Beauty

వేసవిలో మేకప్ వేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

Sridevi  |  Jun 20, 2019
వేసవిలో మేకప్ వేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

సందర్భం ఏదైనా సరే.. దానికి తగ్గట్లుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆశపడని అమ్మాయిలుంటారా చెప్పండి? అందుకేగా మేకప్‌ని (Makeup)  ఆశ్రయించేది అంటారా? నిజమే.. అయితే మేకప్ వేసుకునే క్రమంలో కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం.

ముఖ్యంగా చెప్పాలంటే.. సందర్భానికి అనుగుణంగా మేకప్ వేసుకోవడానికి మనం ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. కానీ సీజన్‌కు తగినట్లుగా అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా చెమటలు పట్టించే వేసవిలో.. ఈ జాగ్రత్తలు ఇంకాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఇవేవీ పాటించకుండా మేకప్ వేసుకుంటే అంతే సంగతులు. అధిక చెమటకు మేకప్ చెదిరిపోవడం, కళ్లకు పెట్టిన కాటుక కరిగిపోవడం.. వంటి  సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే సమ్మర్‌లో మేకప్ వేసుకొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే.. ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదే- చర్మతత్వానికి అనుగుణంగా మేకప్ వేసుకోవడం. అవునండీ.. ఏ చర్మతత్వం ఉన్నవారు ఆ తత్వానికి నప్పే విధంగానే మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ మేకప్ అధిక సమయం నిలిచి ఉండడంతో పాటు, తాజాగానూ కనిపిస్తుంది.

ఈ కథనంలో మీరు తెలుసుకునే విషయాలు..

ఏ చర్మతత్వం ఉన్నవారు ఏ విధంగా మేకప్ వేసుకోవాలి?

పలు సందర్భాలకు అనుగుణంగా చేసుకునే మేకప్

సమ్మర్‌లో మేకప్ వేసుకునే విషయంలో చాలామందికి కలిగే సందేహాలు – వాటికి సమాధానాలు

Shutterstock

చర్మతత్వానికి అనుగుణంగా మేకప్

మనం వేసుకునే మేకప్ మన చర్మతత్వానికి అనుగుణంగా ఉన్నప్పుడే అది ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అలాగే తాజాగానూ కనిపిస్తుంది. మరి,  చర్మతత్వాన్ని బట్టి మేకప్ ఎలా వేసుకోవాలి? ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి తెలుసుకుందాం..

పొడి చర్మతత్వం గలవారు – పొడి చర్మం కలిగిన వారు తమ చర్మంలో వీలైనంత తేమ నిలిచి ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ క్రమంలో రాత్రి నిద్రించే సమయంలో తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మర్నాడు ఉదయం చర్మం తాజాగా కనిపిస్తుంది.

సాధారణంగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. కానీ  ఈ రోజుల్లో ఉదయం మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత చర్మకణాలు దానిని శోషించేంత వరకు వేచి చూసే సమయం అంతగా ఉండట్లేదనే చెప్పుకోవాలి. ఫలితంగా చర్మానికి అందే తేమ అరకొరగానే మిగిలిపోతోంది. అందుకే రాత్రి సమయంలో నిద్రపోయే ముందు.. చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. 

మేకప్ ఇలా వేసుకోవాలి –

– రోజూ రాత్రి సమయంలో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నప్పటికీ.. ఉదయాన్నే మేకప్ వేసుకునే ముందు కూడా లైట్ మార్నింగ్ మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి.

– ఆ తర్వాత చర్మంలో తేమ స్థాయులను అధిక సమయం పాటు నిలిపి ఉంచే హైడ్రేటింగ్ ప్రైమర్ రాసుకోవాలి.

– ఇప్పుడు చర్మఛాయ అంతా ఒకేలా సమానంగా కనిపించేలా బీబీ క్రీమ్ అప్లై చేసుకోవాలి. పొడి చర్మతత్వం ఉన్నవారు వేసవిలో మేకప్ వీలైనంత లైట్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకే బీబీ క్రీమ్ వంటివి తమ మేకప్‌లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.

– క్రీమ్ రాసుకున్న తర్వాత అవసరమైన చోట వాటర్ ప్రూఫ్ కన్సీలర్ అప్లై చేసుకోవాలి.

– ముఖంలో ఉన్న చిన్న చిన్న లోపాలు, మచ్చలు.. వంటి వాటిని కన్సీలర్‌తో కవర్ చేసుకున్న అనంతరం పౌడర్ రాసుకుంటే సరిపోతుంది.

– ఈ మేకప్ అంతా ఇలాగే అధిక సమయం పాటు నిలిచి ఉండాలంటే మేకప్ సెట్టింగ్ స్ప్రే ఉపయోగించాల్సిందే.

జిడ్డు చర్మతత్వం ఉన్నవారు –

మేకప్ విషయంలో అధిక సమస్యలు ఎదుర్కొనేది జిడ్డు చర్మం కలవారే. అతి తక్కువ సమయంలోనే చర్మం జిడ్డుగా మారిపోవడం ఒక సమస్య అయితే.. వేసవిలో ఎదురయ్యే అధిక చెమట సమస్య వీరి ఇబ్బందులను మరింత పెంచేస్తుంది. అందుకే మేకప్ వేసుకునే క్రమంలోనే.. కొన్ని చిట్కాలు పాటిస్తూ జాగ్రత్తపడడం ద్వారా ఈ తరహా చర్మతత్వం గలవారు అధిక సమయం ఫ్రెష్ లుక్‌తో మెరిసిపోవచ్చు.

మేకప్ ఇలా వేసుకోవాలి –

– జిడ్డు చర్మం కలవారు ప్రైమర్ అప్లై చేసుకోవడం ద్వారా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టాలి. ఇది చర్మానికి, మేకప్ ఉత్పత్తులకు మధ్య వారధిలా పని చేస్తుంది.

– ఆ తర్వాత చాలా తక్కువ మోతాదులో ఫౌండేషన్ తీసుకొని సమానంగా పరుచుకునేలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి.

– వీరు పౌడర్ ఉత్పత్తులకు బదులుగా క్రీమ్ తరహావి ఎంచుకోవడం మంచిది.

– అలాగే చెమట పట్టినా చెదిరిపోకుండా ఉండే ఉత్పత్తులను మేకప్ వేసుకోవడానికి ఉపయోగిస్తే మరీ మంచిది.

– ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కన్సీలర్, ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోవడం ద్వారా ఈ చర్మతత్వం కలవారు తమ మేకప్‌ని సింపుల్ గా పూర్తి చేసేయచ్చు.

– అలాగే అందమైన అధరాలకు టింటెడ్ లిప్ బామ్ అప్లై చేసుకోవడం ద్వారా అధిక సమయం అందంగా కనిపించవచ్చు.

కాంబినేషన్ చర్మతత్వం ఉన్నవారు –

సాధారణంగా చర్మం పొడిగా లేదా జిడ్డుగా ఉండడం అన్నది మనకు తరచూ ఎవరో ఒకరిలో కనిపించేదే. కానీ కొందరిలో మాత్రం టి- జోన్ (నుదురు, ముక్కు, గడ్డం) వద్ద జిడ్డుగా ఉండి.. మిగతా భాగాలైన చెంపలు, కళ్ల చుట్టూ ఉండే చర్మం మాత్రం పొడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనినే కాంబినేషన్ స్కిన్ అంటారు. ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు.. కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ వేసవిలో వీరు ఎదుర్కొనే సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

మేకప్ ఇలా వేసుకోవాలి –

– ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు మేకప్ వేసుకోవడానికి ముందు తప్పనిసరిగా చర్మాన్ని క్లెన్సింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రపరుచుకోవాల్సి ఉంటుంది.

– అలాగే మేకప్ వేసుకోవడానికి ముందు కాస్త మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే చర్మం తాజాగా కనిపిస్తుంది.

– ఇప్పుడు ముందుగా ప్రైమర్ అప్లై చేసుకోవాలి.

– అనంతరం బీబీ క్రీమ్ లేదా ఫౌండేషన్ సహాయంతో చర్మఛాయ సమానంగా కనిపించేలా చేయాలి

– ఈ చర్మతత్వం ఉన్నవారు కాంటూరింగ్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది.

– అలాగే మేకప్‌లో భాగంగా హైలైటర్‌ని కూడా విధిగా అప్లై చేసుకోవాలి.

– చెంపలకు బ్లష్ అప్లై చేసుకోవాలి. అయితే సాధారణంగా ఉపయోగించే పౌడర్ తరహావి కాకుండా క్రీమీ లేదా లిక్విడ్ రూపంలో ఉన్న షేడ్స్ ఉపయోగిస్తే లుక్ మరింతగా ఇనుమడిస్తుంది.

సాధారణ చర్మతత్వం ఉన్నవారు –

సాధారణ చర్మం కలవారు వేసవి సమయంలో ఎదురయ్యే.. అధిక చెమట సమస్యను ఎదుర్కొంటే చాలు.. వారు వేసుకున్న మేకప్ అధిక సమయం నిలిచి ఉండడంతో పాటు తాజాగానూ కనిపిస్తుంది.

మేకప్ ఇలా వేసుకోవాలి –

– ఈ తరహా చర్మతత్వం గలవారు మేకప్ వేసుకోవడానికి ముందు ప్రైమర్ అప్లై చేసుకోవడం ద్వారా చర్మాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది.

– ఇప్పుడు మీ చర్మతత్వానికి నప్పే నాణ్యమైన ఫౌండేషన్‌ని ఎంపిక చేసుకుని దానిని అప్లై చేసుకోవాలి. అలాగే కన్సీలర్‌తో చిన్న చిన్న లోపాలు, కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు.. వంటి వాటిని సైతం కవర్ చేసుకోవాలి.

– ఒకవేళ మీ ముఖం నాజూగ్గా కనిపించాలని అనుకుంటే కాంటూరింగ్ కూడా చేసుకోవచ్చు. లేదా బ్రాంజ్ పౌడర్ ఉపయోగించి నుదురు, ముక్కు, చెంపల వద్ద మీ లుక్ స్లిమ్‌గా కనిపించేలా చేసుకోవచ్చు.

– ఇప్పుడు కళ్లకు ఐ లైనర్, మస్కారా, ఐ షాడో.. వంటివి అప్లై చేసుకుని, చెంపల వద్ద బ్లష్ అప్లై చేసుకోవడంతో మీ లుక్‌ని పూర్తి చేయచ్చు.

– ఆసక్తి ఉన్నవారు హైలైటర్‌ని కూడా తమ మేకప్‌‌లో భాగం చేసుకోవచ్చు. చివరిగా అధరాలకు నచ్చిన షేడ్ లిప్ స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత.. సెట్టింగ్ స్ప్రే ఉపయోగించడం ద్వారా ఆ లుక్‌ ని అధిక సమయం అలాగే తాజాగా కనిపించేలా చేయచ్చు.

సందర్భానికి అనుగుణంగా మేకప్..

సీజన్ ఏదైనా సరే.. సందర్భానికి తగినట్లుగా మనల్ని మనం అలంకరించుకున్నప్పుడే అందరిలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవగలం. ఈ క్రమంలోనే మనం హాజరయ్యే సందర్భానికి తగినట్లుగా మేకప్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వేసవిలో ఇలాంటి సందర్భాలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇవి సెలవు రోజులు. అందుకే సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలన్నా, టూర్స్‌కి చెక్కేయాలన్నా, కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి హాజరు కావాలన్నా.. ఇది చాలా మంచి సమయం. మరి, వీటిలో కొన్ని ముఖ్యమైన సందర్భాలకు ఏ విధంగా మేకప్ వేసుకోవాలో చూద్దాం..

సింపుల్‌గా ఉండే మేకప్..

కొంతమంది సందర్భం ఏదైనా సరే.. తమ లుక్ చాలా సింపుల్‌గా ఉండాలని భావిస్తుంటారు. మీరూ అంతేనా?? అయితే మేకప్ కూడా వీలైనంత వరకు సింపుల్‌గా ఉండాల్సిందే. మీరు చేయాల్సిందల్లా మీ చర్మానికి నప్పే నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. ప్రైమర్‌తో మేకప్ అప్లై చేసుకొవడం మొదలుపెట్టి ఫౌండేషన్, కన్సీలర్, బ్రాంజర్.. వంటివి లైట్‌గా అప్లై  చేసుకుంటూనే కళ్లు, అధరాలను కూడా మెరిపించాల్సి ఉంటుంది. అయితే లుక్ సింపుల్‌గా ఉండాలని భావిస్తున్నారు కాబట్టి కళ్లు లేదా పెదవులు ఏదో ఒకదానిని మాత్రమే మేకప్‌తో హైలైట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ధరించే డ్రస్‌కు తగినట్లుగా మ్యాచింగ్ హెయిర్ స్టైల్ వేసుకోవడం కూడా మర్చిపోకూడదు. దీంతో సింపుల్ లుక్ కోసం మేకప్ అప్లై చేసుకోవడం పూర్తి అయినట్లే.

కాలేజీలో జరిగే పార్టీలకు..

పార్టీ అంటేనే ఎంతో ప్రత్యేకమైన సందర్భం. అందులోనూ కాలేజీలో జరిగే ఈ వేడుకలకు అమ్మాయిలంతా స్పెషల్‌గా ముస్తాబై మరీ వస్తుంటారు. మరి, అందరిలోనూ మనం సమ్ థింగ్ స్పెషల్ అనిపించాలంటే ధరించే అవుట్ ఫిట్స్ మాత్రమే కాదు.. అప్లై చేసుకునే మేకప్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ తరహా సందర్భాలకు ప్రైమర్ అప్లై చేసుకోవడం ద్వారా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టి ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసుకోవాలి.

అయితే ఇవి చర్మరంగులో బాగా కలిసేంత వరకు బ్లెండ్ చేయడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఆ తర్వాత అవుట్ ఫిట్‌కు మ్యాచయ్యే షేడ్స్‌తో.. ఐ షాడో అప్లై చేసుకుని ఐ లైనర్, మస్కారా కూడా వాడాలి.  అధరాలకు కోరల్ రెడ్ లేదా పింక్ షేడ్ లిప్ స్టిక్‌తో తీర్చిదిద్దుకుంటే సరి. కావాలనుకుంటే పర్పుల్.. వంటి బోల్డ్ లిప్స్ కూడా ప్రయత్నించవచ్చు. చివరిగా పౌడర్ హైలైటర్‌ని అక్కడక్కడా అప్లై చేసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన లుక్‌ని మన సొంతం చేసుకోవచ్చు.

ఆఫీసుకు వెళ్లేటప్పుడు..

ఈ రోజుల్లో ఉద్యోగరీత్యా ప్రొఫెషనల్‌గా కనిపించేందుకు కూడా చాలామంది మేకప్ వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఆఫీసుకు వెళ్లే సమయంలో అప్లై చేసుకునే మేకప్ చాలావరకు సింపుల్‌గానే ఉండాల్సి ఉంటుంది. అందుకే ఫౌండేషన్, కన్సీలర్, బ్రాంజర్, ఐ మేకప్, లిప్ మేకప్‌తో తమ లుక్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఐ మేకప్ విషయానికి వచ్చే సరికి న్యూడ్ షేడ్స్ లేదా లైట్ షేడ్స్‌నే ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే లిప్ స్టిక్స్ షేడ్స్ విషయంలోనూ ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.

పెళ్లికి హాజరయ్యేటప్పుడు..

పెళ్లి అంటేనే ఎంతో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. ఇలాంటి శుభకార్యాలకు హాజరయ్యేటప్పుడు మనం కూడా అందుకు తగ్గట్లుగానే రడీ అవ్వాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఇలాంటి సందర్భాలకు హాజరయ్యేటప్పుడు మనం ధరించే అవుట్ ఫిట్స్ ఒక ఎత్తు అయితే మనం అప్లై చేసుకునే మేకప్ మరో ఎత్తని చెప్పచ్చు.

ముఖ్యంగా కళ్లకు అప్లై చేసుకునే ఐ షాడో, లైనర్.. వంటివి కూడా అవుట్ లుక్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ తరహా సందర్భాలకు డ్రస్‌కు మ్యాచయ్యే విధంగా గోల్డ్, సిల్వర్ లేదా బ్రాంజ్ వంటి షేడ్స్‌లో ఐ షాడోని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఐ మేకప్ సింపుల్‌గానే ఉండాలనుకునేవారు.. అధరాలకు ప్రకాశవంతమైన షేడ్స్‌లో లిప్ స్టిక్ అప్లై చేసుకోవచ్చు. వీటన్నింటికీ తోడు మ్యాచింగ్ హెయిర్ స్టైల్ కూడా ఉంటేనే మీ లుక్ పరిపూర్ణం అవుతుందని గుర్తుంచుకోండి.

Shutterstock

రాత్రి సమయాల్లో జరిగే వేడుకలకు..

రాత్రి సమయాల్లో జరిగే పార్టీలు వంటి వాటికి హాజరయ్యేటప్పుడు మనం వేసుకునే మేకప్ కూడా కాస్త స్పెషల్‌గానే ఉండాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాలకు స్మోకీ ఐ మేకప్ బాగా నప్పుతుంది. లేదా వింగ్డ్ ఐ లైనర్.. వంటి స్టైల్స్‌ని కూడా ప్రయత్నించవచ్చు. వీలైనంత వరకు ప్రకాశవంతంగా ఉండే షేడ్స్‌ని ఐ, లిప్ మేకప్‌లో భాగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అధరాలకు తప్పనిసరిగా లిప్ గ్లాస్ అప్లై చేసుకోవాలి. అప్పుడే అవుట్ లుక్ స్పెషల్‌గా, అందంగా కనిపిస్తుంది.

తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు – వాటి సమాధానాలు..

వేసవి కాలంలో మేకప్‌కు సంబంధించి చాలామందికి ఉండే కొన్ని సందేహాలు – వాటి సమాధానాలు మీ కోసం..

నేను వేసవిలో ఎలాంటి మేకప్ వేసుకోవాలి?

వేసవిలో మేకప్ వేసుకోవడానికి ముందు.. చర్మాన్ని తప్పనిసరిగా క్లెన్సింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసి దానిని పూర్తిగా చర్మం లోపలికి ఇంకనివ్వాలి. ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేసుకొని ఫౌండేషన్, కన్సీలర్.. వంటివి అప్లై చేసుకోవచ్చు.

మీరు ఏ తరహా మేకప్ వేసుకున్నా అందుకు ఉపయోగించే ఉత్పత్తులు తప్పనిసరిగా మీ చర్మతత్వానికి నప్పడంతో పాటు నాణ్యమైనవై ఉండాలి. అప్పుడే అవి మీకు మంచి లుక్‌ని ఇస్తాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా వేసవిలో ఎదురయ్యే అధిక చెమట కారణంగా మేకప్ పాడవకుండా.. మనం జాగ్రత్తపడడంతో పాటు అది అధిక సమయం నిలిచి ఉండేలా చూసుకోవచ్చు. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలి?

సాధారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు హెవీ, ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ అస్సలు ఉపయోగించకూడదు. వాతావరణంలో ఉన్న అధిక వేడి కారణంగా అవి మరింత జిడ్డుగా మారి, మేకప్ త్వరగా చెదిరిపోయేలా చేస్తాయి. అందుకే ఈ కాలంలో ఎక్కువగా పౌడర్ లేదా మినరల్ బేస్డ్ ఫౌండేషన్ వంటివి ఉపయోగించాలి. అలాగే ప్రైమర్ అప్లై చేసుకోవడంతోనే మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి. అయితే మీరు ఉపయోగించే మేకప్ ఉత్పత్తులు మాత్రం తప్పనిసరిగా మీ చర్మతత్వానికి నప్పేవై ఉండాలి.

చెమటలు ఎక్కువగా పడుతున్నప్పుడు మేకప్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వేసవిలో మీరు ప్రైమర్‌తోనే మేకప్ వేసుకోవడం మొదలుపెడతారు. కాబట్టి అది చెమట కారణంగా మేకప్ చెదిరిపోకుండా కొద్ది సమయం వరకు కాపాడుతుంది.  అయితే ఈ కాలంలో మేకప్ చెదిరిపోకుండా అధిక సమయం నిలిచి ఉండేందుకు సెట్టింగ్ స్ప్రే‌ని కూడా తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.

అలాగే మీరు ఎంపిక చేసుకునే ఫౌండేషన్, కన్సీలర్.. వంటి వాటి విషయాల్లోనూ జాగ్రత్త వహించాల్సిందే. వీటన్నింటికీ తోడు చర్మంపై చేరే జిడ్డు, చెమటను తొలగించుకునేందుకు బ్లాటింగ్ పేపర్స్ తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంచుకోవాల్సిందే.

ఎక్కువగా చెమటపడుతుంటే మేకప్ వేసుకునేదెలా??

మీరు మేకప్ చేసుకోవడానికి ముందుగా చెమటలు తగ్గుముఖం పట్టేలా చేయడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీరు కూల్ జెల్ ప్రయత్నించవచ్చు లేదా మీకు అందుబాటులో ఉండే ఐస్ క్యూబ్‌తో ముఖంపై రుద్దుకొని అది ఆరిన తర్వాత మేకప్ వేసుకోవడం మొదలుపెట్టచ్చు. అయితే చర్మం కొద్దిగా కూల్ అయిన తర్వాత ముందుగా టోనర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రైమర్, ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి.

వీలైనంత వరకు పౌడర్‌ను స్కిప్ చేయడమే మంచిది. చెమటలు ఎక్కువగా పడుతున్నా లేక వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నా వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవడం శ్రేయస్కరం. అలాగే మీరు మేకప్ వేసుకోవడం పూర్తైన తర్వాత మీ ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు ఒక ఫేషియల్ మిస్ట్‌ని మీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.

వేసవిలో నేను ఎలా మేకప్ చేసుకోవాలి?

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేకప్ వీలైనంత తక్కువగానే వేసుకోవాలి. అలాగే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. అలాగే నాణ్యమైన ప్రైమర్ కొనుగోలు చేయాలి. దానితోనే మేకప్ అప్లై చేసుకోవడం మొదలుపెట్టాలి. కాస్త ప్రకాశవంతంగా కనిపించాలని భావించినప్పుడు బ్రాంజర్‌ను ఉపయోగించవచ్చు. షిమ్మర్.. వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం.

కళ్లకు అప్లై చేసుకునే ఐ షాడో చెదిరిపోకుండా.. కళ్లకు కూడా ప్రైమర్ అప్లై చేసుకోవాలి. బ్రైట్ షేడ్స్ ఉపయోగిస్తూ సింపుల్‌గానే మీ లుక్‌ని మెరిపించడానికి ప్రయత్నించాలి. వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడానికి వేసవి కూడా అనువైన సమయమే. అలాగే మేకప్ అప్లై చేసుకున్న తర్వాత.. చివరిలో సెట్టింగ్ స్ప్రే తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే.

Featured Image: Instagram

ఇవి కూడా చదవండి

స్ట్రెచ్ మార్క్స్ మాయం చేయడానికి.. ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి..!

ఈ స‌మ్మ‌ర్ హెయిర్ స్టైల్స్.. మీరూ ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి..

జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Beauty