Beauty

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. తలస్నానం ఇలా చేయాల్సిందే..!

Lakshmi Sudha  |  Mar 8, 2019
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. తలస్నానం ఇలా చేయాల్సిందే..!

మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉందా? రఫ్‌గా తయారై డల్‌గా కనిపిస్తోందా? వెంట్రుకల చివర్లు చిట్లిపోతున్నాయా? ఎన్ని రకాల Hair care ఉత్పత్తులు ఉపయోగించినా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదా? బహుశా.. మీరు తలస్నానం చేసే పద్ధతి సరిగ్గా లేదేమో..!  దాని కారణంగానే అలా జరుగుతూ ఉండవచ్చు. తలస్నానం చేసే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. మేం చెప్పే ఈ చిట్కాలు పాటించండి.

1. గోరు వెచ్చని నీటితో.. 

సాధారణంగా తలస్నానం చేసేటప్పుడు బాగా వేడిగా ఉన్న నీళ్లు ఉపయోగిస్తాం. దీని వల్ల జుట్టు పొడిబారిపోయే అవకాశం ఉంది. అందుకే తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉపయోగించాల్సి ఉంటుంది. నీటిని పోసుకొనేటప్పడు తలను మసాజ్ చేసుకోవడం మరచిపోవద్దు. మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే మాడుపై పేరుకొన్న మురికి, జిడ్డు వంటివి సైతం త్వరగా వదిలిపోతాయి. ఫలితంగా కురులు ఆరోగ్యంగా తయారవుతాయి.

2. ముందుగానే కండిషనర్

సాధారణంగా మనం Shampoo చేసుకొన్న తర్వాత కండిషనర్ రాసుకొంటాం. కానీ షాంపూ చేసుకోవడానికి ముందే కొద్దిగా కండిషనర్ తలకు రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు అవసరమైన తేమ అంది షైనీగా, బౌన్సీగా మారుతుంది. అలాగే షాంపూ కారణంగా జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

3. షాంపూ ఇలా చేసుకోవాలి.

కండిషనర్ అప్లై చేసుకొన్న తర్వాత.. షాంపూ చేసుకోవడం మొదలుపెట్టాలి. సాధారణంగా మన స్కాల్ప్ జిడ్డుగా ఉంటుంది. వెంట్రుకల చివర్లు పొడిగా ఉంటాయి. కాబట్టి కుదుళ్ల వద్ద ఎక్కువగా రుద్దుకోవాల్సి ఉంటుంది. చివర్లను అంత ఎక్కువగా షాంపూ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఎంత అవసరమో అంతే షాంపూ ఉపయోగించండి. మరీ ఎక్కువ ఉపయోగిస్తే జుట్టు పొడిబారిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. సల్ఫేట్, పారాబెన్ రహిత షాంపూలు వాడటం మంచిది.

4. కుదుళ్లకు మసాజ్

షాంపూ చేసుకొనేటప్పుడు వేళ్ల‌తో మాడుపై గుండ్రంగా రుద్దుకొనే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కులు పడిపోతుంది. దీని వల్ల వెంట్రుకలు మరింత ఎక్కువగా రాలిపోవచ్చు. కాబ‌ట్టి ఇలా చేయకూడదు. వేళ్లను నిదానంగా ఉంచి కుదుళ్ల దగ్గర నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా తయారవుతాయి. గట్టిగా రుద్దడం వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Also Read: చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి..

5. రెండోసారి షాంపూ అవసరం లేదు.

షాంపూ ఎక్కువ ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. అందుకే షాంపూ రెండోసారి ఉపయోగించాల్సిన అవసరం లేదని చెబుతున్నాం. మొదటి సారి షాంపూ పెట్టుకొంటున్నప్పుడే.. జుట్టు మొత్తం శుభ్రం అయ్యే వరకు రుద్దుకోవడం మంచిది. ఇలా చేస్తే రెండోసారి షాంపూ ఉపయోగించాల్సిన అవసరం రాదు. అలాగే తలస్నానానికి ముందు.. కొందరికి తలకు నూనె పెట్టుకొనే అలవాటు ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా నూనె రాసుకొంటే జిడ్డు వదలక మళ్లీ మళ్లీ షాంపూ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో నూనె పెట్టుకోవడం మంచిది.

6. చివరిగా చన్నీళ్లు

షాంపూ చేసుకోవడం పూర్తయిన తర్వాత జుట్టును నెమ్మదిగా పిండాలి. ఇలా చేయడం వల్ల అధికంగా ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కండిషనర్ రాసుకొని అలా కాసేపు వదిలేయాలి. కండిషనర్‌ను మీరు ఎంత ఎక్కువ సేపు ఉంచుకొంటే.. జుట్టు దాన్ని అంత ఎక్కువగా పీల్చుకొంటుంది. చివరిగా చన్నీళ్లను తలపై పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మెరిసిపోతుంది.

Also Read: మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా?? ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

7. టవల్‌కి బదులు టీషర్ట్

తలస్నానం చేయడం మాత్రమే కాదు.. తల ఆరబెట్టుకోవడం కూడా సరైన పద్ధతిలోనే జరగాలి. తల తుడుచుకోవడానికి టవల్‌కు బదులుగా పాత టీషర్ట్ ఉపయోగించండి. దీన్ని కాసేపు తలకు చుట్టుకొంటే సరిపోతుంది. దీని వల్ల జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. దీని కోసం మైక్రోఫైబర్ క్లాత్ కూడా ఉపయోగించవచ్చు. టవల్‌తో గట్టిగా తుడుచుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడటం, తెగిపోవడం వంటివి జరగొచ్చు.

Images: Shutterstock

Read More From Beauty