోవడం శ్రేయస్కరం. అయితే ఒక్కసారిగా వైట్ రైస్ తీసుకోవడం మానేయకుండా.. క్రమ క్రమంగా బ్రౌన్ రైస్ వాడకాన్ని పెంచడం మంచిది.
* అలాగే ఆహారం తీసుకునే సమయంలో ఒక క్రమశిక్షణను పాటించాలి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తీసుకున్న ఆహారంతో పోలిస్తే.. రాత్రి సమయాల్లో చాలా తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
* చాలా మంది డాక్టర్లు సూచించిన దాని ప్రకారం.. సాయంత్రం ఆరు గంటల తరువాత పండ్లు లేదా ఏదైనా అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదట. లేదా ఆ సమయంలో అసలు ఆహారం తినకుండా ఉండడం కూడా మేలే అని అంటున్నారు.
* అలాగే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌లని తీసుకోవడం బాగా తగ్గించాలి.
* అదేవిధంగా అధిక బరువు పెరగకుండా.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* మంచి పోషకాలను అందించే పండ్లను తినడం ద్వారా కూడా… మన శరీరానికి కావాల్సిన శక్తిని సరైన మొత్తంలో పొందేందుకు ఆస్కారం ఉందట. అందుకనే – బొప్పాయి, గ్రీన్ యాపిల్, కివి, జామకాయ, కీరా దోసకాయ వంటివి తినడం ఉత్తమం.
* అలాగే 30 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ఈ వ్యాధి తాలూకా లక్షణాలు ఏమైనా ఉంటే.. వెంటనే డాక్టర్ చెప్పిన సూచనలు పాటించాలి. తద్వారా ఈ వ్యాధి బారి నుండి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!
ఇక సాధారణంగా మధుమేహం మనలో ఉందని తెలిపే లక్షణాలు & వాటి పూర్తి వివరాలు మీకోసం –
* అతి ఆకలి
* అతి దాహం
* రాత్రి వేళల్లో నాలుగు సార్లు.. అంతకన్నా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం
* త్వరగా అలిసిపోవటం
* బరువు పెరగడం & తగ్గడం
అయితే ఈ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి మధుమేహం ఉందనడం సబబు కాదు. కనుక, వెంటనే డాక్టర్‌ని సంప్రదించి.. సంబంధిత టెస్ట్‌ను చేయించుకోవడం ద్వారా డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ఒకప్పుడు 45 ఏళ్ళు దాటిన వారిలో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు.. అలాగే 55 ఏళ్లు వయసు దాటినా వారిలో డయాబెటిస్ లక్షణాలు కనపడేవి. ఇప్పుడు అలా కాదు. 25 ఏళ్ళు దాటిన తరువాత.. చాలామందిలో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు కనపడుతున్నాయి. మరి ముఖ్యంగా.. నగరంలో ఉండే యువత ఎంచుకుంటున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పు కూడా వారు డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి.
అందుకనే.. పైన చెప్పిన సూచనలు పాటిస్తూ.. ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. మీరు కూడా మధుమేహ రహిత జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం.