Food & Nightlife

ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్

Sandeep Thatla  |  Mar 16, 2019
ఆహా.. ఏమి రుచి..! ఈతరం యువతను.. అమితంగా ఆకర్షిస్తున్న కర్రీ పాయింట్స్

మధ్యాహ్నం 1 గంట అవుతోంది. అప్పటివరకు పోటీ పరీక్షలకు సిద్దమవుతూ.. చదువులో మునిగిపోయిన శ్రావణి కడుపులో ఆకలి గంట మోగడంతో చుట్టూ ఓసారి పరికించి చూసింది. ఆ తర్వాత తన చేతివాచీని  చూసి.. ఠక్కున లేచింది. తన టైం టేబుల్ ప్రకారం.. ఒక అరగంటలో భోజనం ముగించి మళ్ళీ తన కోర్సు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అలా అనుకుంటూనే లేచి..  రెండు గ్లాసుల బియ్యం కడిగి..  కుక్కర్ మీద పెట్టింది. తర్వాత తన రూమ్‌కి దగ్గరలో ఉన్న కర్రీ పాయింట్ (Curry Point) వద్దకు వెళ్లి.. తనకు నచ్చిన వెజ్, నాన్ వంటకాలు ఆర్డర్ ఇచ్చింది.

మహానగరమైన హైదరాబాద్‌లో (Hyderabad) శ్రావణికి కర్రీపాయింట్స్‌కి వెళ్లి.. తనకు నచ్చిన కర్రీస్ కొనడం కొత్తేమీ కాదు. అదేంటి.. హాయిగా రూమ్‌లో వంట చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే… దానికి కూడా ఆమె దగ్గర సమాధానం రెడీగా ఉంటుంది.

“అసలే పరీక్షలు.అలాంటప్పుడు టైం వృధా చేసుకోవడం ఎందుకు? హాయిగా ఒక పదిహేను నిమిషాలు రైస్ కుక్కర్‌ పెడితే అన్నం సిద్ధమైపోతుంది. ఇంతలో నేను కర్రీ పాయింట్‌కు వెళ్లి.. నాకు నచ్చిన కూరలు తెచ్చుకోవచ్చు.  ఇలా చేస్తే..  మొత్తం అరగంటలో భోజన కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు కదా” అని అంటుందామె. అమీర్ పేట, పంజాగుట్ట, మైత్రీవనం లాంటి ఏరియాల్లో.. కోర్సులు పూర్తి చేయడానికి దూర ప్రాంతాల నుండి వచ్చే యువతీ యువకులు.. నేడు ఎక్కువగా కర్రీ పాయింట్స్‌నే ఆశ్రయిస్తున్నారు. 

 

పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు లైఫ్ స్టైల్ ఒకలా ఉంటే.. దూర ప్రాంతాల నుండి సాఫ్ట్‌వేర్ మొదలైన రంగాల్లో ఉద్యోగాలు చేయడానికి కుటుంబాలతో వచ్చే అమ్మాయిల జీవన విధానం అందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు  సుమలతది ఉరుకుల పరుగుల జీవనం. ఈ మధ్యనే ఆమెకు పెళ్లయింది.

ఇంట్లో ఉండే ఇద్దరూ ఉద్యోగస్థులు కావడం.. అలాగే రోజు ఓవర్ టైంతో ఆఫీస్‌లోనే రాత్రి 9 అయిపోతుండడంతో.. అది వారికి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో వారికి లోకల్ కర్రీ పాయింట్స్.. మంచి సొల్యూషన్‌గా తోచాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసులో కష్టపడి.. మళ్లీ ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేని పక్షంలో..  కర్రీ పాయింట్ వారికి ఒక సమాధానంగా దొరికింది.

 

చెప్పుకుంటూ పోతే.. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు..! నేడు మహానగరాల్లో నివసించే విద్యార్థులు, ఉద్యోగులకు కర్రీ పాయింట్సే అసలు సిసలైన నేస్తాలు. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కర్రీ పాయింట్స్‌కు వెళ్లి కూరలు కొనేవారు కూడా ఈ మధ్యకాలంలో బాగానే పెరిగారు. అందుకు ప్రధానమైన కారణం.. తమకు నచ్చిన కూరలను తాము స్వయంగా చూసి కొనే సౌలభ్యం ఉండడం. 

ఒకప్పుడు మన ఇళ్లలో అమ్మ చేతి వంట తప్ప.. ఇంకేదీ రుచి చూసే అవకాశం ఉండేది కాదు. వేరే ప్రదేశాలకు, యాత్రలకు వెళితేనే.. బయట హోటల్‌లో తినే సౌలభ్యం ఉండేది. కానీ కాలం మారింది. మారిన కాలానుగుణంగా.. మన రోజువారీ పనులల్లో కూడా ఎన్నో మార్పులు సంభవించాయి. నేడు తాగునీటిని కూడా కొని సేవించే పరిస్థితి తలెత్తింది.

 

అదే బాటలో కర్రీ పాయింట్స్ కూడా పయనిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం పట్టణాలకి మాత్రమే పరిమితమైంది అనుకుంటే పొరపాటే! ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని (Two Telugu States) అన్ని మండల కేంద్రాల్లోనూ మనం ఈ కర్రీ పాయింట్స్‌ని చూడవచ్చు.

ఈ కర్రీ పాయింట్స్‌కి మొదటి వినియోగదారులు బ్యాచిలర్స్ అయితే.. ఆ తరువాత వారు వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీస్. పైగా ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం కూడా.. వీటి సక్సెస్‌కి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అందుకే ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలని భావించే నూతన ఎంట్రప్రెన్యూర్స్‌ని కూడా ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి. వీటి నిర్వహణకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కుకింగ్ స్కిల్స్ ఉన్న మంచి చెఫ్‌ని రిక్రూట్ చేసుకుంటే సరిపోతుంది. 

హైదరాబాద్‌లో విద్యార్థులు ఉండే వసతి గృహాలు మరియు కాలేజీల దగ్గరా.. అలాగే ఆఫీస్‌లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సైతం ఈ కర్రీ పాయింట్స్ సంఖ్యని ఎక్కువగా చూడవచ్చు. హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ స్టైల్‌లో నేడు పలువురు.. కర్రీ పాయింట్స్ బిజినెస్‌లు ప్రారంభిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి తెలంగాణలో.. ఈ వంటకం చాలా స్పెషల్..?

తెలంగాణ స్పెషల్ వంటకం – సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

ఉగాది వేళ.. ఈ వంట‌కాలు నోరూరించ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్నీ అందిస్తాయి..!

 

Read More From Food & Nightlife