అతివలు అన్నింటా అభివృద్ధి చెందుతూ ఆకాశాన్ని సైతం అందుకుంటున్న ఈ రోజుల్లో కూడా సమాజంలో స్త్రీకి ఉన్న భద్రత ప్రశ్నగానే మిగిలిపోతోంది. మహిళల రక్షణ నిమిత్తం ఎన్ని కొత్త చట్టాలు రూపొందించి అమలు చేస్తోన్నా రోజూ ఎంతోమంది అతివలు మృగాళ్లు చేస్తోన్న దాడులకు బలైపోతూనే ఉన్నారు. అందుకే వీటిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు, అరికట్టేందుకు.. ప్రభుత్వాలు, సంబంధిత అధికారుల సహా పలు మహిళా సంఘాలు సైతం నడుం బిగిస్తున్నాయి.
అయితే ఇలాంటి లైంగికపరమైన దాడులు, వేధింపుల నేపథ్యంలో కొందరు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి జరిగింది అందరికీ చెబుతుంటే; ఇంకొందరు మాత్రం పలు కారణాల రీత్యా వాటిని బయటపెట్టడం లేదు. ముఖ్యంగా పని చేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురవుతుంటే చాలామంది మహిళలు తమలో తామే కుమిలిపోతుంటారు. ఇలాంటి స్త్రీలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే సారప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ (Soroptimist International) అనే స్వచ్ఛంద సంస్థ షౌట్ (SH(OUT))ని ప్రారంభించింది.
గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలబడుతోంది ఈ సంస్థ. మన దేశంలో తెలంగాణతో కలిపి మొత్తం 15 రాష్ట్రాలలో ఈ సంస్థ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసే నిమిత్తం హైదరాబాద్ పోలీసు అధికారులను సంప్రదించి, వారితో కలిసి సంయుక్తంగా ఈ సమస్యపై పోరాడాలని సంకల్పించుకున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ నేర పరిశోధనల అదనపు కమిషనర్ శిఖా గోయల్ (Shikha Goel) సహకారంతో షౌట్ ( SH(OUT) )ని ఏర్పాటు చేశారు. ఇందులో SH – అంటే లైంగిక వేధింపులు (Sexual Harassment). వాటిని బయటపెడుతూ; మహిళలకు అండగా నిలుస్తుందని అందరికీ తెలిసేలా ఈ పదాలను కూర్చి నామకరణం చేశారు అధికారులు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి సమావేశం జనవరి మూడో వారంలో హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) ముఖ్యఅతిథిగా హాజరైంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ఇతర దేశాల్లో మహిళలను చక్కగా గౌరవిస్తున్నారని, కానీ మన దేశంలోనే స్త్రీలను పూజించాలి అనేది కేవలం మాటలకే పరిమితం అయిపోతోందని, మహిళలను గౌరవించే పురుషుల సంఖ్య తక్కువేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపుల పట్ల మహిళలు మౌనం వహించకుండా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, అలా మాట్లాడే మహిళలకు అందరూ తగిన సపోర్ట్ అందించాలని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఈ షౌట్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉండాలనే విషయం కూడా ఈ సందర్భంగా చర్చించారు. సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు ఈ ప్యానెల్‌లో సభ్యులుగా ఉంటే విభిన్న రంగాల నుంచి రకరకాల సమస్యలతో ముందుకు వచ్చే మహిళలకు న్యాయం చేయవచ్చన్న ఉద్దేశంతో పలు రంగాలకు చెందిన ప్రముఖ మహిళలనే ఇందులో సభ్యులుగా నియమించాలని నిర్ణయించుకున్నారు.
ఇలా ప్యానెల్‌లో ఎంపికైన సభ్యులు అందరూ కలిసి మహిళలు ఎక్కువగా పని చేసే ప్రదేశాల్లో జరిగే లైంగిక, ఇతరత్రా దాడుల గురించి అందరికీ అవగాహన కల్పిస్తారు. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని చట్టరీత్యా ఎలా శిక్షించవచ్చు? అందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో కూడా వివరిస్తారు. ఇలా సమాజంలోని స్త్రీలు లైంగిక వేధింపులు ఎదుర్కొనే క్రమంలో వారికి మానసికంగా ధైర్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగనుందీ షౌట్.
నిరక్షరాస్యులైన మహిళలకు ఈ వేధింపుల పట్ల అవగాహన కల్పించేందుకు తెలుగు & ఉర్దూ భాషల్లో వారికి సులభంగా అర్థమయ్యే విధంగా కొన్ని వీడియోలు రూపొందించారు. ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపే బాధ్యతను వెల్ నెస్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న దీపిక చలసాని (Deepika Chalasani)కి అప్పగించారు.
ఈమెతో పాటు పలు కార్పొరేట్ సంస్థల సీఈఓలు, కమిషనర్లు, అధిపతులు, పలు రంగాల్లో కీలక పదవుల్లో ఉన్న మహిళలు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవారు, షీ టీమ్స్ సభ్యులు కూడా ఈ ప్యానెల్‌లో భాగం కానున్నారు. వీరంతా “పని చేసే ప్రదేశంలో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల నివారణ” కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాక్ట్‌తో పాటు.. 2013 సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 (Sexual Harassment Of Women at Workplace Act 2013) పై కూడా అందరిలోనూ అవగాహన కల్పిస్తారు.
మన దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన SHE టీమ్స్ ద్వారా హైదరాబాద్ మరియు తెలంగాణ (Telangana)లో ఆకతాయిల వేధింపులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే షౌట్ ద్వారా పని ప్రదేశంలో మహిళలకు ఎదురవుతోన్న వేధింపులకు కూడా అడ్డుకట్ట పడాలని మనమంతా కోరుకుందాం.
Images: Facebook/Hyderabad Police
ఇవి కూడా చదవండి
మెట్రో రైల్.. హైదరాబాద్‌కు ఒక వరం.. ఇది నా అనుభవం..!
హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం
Read More From #MeToo
డ్రెస్‌కోడ్‌కి వ్యతిరేకంగా పోరాడాం.. విజయం సాధించాం : సెయింట్ ఫ్రాన్సిస్ విద్యార్థినులు
Sandeep Thatla