Entertainment

రణరంగం మూవీ రివ్యూ – యావరేజ్ గ్యాంగ్ స్టర్

Sandeep Thatla  |  Aug 15, 2019
రణరంగం మూవీ రివ్యూ – యావరేజ్ గ్యాంగ్ స్టర్

రణరంగం మూవీ రివ్యూ (Ranarangam Movie Review)

“గాడ్ ఫాదర్” సినిమా మొదలు ప్రపంచ సినీ చరిత్రలో.. గ్యాంగ్‌స్టర్ సినిమాలకి నాంది పడింది. ఆ సినిమా ప్రేరణగా ఎన్నో భాషల్లో మరెన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఈరోజు విడుదలైన శర్వానంద్ (Sharwanand ) ‘రణరంగం’ కూడా ఆ సినిమా నుండి స్ఫూర్తి పొంది తీసిన సినిమానే. ఈ విషయాన్ని దర్శకుడు సుధీర్ వర్మ స్వయంగా  చెప్పాడు. అలాగే “నాకు నచ్చిన ప్రతి సినిమా నుండి నేను కాపీ కొడతాను” అని నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడిగా ఇతనికి పేరుంది.

మెగాస్టార్ చిరంజీవి “సైరా నరసింహా రెడ్డి” మేకింగ్ వీడియోలో.. హైలైట్స్ ఇవే..!

ఇక రణరంగం సినిమా కథ విషయానికి వస్తే ..

దేవా (శర్వానంద్).. అతని నలుగురు స్నేహితులు 1990ల్లో విశాఖపట్నంలో బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటూ జీవించే ఓ గ్యాంగ్. ఆ తర్వాత అదే గ్యాంగ్ మద్యం స్మగ్లింగ్ దిశగా కూడా వెళ్తుంది.  అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే.. సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడాన్ని కథలో నేపథ్యంగా తీసుకున్నారు. లిక్క్ ప్రొహిబిషన్ టైంలో..  విశాఖపట్నం నుండి ఒరిస్సా ప్రాంతానికి మద్యాన్ని స్మగ్లింగ్ చేసిన దేవా గ్యాంగ్ ఆ తర్వాత అనుకోని చిక్కుల్లో పడుతుంది.

ఆ అక్రమ వ్యాపారంలో స్థానిక రాజకీయ నాయకుడితో గొడవలు.. ప్రత్యర్థులతో సవాళ్లు.. ఇవన్నీ మామూలే. ఈ క్రమంలో అనుకోకుండా… ఇవన్నీ వదిలేసి దేవా స్పెయిన్ వెళ్లిపోతాడు. అక్కడే  స్థిరపడతాడు. అతను అలా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? దానికి కారణమేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అయితే ముందుగానే “గాడ్ ఫాదర్” చిత్రం నుండి స్ఫూర్తి పొందాను అని దర్శకుడు చెప్పిన తరువాత.. ఈ సినిమాలోని హైలైట్ అంశాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం.

* సాంకేతిక అంశాలు – కెమెరా & ప్రొడక్షన్ డిజైన్

1990లలో సాగే కథతో నిర్మించిన ఈ చిత్రంలో.. అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా సెట్స్ & లైటింగ్ వంటివి చాలా ప్రధానం. ఆ రెండు విభాగాలు ఈ చిత్రానికి రెండు కళ్లుగా పనిచేశాయి అని చెప్పాలి. రవీంద్ర కుమార్ ప్రొడక్షన్ డిజైన్ & దివాకర్ మణి కెమెరాపనితనం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. 

* నేపధ్య సంగీతం – ప్రశాంత్ పిళ్ళై

ప్రశాంత్ పిళ్ళై అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి మరొక అదనపు బలం. ఇటువంటి గ్యాంగ్ స్టర్ సినిమాల్లో సన్నివేశాల స్థాయిని పెంచడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

* శర్వానంద్ 

20 ఏళ్ళ కుర్రాడిగా.. అలాగే 40 ఏళ్ళ మధ్యవయస్కుడిగా కూడా చాలా చక్కగా అభినయించాడు శర్వానంద్. సరదా సన్నివేశాల్లో ఎంత చలాకీగా అయితే ఉన్నాడో.. అలాగే కీలక సన్నివేశాల్లో చాలా మంచి అభినయాన్ని ప్రదర్శించాడు. ఒకరకంగా శర్వానంద్‌లోని నటుడిని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు విభిన్నమైన షేడ్స్‌ని ఈ సినిమాలో చూడవచ్చు.

“కొబ్బరిమట్ట” మూవీ రివ్యూ – ఇది సంపూ మార్క్ కామెడీ

* మాటలు – సుధీర్ వర్మ

కథ, కథనం ఊహించే విధంగానే ఉన్నప్పటికి.. సందర్భోచితంగా వచ్చే సన్నివేశాలు.. పాత్రలు పలికే సంభాషణలు చాలా వరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి అని చెప్పొచ్చు. ప్రధానంగా దేవ స్నేహితుడు సుదర్శన్ పాత్ర.. అలాగే బ్రహ్మాజీ పాత్రలు సినిమాలో నవ్వులు పూయించాయి. అలాగే సినిమాలో అప్పటి రాజకీయ పరిస్థితులని బట్టి ఆనాటి సీఎం మద్యపాన నిషేధాన్ని విధించడం & అలాగే పదవి మార్పిడి వంటి అంశాలని సంభాషణలలో జోడించడం జరిగింది.

అలాగే ఈ సినిమాలో బలహీనంగా ఉన్న అంశాలు – కథ & కథనం. ఇప్పటివరకు ఇలాంటి కథలను తెలుగు సినిమా తెరపై మనం చూసేశాం. ‘రణరంగం’ కథ & కథనాలు కూడా దాదాపు మనకు ఆ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. అయితే ఈ సినిమా ద్వారా సుధీర్ వర్మ పాతకథనే.. తన స్టైల్‌ని చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని పాత్రకి మంచి స్క్రీన్స్ ప్రెజెన్స్ దొరకగా.. మరొక హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రకి అంత ప్రాధాన్యం లేదనే చెప్పాలి.

ఈ సినిమాలో ఆసక్తికర సన్నివేశాలు ఉన్నప్పటికి.. అవి ప్రేక్షకులని అనుకున్నంతగా థ్రిల్ చేయలేకపోవడమో లేదా కథనం కాస్త నెమ్మదిగా వెళుతూ.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమో చేశాక..  ఇది ఒక యావరేజ్ గ్యాంగ్ స్టర్ చిత్రంగా నిలిచింది.

ఆఖరుగా … గ్యాంగ్ స్టర్ చిత్రాలని చూసేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇతర ప్రేక్షకులు మాత్రం ఒకసారి ట్రై చేయవచ్చు.

“మన్మథుడు” మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)

Read More From Entertainment