Diet

ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు మీకుందా? అయితే ఇది చదవాల్సిందే..

Soujanya Gangam  |  Sep 11, 2019
ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు మీకుందా? అయితే ఇది చదవాల్సిందే..

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ (Coffee) తాగనిదే.. మనలో చాలామందికి అస్సలు బుర్ర పనిచేయదు. బెడ్ కాఫీతో రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు. తెల్లవారుఝామునే ఛాయ్ లేదా కాఫీని సేవించడం వల్ల.. రోజును ఫ్రెష్‌గా ప్రారంభించే వీలుంటుందనేది వారి ఫీలింగ్. మీరూ కూడా ఇలా బెడ్ టీ లేదా బెడ్ కాఫీ తాగేవారిలో ఒకరా? అయితే  కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

రాత్రి నుండి ఖాళీగా ఉన్న కడుపులో.. ఉదయాన్నే టీ (Tea) లేదా కాఫీ పోయడం వల్ల.. మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల టీ లేదా కాఫీ తాగడం వల్ల.. శరీరానికి ఏ సమస్యా లేకపోయినా.. ఉదయాన్నే తాగడం వల్ల మాత్రమే ఇబ్బందులున్నాయట. అవేంటంటే..

1. రాత్రి నుండి ఏమీ తినకుండా.. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల మన పిత్తాశయం పై ప్రభావం పడుతుందట. దీని వల్ల పైత్య రసం పెరుగుతుంది. శరీరంలో పైత్య రసం పెరగడం వల్ల.. తల నొప్పి రావడంతో పాటు గుండెల్లో మంటగా కూడా అనిపిస్తుంది.

2. ఉదయాన్నే వేరే ఏదీ తీసుకోకుండా టీ లేదా కాఫీ తాగడం వల్ల.. మీ పేగులపైనా ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ ఆకలి తగ్గిపోవడంతో పాటు.. జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిగా మారుతుంది.

3. టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.

4. రాత్రి మీరు తిన్న ఆహారం అర్థ రాత్రి వరకూ నెమ్మదిగా జీర్ణమవుతుంది.  అందుకే ఉదయాన్నే మన శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. కాబట్టే ఉదయాన్నే ఓ లీటర్ మంచి నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. మంచినీటికి బదులుగా పరగడుపునే టీ, కాఫీ తాగడం వల్ల.. మళ్లీ మీరు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశముంది. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

5. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోలా వంటివి తీసుకోవడం వల్ల.. కళ్లు తిరగడంతో పాటు వాంతులయ్యే అవకాశం కూడా ఉంది. 

6. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే.. అదో వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అది తాగకపోతే మీరు రోజంతా అలసిపోయిన ఫీలింగ్‌కి గురవుతారు. 

7. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పనిచేయకపోయినా.. అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

8. ఉదయాన్నే బ్రష్ చేయకుండా టీ, కాఫీ తాగేవారికి.. పళ్లల్లో పిప్పి, పంటి నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

మరి, పరిష్కారమేంటి?

మీకు టీ లేదా కాఫీ అంటే చాలా ఇష్టమా? ఉదయాన్నే టీ తాగకపోతే ఏదోలా ఉంటుందా? అయితే మీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల.. టీ లేదా కాఫీ అలవాటును మీ ఆరోగ్యానికి హానికరంగా మారకుండా చూసుకోవచ్చు. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగాలనిపిస్తే దానికి బదులుగా.. అంతే వేడిగా ఉన్న నీటిని తీసుకోండి. ఆ నీటిలో డ్రైఫ్రూట్స్ వంటివి నానబెట్టుకొని.. నీళ్లు తాగి వాటిని తినడం మరింత మంచిది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల రాత్రంతా కడుపులో నిల్వ ఉన్న యాసిడ్ వల్ల.. మన శరీరానికి ఏ సమస్యా ఎదురుకాకుండా ఉంటుంది.

ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కాస్త పోషకభరితమైనదైతే.. శరీరానికి తక్షణ శక్తి అంది యాక్టివ్‌గా ఉండే వీలుంటుంది. కావాలంటే ఆ తర్వాత టీ తాగవచ్చు. అయితే ఎంత ఇష్టమైనా సరే.. టీ, కాఫీల సంఖ్యను కేవలం ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ టీ తాగాలనిపిస్తే మామూలు టీ బదులు గ్రీన్ టీ, స్పైసీ టీ వంటివి ప్రయత్నించవచ్చు.

కాఫీ బదులుగా గ్రీన్ కాఫీ, బ్లాక్ కాఫీ ట్రై చేయవచ్చు. అంతేకాదు.. టీ, కాఫీల్లో చక్కెరను కూడా వీలైనంతగా తగ్గించడం వల్ల.. మీ శరీరం దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటుంది. పాలను కూడా వీలైనంత తక్కువ చేయడం వల్ల.. మీ జీర్ణ వ్యవస్థకు అందులోని లాక్టోజ్ వల్ల ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Diet