Beauty

ఇంట్లోనే అవాంఛిత రోమాలు సులభంగా ఇలా తొలగించుకోవచ్చు..

Lakshmi Sudha  |  Mar 15, 2019
ఇంట్లోనే అవాంఛిత రోమాలు సులభంగా ఇలా తొలగించుకోవచ్చు..

శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను(Unwanted Hair) తొలగించుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. కొందరు దీనికోసం బ్యూటీ పార్లర్‌కి.. వెళితే మరికొందరు ఇంట్లోనే అవాంఛిత రోమాలను తొలగించుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారా? అయితే ఈ పద్ధతుల ద్వారా ఇంట్లోనే శరీరంపై ఉన్న రోమాలను తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకోవడంతో పాటు.. కొన్ని హెయిర్ రిమూవల్ టిప్స్ కూడా తెలుసుకుందాం.

హెయిర్ రిమూవల్ క్రీం

అండర్ ఆర్మ్, బికినీ ఏరియాలో ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి ఈ క్రీం ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కాళ్లు, చేతులపై ఉన్న వెంట్రుకలను తొలగించడానికి సైతం దీన్ని ఉపయోగించవచ్చు. హెయిర్ రిమూవల్ క్రీం అవాంఛిత రోమాలున్న చోట రాసి పదినిమిషాలు ఆగాలి. ఆ తర్వాత రిమూవర్‌తో పాటు ఉన్న ప్లాస్టిక్ స్పాచులాతో క్రీంను తొలగిస్తే సరిపోతుంది. హెయిర్ రిమూవల్ క్రీం ఉపయోగించినప్పుడు ప్లాస్టిక్ స్పాచులాతో వెంట్రుకలను తొలగించడం అంత సులభమేమీ కాదు. దీని వల్ల కొన్ని సార్లు చర్మం తెగిపోయే అవకాశం ఉంది.

కాబట్టి ప్లాస్టిక్ స్పాచులాకి బదులుగా కాటన్ క్లాత్‌తో తుడిస్తే అవాంఛిత రోమాలను సమర్థంగా తొలగించుకోవచ్చు. పైగా నొప్పి, మంట ఉండవు.  ఈ పద్ధతిలో రోమాలను తొలగించుకొంటే వారం రోజుల్లో అవి మళ్లీ మనల్ని పలకరిస్తాయి. హెయిర్ రిమూవల్ క్రీం తయారీలో ఉపయోగించే రసాయనాల కారణంగా కొందరిలో ర్యాషెస్ వస్తాయి. చర్మం మంటగా ఉంటుంది. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఉపయోగించడం మంచిది. 

షేవింగ్

ఇంట్లోనే అవాంఛిత రోమాలను తొలగించుకోవాలనుకొనేవారు ఈ పద్ధతిని ఎక్కువగా అవలంబిస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన డిస్పోజబుల్ రేజర్స్, ఎలక్ట్రికల్ రేజర్స్ ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో లెగ్స్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ వద్ద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ సులభంగా, తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే వెంట్రుకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎందుకంటే రేజర్ వాటిని కట్ చేస్తుంది తప్ప.. లోపలి నుంచి తొలగించదు.

కాబట్టి ప్రతి రెండు మూడు రోజులకోసారి అవాంఛిత రోమాలను తొలగించుకోవాల్సి ఉంటుంది. రేజర్ ఉపయోగించి వెంట్రుకలను తొలగించుకొనేటప్పుడు చర్మం తెగిపోయే అవకాశాలుంటాయి కాబట్టి.. కాస్త జాగ్రత్తగా షేవ్ చేసుకోవాలి. షేవ్ చేసుకొనే ముందు  షేవింగ్ క్రీం లేదా సబ్బు రాసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా షేవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ రేజర్ ఉపయోగిస్తే సబ్బు లేదా షేవింగ్ క్రీం ఉపయోగించకూడదు. వెంట్రుకలు పెరుగుతున్న దిశకు వ్యతిరేక దిశలో షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాక్సింగ్

వ్యాక్సింగ్ చేసేటప్పుడు కాస్త నొప్పిగా అనిపించినా దీర్ఘకాలం పాటు అవాంఛిత రోమాల సమస్య ఉండదు కాబట్టి.. ఎక్కువ మంది unwanted hair తొలగించుకోవడానికి వ్యాక్సింగ్ చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పద్ధతిలో ఫేషియల్ హెయిర్, అండర్ ఆర్మ్స్, లెగ్స్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ వద్ద ఉన్న అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. వ్యాక్సింగ్ చేసుకోవడానికి సెలూన్‌కి వెళ్లేవారు కొందరైతే.. ఇంట్లోనే వ్యాక్సింగ్ కిట్ సాయంతో అవాంఛిత రోమాలు తొలగించుకొనేవారు కూడా ఉంటారు. మీరు వ్యాక్సింగ్ కిట్ ఉపయోగించి వెంట్రుకలను తొలగించుకోవాలనుకొంటే.. స్ట్రిప్‌ను చర్మానికి అతికించి చర్మాన్ని గట్టిగా పట్టుకొని వ్యతిరేక దిశలో వేగంగా లాగాల్సి ఉంటుంది.

నెమ్మదిగా తీస్తే నొప్పి ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఎక్కడి వెంట్రుకలు అక్కడే ఉంటాయి. అదే కోల్డ్ వ్యాక్స్ లేదా హాట్ వ్యాక్స్ ఉపయోగించి వెంట్రుకలు తొలగించుకోవాలంటే.. స్పాచులాతో వెంట్రుకలు పెరుగుతున్న దిశలో వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత  డిస్పోజబుల్ వ్యాక్స్ స్ట్రిప్స్ వ్యాక్స్ పై ఉంచి.. వ్యాక్స్ రాసిన దిశలోనే గట్టిగా ఒత్తాలి. ఆ తర్వాత చర్మాన్ని గట్టిగా పట్టుకొని వ్యతిరేక దిశలో పైకి లాగితే సరిపోతుంది. దీనికోసం డిస్పోజబుల్ వ్యాక్స్ స్ట్రిప్స్‌కి బదులుగా పాత జీన్స్ క్లాత్ కూడా ఉపయోగించవచ్చు. వ్యాక్సింగ్ ద్వారా అవాంఛిత రోమాలను తొలగించుకొంటే.. రెండు నుంచి నాలుగు వారాల పాటు వెంట్రుకలు పెరగకుండా ఉంటాయి. వ్యాక్సింగ్ ద్వారా ఫేసియల్ హెయిర్ తొలగించుకోవాలనుకొంటే మాత్రం పార్లర్‌కి వెళ్లడమే మంచిది.

త్రెడ్డింగ్

ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి, వ్యాక్సింగ్ చేసినా.. అక్కడక్కడా మిగిలిపోయిన వెంట్రుకలను తొలగించడానికి త్రెడ్డింగ్ చేస్తారు. ఈ పద్ధతిలో అప్పర్ లిప్, ఐబ్రోస్, గడ్డం దగ్గర పెరిగే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. త్రెడ్డింగ్ చేయడం ద్వారా వారం నుంచి పదిరోజుల వరకు అవాంఛిత రోమాలకు దూరంగా ఉండవచ్చు. అయితే త్రెడ్డింగ్ చేసుకోవడం అలవాటు లేకపోతే.. దాని జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే దారం వల్ల చర్మం తెగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఐబ్రోస్ షేపవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

ట్వీజింగ్

కనుబొమ్మలు చక్కగా షేప్ చేసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించవచ్చు. కనురెప్పలతో పాటు అప్పర్ లిప్, చిన్ దగ్గర పెరిగిన వెంట్రుకలను తొలగించుకోవచ్చు. ట్వీజింగ్ చేసుకొంటే.. సుమారు రెండు వారాల పాటు రోమాలు తిరిగి పెరగకుండా ఉంటాయి. ట్వీజింగ్ ద్వారా ఒక్కొక్క వెంట్రుకనే తొలగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది.

ఎపిలేటర్

ఇంటి దగ్గరే అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకొనేవారు.. ఎపిలేటర్ సాయంతో ఆ పనిని సులువుగా చేసుకోవచ్చు. ఇది వెంట్రుకలను రూట్‌తో సహా తొలగిస్తుంది కాబట్టి.. ఎక్కువ రోజులు అవాంఛిత రోమాలకు దూరంగా ఉండవచ్చు. ఈ పరికరంతో కాళ్లు, చేతులపై ఉన్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు.

షేవింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు.. గుచ్చుకోకుండా ఉండాలంటే..?

లేడీ పార్ట్స్ దగ్గర పెరిగే.. అవాంఛిత రోమాలను సులభంగా తొలగించే చిట్కాలు

ఈతరం అమ్మాయిలకు ఉప‌క‌రించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..

Read More From Beauty