( Allu Arjun Love Story )
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రేమ వివాహం.. దాదాపు ఇప్పటితరం యువ హీరోలకు సంబంధించి ప్రప్రథమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చిత్రసీమలో తమకంటూ ఒక ఇమేజ్ ఉన్న హీరోల్లో.. ఒక స్టైలిష్ లుక్‌తో పాటుగా.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులని అలరించిన నటుడు అల్లు అర్జున్ అనడంలో అతిశయోక్తి లేదు.
2003లో అల్లు అర్జున్ హీరోగా ‘గంగోత్రి’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. 2004లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం తనకు లవర్ బోయ్ ఇమేజ్ తీసుకొని వచ్చింది. ఆ తరువాతి కాలంలో వరుస హిట్స్ నమోదు చేస్తూ.. ‘దేశముదురు’ చిత్రం ద్వారా ఒక స్టార్ స్టేటస్ అందుకోగలిగారు ఆయన. ఇక అల్లు అర్జున్‌ని ముద్దుగా ఆయన ఇంట్లో ‘బన్నీ’ అని పిలుస్తుంటారు. అదే పేరు ఆ తరువాత కాలంలో ఫ్యాన్స్‌కు, సాధారణ ప్రేక్షకులకి కూడా అలవాటైపోయింది.
కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?
అయితే బన్నీ తన కెరీర్ తొలినాళ్ళలోనే అమ్మాయిలకు ఫేవరెట్ అయ్యాడనడంలో సందేహం లేదు. ప్లే బాయ్ ఇమేజ్‌తో హాట్ హీరోగా ఉండేవాడు. ఈ క్రమంలో తనకు కాబోయే భార్య ఎలా ఉంటే బాగుంటుందని.. అప్పట్లో మీడియా ప్రశ్నిస్తే, తన ఫాస్ట్ లైఫ్ స్టైల్‌ని అర్ధమే చేసుకునే భార్య అయితేనే బాగుంటుందని తను తెలిపాడు. ఎందుకంటే అప్పట్లో బన్నీ ప్రతి వారాంతం పబ్స్‌లోనే ఎక్కువగా గడిపేవాడట. ఆ విషయాన్ని ఆయన కూడా పలుమార్లు ఒప్పుకోవడం జరిగింది.
మరి ఇటువంటి ఓ విశాల దృక్పథం ఉన్న వ్యక్తికి.. ఎలాంటి భార్య దొరుకుతుందోనని బన్నీ స్నేహితులు, సన్నిహితులు అనుకొనేవారట. ఈ క్రమంలోనే బన్నీ ప్రేమ వ్యవహారం బయటకి తెలిసింది. ఇంతకీ ఆయన ప్రేమలో పడిన అమ్మాయి మరెవరో కాదు – తనే స్నేహ రెడ్డి (Sneha Reddy). బన్నీకి తన స్నేహితుల ద్వారా పరిచయమైన స్నేహ.. ఆ తర్వాత తన ప్రియురాలిగానూ మారింది. మొదట్లో ఆమె అల్లు అర్జున్ ప్రేమని తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మళ్లీ తనే ఆయన ప్రేమలో పడిపోయిందట.
ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే – బన్నీకి చిన్నతనం నుండి కూడా సినిమాలు అంటే విపరీతమైన అభిమానం. దాంతో చదువు పైన పెద్దగా ఆసక్తి చూపలేదు. దానితో 10వ తరగతితోనే.. చదువుకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. మరి స్నేహారెడ్డి విషయానికి వస్తే, ఆమె అమెరికాలో ఎంఎస్ చేసిన అమ్మాయి. వాళ్ళ తండ్రి కూడా హైదరాబాద్‌లో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు యజమానిగా ఉన్నారు. అందుకే వీరి ప్రేమకి చదువు పెద్ద అడ్డంకిగా మారింది. ఇదే టాపిక్ మీద అప్పట్లో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ తరుణంలో వీరి ప్రేమ వ్యవహారం గురించి.. అప్పట్లో ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసింది. దీనితో ఒక్కసారిగా ఆ అమ్మాయి ఎవరు? అల్లు అర్జున ప్రేమ వ్యవహారమేంటి? అనే ఆసక్తి ఆయన అభిమానుల్లోనూ పెరిగింది.
దర్శక ధీరుడు రాజమౌళి – రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?
ఇక అప్పుడు రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్… స్నేహా రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడారట. ఇరు కుటుంబాలు సమ్మతం తెలిపాక.. ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో తమ కుటుంబ విషయాలను.. తమ అనుమతి లేకుండా ఇలా కథనాలుగా ప్రసారం చేయడం పైన.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ఓ సినిమా కథ మాదిరిగానే.. ఈ ప్రేమకథ (Love Story) అనేక మలుపులు తిరగ్గా.. రకరకాల అడ్డంకుల తరువాత బన్నీ, స్నేహారెడ్డిలు 2011 మార్చి 6వ తేదీన ఒకటయ్యారు. వీరి 8 ఏళ్ళ ప్రేమకి గుర్తుగా అయాన్, అర్హలు జన్మించారు. కాకపోతే తన ప్రేమ వ్యవహారంలో భాగంగా.. ఇరు కుటుంబాలని ఒప్పించడానికి బన్నీ చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నాడని ఆయన సన్నిహితులు అంటుంటారు. దీనికి సంబంధించి ఒక ఫన్నీ డైలాగ్‌ను కూడా ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో ఆయన చెప్పడం విశేషం.
ఇక అల్లు అర్జున్‌కి పెళ్ళికి ముందు పార్టీలు, పబ్స్ అంటూ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయం గడిపే వ్యక్తిగా పేరుండగా… పెళ్లి తరువాత మాత్రం ఆయన తన సమయం మొత్తం కుటుంబానికే కేటాయించడం విశేషం. ఒక భర్తగా.. అలాగే తన ఇద్దరు పిల్లలకి తండ్రిగా.. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ.. ఇప్పుడు తనలోని ఒక కొత్త పాత్రని ఆస్వాదిస్తున్నాడట.
ఏదేమైనా… పెళ్ళికి ముందు ‘దేశముదురు’లా కనిపించినప్పటికి.. పెళ్లి తరువాత మాత్రం ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అన్నట్టుగా మారిపోయాడు అల్లు అర్జున్.
‘న్యాచురల్ స్టార్ నాని – అంజన’ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!