Lifestyle

సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం ద్వారా.. యువతకి కనెక్ట్ అయ్యే 7 అంశాలు ఇవే..!

Sandeep Thatla  |  Apr 18, 2019
సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం ద్వారా.. యువతకి కనెక్ట్ అయ్యే 7 అంశాలు ఇవే..!

దాదాపు ఆరు వరుస ఫ్లాపుల తరువాత సక్సెస్ రుచి చేసిన హీరో – సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). కాకతాళీయంగా ఈయన తాజాగా సక్సెస్ సాధించిన ‘చిత్రలహరి’ (Chitralahari) చిత్రంలోని పాత్ర.. ఈ చిత్రానికి ముందు సాయి ధరమ్ తేజ్ నిజ జీవిత పాత్ర కూడా ఇంచుమించు ఒకేలా ఉండడం గమనార్హం. సినిమాలో విజయ్.. బయట సాయి ధరమ్ ఇద్దరు సక్సెస్ కోసం పరితపిస్తున్నవారే.

ఇక చిత్రలహరి చిత్రం ఆఖరిలో విజయ్… యాక్సిడెంట్ గురైన వారిని సకాలంలో రక్షించేందుకు యాక్సిడెంట్ అలెర్ట్ యాప్  తయారు చేసి విజయం సాధించగా.. బయట నిజ జీవితంలో చిత్రలహరి వంటి ఒక మంచి చిత్రాన్ని తీసి సాయి ధరమ్ తేజ్ ఆరు ఫ్లాపుల తరువాత హిట్ కొట్టాడు.

ఇదిలా ఉంటే, ఈ చిత్ర కథకుడు కిషోర్ తిరుమల… పాత్రలని తీర్చిదిద్దిన తీరు చాలా సహజంగా ఉంది. అందుకనే ఆయా పాత్రలు.. వాటి స్వభావాలతో ఈ చిత్రం చూసిన సామాన్య జనం తమను తాము పోల్చుకోగలుగుతున్నారు. ఇప్పటి రోజుల్లో ఒక చిత్రానికి ఇలా సహజంగా కనెక్ట్ అవడమనేది చాలా అరుదుగా జరిగే విషయమని చెప్పవచ్చు. కాగా ‘చిత్రలహరి’ చిత్రానికి ప్రధానంగా సక్సెస్ కోసం తపన పడే యువత బాగా ఆకర్షితులవుతున్నారు.

ఈ చిత్రంలోని పలు సంఘటనలు & పాత్రలు ఇప్పటి తరం వారికి ఎన్నో మంచి విషయాలను చెబుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

* తండ్రి – కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు

ఒక మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగైన తండ్రికి.. తన కొడుకు జీవితంలో  స్థిరపడటం లేదనే దిగులు ఉంటుంది. అతని తోటి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ముందుకి సాగిపోతుంటే.. తన కొడుకు మాత్రం ఏవో కలలు కంటూ ఉంటాడు. ఇలాంటి తండ్రి ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండే కొడుకును ఏమనకుండా ఎలా ఉండగలిగాడు?

పైగా అతని స్నేహితుడు తన కొడుకుకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానంటే.. దానిని కూడా కాదంటాడు. కానీ.. తన కొడుకు పట్ల నమ్మకాన్ని పెంచుకుంటాడు. తన కొడుక్కి జీవితంలో ఏదైనా దొరకకపోతే.. అదే జీవితం అక్కడితో ఆగిపోదని.. విజయం వేరే రూపంలో వరిస్తుందని భావిస్తాడు. అక్కడికి చేరుకోగలిగే నేర్పును పెంచుకోమని కొడుక్కి ధైర్యం చెబుతాడు.

ఈ సన్నివేశంలో ఒక తండ్రి.. తన కొడుకు పై పెంచుకున్న అపారమైన నమ్మకాన్ని మనం చూడవచ్చు. అదే సమయంలో జీవితంలో ఓడిపోయాను అన్న కొడుకుకి “ఫెయిల్ అవ్వడం కాదు ఓటమి అంటే.. ప్రయత్నించడం ఆపేయడమే ఓటమి అంటే” అని ధైర్యాన్ని నూరిపోయడం ద్వారా కొడుక్కి యెనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు. ఈ సంభాషణ ఒక తండ్రి తన కొడుక్కి అవసరమైన సమయంలో తోడ్పాటుని ఇవ్వాలి అనే అంశాన్ని హైలైట్ చేస్తుంది.

* ప్రేమించిన వారు చేజారిపోయారు అని జీవితంలో ఆగిపోకుండా ఉండడం

తాను ప్రేమించిన అమ్మాయిని తన తండ్రికి పరిచయం చేసినప్పుడు… పోసాని కృష్ణమురళి పాత్ర చెప్పే మాటలు ఇప్పటి యువతరం ప్రేమికులకు మంచి సందేశంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ అదేంటంటే – “ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఇద్దరు ప్రేమికులు విడిపోవాలంటే అది కులమో, మతమో లేక తల్లిదండ్రుల ప్రమేయం వల్లనో కాదు… కేవలం ప్రేమించుకున్న ఇద్దరి వ్యక్తిత్వాలే వారు విడిపోవడానికి కారణమవుతున్నాయి” అనే మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి.

ఇది నిజమే కదా! ఇప్పటివారు ఒకరితో ఒకరు కలిసి ఉండే కన్నా.. విడిపోయేందుకు ఎక్కువ కారణాలు వెతుకుంటున్నారు. అలాంటి వారికి ఈ సన్నివేశం ఒక మంచి పాఠంలా ఉపయోగపడుతుంది.

* సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే శక్తి మనకుండాలి… అంతేతప్ప ఇతరుల మాటలకి విలువనిచ్చి మనతో ఉన్నవారిని అపార్ధం చేసుకోవద్దు

ఇందులో హీరో ప్రేయసిగా ‘లహరి’ అనే పాత్ర మనకి కనిపిస్తుంది. తన వెంట పడుతున్న హీరోని అతను తన ముందుంచిన ప్రేమ ప్రొపోజల్‌ని ఒప్పుకుంటుంది లహరి. అలా ఒప్పుకున్న ఈ అమ్మాయి కొన్ని రోజుల తరువాత “ఇప్పుడున్న అబ్బాయిలంతా మోసగాళ్లు! అన్ని అబద్దాలే చెబుతారు!” అన్న తన మిత్రురాలి మాటలు విని.. తాను ప్రేమించిన వ్యక్తికి దూరమవుతుంది. పైగా హీరో ముందు.. ప్రేమికులుగా కాకుండా స్నేహితులుగా ఉందామనే కొత్త ప్రొపోజల్ పెడుతుంది. తరువాత ఏం జరిగిందో  మీరు సినిమాలో చూసే ఉంటారు కదా.

మనం తీసుకున్న నిర్ణయాల పై వేరేవాళ్ళ అభిప్రాయం తీసుకోవడం కొంతవరకు మంచిదే. కాని… వారిచ్చే అభిప్రాయాలతో ముందు వెనుక ఆలోచించకుండా.. ఆ నిర్ణయాన్నే పక్కన పెట్టేయడం తప్పు అని మనకు ఈ పాత్రను చూస్తే తెలుస్తుంది. సినిమా చివరలో ఈ పాత్ర చేతనే – “నీకు నచ్చితే చేసేయ్… వేరే వాళ్ళు ఏదో చెప్పారు అని నువ్వు అనుకున్నదాన్ని వదిలెయ్యకు” అని చెప్పించడం బాగుంది.

* ప్రయత్నం విఫలం అవ్వగానే ఇక మన వల్ల కాదు అని ఆగిపోవడం

యాక్సిడెంట్‌కి గురైన వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ప్రమాదానికి గురైన వెంటనే చనిపోతున్నారు… సరైన వైద్య సదుపాయం అందకపోవడమే అందుకు కారణం..  అన్న విషయాలు పేపర్లలో చదివి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని భావిస్తాడు హీరో. అందుకోసమే “యాక్సిడెంట్ అలెర్ట్” అనే యాప్‌ని తయారుచేస్తాడు. దాని స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నించే సమయంలో.. అనేకమంది దగ్గర తిరస్కరణకు గురవుతాడు. ఒకానొక సమయంలో “ఇక ఇది నా వల్ల కాదు” అంటూ చేసే ప్రయత్నాన్ని వదిలేసే నిర్ణయం తీసుకుంటాడు.

ఆ సమయంలో తన తండ్రి చెప్పే మాటలు విని తన ప్రయత్నాన్ని కొనసాగించడం ద్వారా.. “ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మన లక్ష్యాన్ని మరువకూడదు” అనే గొప్ప జీవిత సత్యాన్ని చెబుతాడు.  ఈ సన్నివేశం ద్వారా తప్పకుండా ప్రేరణ పొందవచ్చు.

* మన వ్యక్తిగత జీవితంలో జరిగిన దాన్ని ఆధారం చేసుకుని.. ప్రపంచంలో అందరూ స్వార్ధపరులే ఉంటారు అని అనుకోవడం మూర్ఖత్వం.

స్వేచ్ఛ అనే పాత్రలో నివేథా పేతురాజ్ నటించింది. ఆ పాత్ర తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా మగాళ్ళ పైన తీవ్ర ద్వేషం పెంచుకుంటుంది. అలాగే జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండాలి అంటూ.. చివరికి తన తల్లికి కూడా ఇవ్వడం మానుకుంటుంది. ఇలాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి సలహా విని.. హీరోయిన్ తాను ప్రేమించిన వాడిని వదిలేస్తుంది. చివరికి తన తప్పుని తెలుసుకుని ఇద్దరిని స్వేచ్ఛ పాత్రనే కలుపుతుంది అనుకోండి…

ఈ పాత్ర ద్వారా  “మన జీవితంలో ఎదురైనా చేదు సంఘటనలు.. ప్రపంచం మొత్తానికి ఆపాదించడం సరి కాదు” అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు.

* జీవితంలో మనకి సక్సెస్ రాదు.. అంటూ నిరుత్సాహ పడిపోవడం

హీరోకి గ్లాస్ మేట్‌గా ఈ సినిమాలో మనకి కనిపించిన పాత్ర సునీల్‌ది. ఆయన జీవితంలో మంచి గాయకుడు అవుదామని ప్రయత్నించి విఫలమవడంతో.. ఒక భక్తి ఛానల్‌లో యాంకర్ గా చేరి కాలం గడిపేస్తుంటాడు. సినిమా ప్రారంభంలో “కల కన్న ప్రతివాడు కలామ్ కాలేడు” అంటూ తనలో ఉన్న నిరుత్సాహాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చేస్తుంటాడు.

అయితే సినిమా చివరికి తన ఫ్రెండ్ విజయ్ తాను అనుకున్నది సాధించే సరికి.. “”కలామ్ అలా అని అనుకొని ఉండకపోతే.. ఇప్పటివారికి ఒక మంచి స్ఫూర్తి ఉండకుండా పోయేది కదా” అని ఆ పాత్ర ద్వారా దర్శకుడు మనలో కూడా స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తాడు. అంతేకదా మరి.. నిరుత్సాహ పడకుండా ముందుకి వెళ్ళడమే జీవితం అనేది ఈ పాత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చు.

* స్వాభిమానంతో పాటు.. ఓర్పు కూడా చాలా అవసరం

ఈ చిత్రంలో విజయ్ పాత్ర తాను రూపొందించే యాప్‌కి స్పాన్సర్ షిప్ కావాలని వెళ్లిన సమయంలో.. తమకి ఆ యాప్‌ని అమ్మేయమని ఇన్వెస్టర్లు ఒత్తిడి తెస్తారు. ఒకసారైతే ఆ యాప్ డెమో ఇస్తున్నప్పుడు.. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి పై విజయ్ చేయి కూడా చేసుకోబోతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆ కంపెనీ యజమాని – “నీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికి.. దానిని సరైన మార్గంలో నడిపించేందుకు ఓర్పు కూడా చాలా అవసరం. ఓర్పు లేనివాడు ఎంత తెలివిగలవాడైనా జీవితంలో రాణించలేడు” అని అంటాడు. ఓర్పు అనేది ఎంత గొప్పదో మనం ఈ సన్నివేశం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇలా ఈ సినిమాలో ఏడు సంఘటనల ద్వారా.. ఇప్పుడున్న యువతకి తప్పకుండా స్ఫూర్తిని కలిగించే ఆస్కారం ఉన్నది. ఎప్పుడో గాని ఇటువంటి మంచి ప్రేరణాత్మక చిత్రాలు రావు… వచ్చినప్పుడే వాటిని చూసి తమ జీవితాలకి అన్వయించుకుంటే నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

చివరగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా.. మనం కన్న కల వైపే సాగాలి కాని.. నా వల్ల కాదంటూ ఆగిపోకూడదు అన్నది ఈ చిత్రం మనకు తెలిపే అక్షర సత్యం.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ..!

అర్జున్ రెడ్డి వర్సెస్ కబీర్ సింగ్: ఎవరి సత్తా ఏమిటి..?

Read More From Lifestyle