Lifestyle

కొత్త అల్లుళ్లు, కోడి పందేలు.. సరదాల సంక్రాంతి తెచ్చే ఆనందాలెన్నో..!

Lakshmi Sudha  |  Jan 10, 2019
కొత్త అల్లుళ్లు, కోడి పందేలు.. సరదాల సంక్రాంతి  తెచ్చే ఆనందాలెన్నో..!

ముత్యాల ముగ్గులు.. రతనాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే తెలుగు లోగిళ్లలో సంతోషం నిండుతుంది. పంట చేతికందిన రైతు కళ్లల్లోని ఆనందం తెచ్చిన సంబురం సంక్రాంతి. తెలుగువారి అచ్చతెలుగు పల్లె పండగ.. పెద్ద పండగ సంక్రాంతి. బసవన్న చిందులు.. హరిదాసుల సంకీర్తనలు.. గాలి పటాలు.. బావామరదళ్ల సరసాలు.. ఒకటా రెండా సంక్రాంతి సరదాలెన్నో.

మకర సంక్రాంతి తొలి రోజు భోగి పండగ. భగభగమండే భోగిమంటల్లో గోవుపిడకల దండ వేయడంతో సంక్రాంతి పండగ మొదలవుతుంది. ఈ రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. భోగి రోజున బదరీ వనంలో శ్రీ మహావిష్ణువుని పసిబాలుడిగా మార్చి దేవతలు బదరీ పళ్లు(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలక్రమంలో భోగిపళ్లుగా రూపాంతరం చెందాయి. ఆ రోజు చిన్నారులకు పూలు, రేగుపళ్లు కలిపి భోగిపళ్లుగా పోస్తారు. ఇలా చేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని నమ్ముతారు.

రెండో రోజు మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి రోజున దక్షిణాయనం పూర్తై ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. మూడో రోజు కనుమ. ఇది పశువుల పండగ. ఈ రోజు పశువులను అలంకరించి పూజిస్తారు. సంక్రాంతి పండగలో నాలుగో రోజును ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో కొత్తగా వివాహం చేసుకొన్న యువతులు సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. సంక్రాంతి రోజున పితృదేవ‌త‌ల‌ ఆత్మశాంతి కోసం ఎవరి శక్తి కొలది వారు దానధర్మాలు చేస్తారు.

ఇక సంక్రాంతి పిండివంటల విషయానికొస్తే.. అబ్బబ్బ.. ఈ పండగకి చేసినన్ని పిండివంటలు ఇక ఏ పండగకూ చేయరంటే అతిశయోక్తి కాదు. వాటి సువాసనకే కడుపు నిండిపోతుందంటే నమ్మండి. సున్నుండలు, అరిశెలు, జంతికలు, గోరువిటీలు, పూతరేకులు, పాకుండలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు.. ఇలా ఒకటా రెండా.. ఎవరికిష్టమైన పిండి వంటలు వారు వండుకొంటారు. వాటిని ఇరుగుపొరుగు వారికి పంచిపెడతారు. అది పిండివంటల పంచిపెట్టడం అనుకొంటే పొరపాటే.. అది ఆనందాన్ని పంచుకోవడమే.

సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తున్నాడంటే ఆ హడావుడే వేరు. మరదళ్ల సరసాలు.. బావమరదుల వేళాకోళాలు.. ఆ సరదానే వేరు. అవి కావాలి.. ఇవి కావాలంటూ.. అల్లుడి అలక.. అతడిని బుజ్జగించే మామ.. ఆ సందడే వేరు.  సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేస్తారు. వీటిని ఎగరేయడానికి పెద్దవాళ్లు కూడా పిల్లలైపోతారు. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు కానీ.. సంక్రాంతి పండగకి బసవన్నల సందడి, హరిదాసు కీర్తనలే అసలైన అందాన్నిస్తాయి.

  

కోడి పందేలు, ఎడ్ల పందేలతో తెలుగునాడు.. సంక్రాంతి పండగ ఉత్సాహం శిఖర స్థాయికి చేరుకొంటుంది. నా పుంజు గెలుస్తుందంటే.. నా పుంజు కొడుతుందని పందేలు వేసుకొంటారు. కోడి పందేలకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో కోడి పందేలను చూడటానికి ఇక్కడికి వస్తారు. కోడి సైజు చిన్నదే.. కానీ దానిపై పెద్ద మొత్తంలో పందెం కడతారు. ఈ కోడి పందేలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. ప్రకాశం జిల్లాలో ఎద్దుల పందేలు నిర్వహిస్తారు. ఈ పందేల్లో మేలు జాతి ఎద్దుల జతలతో పాల్గొంటారు. ఈ పందేలు తెలుగు సంస్కృతీ సంప్ర‌దాయాలకు ప్ర‌తీక‌గా నిలుస్తున్నాయి.

సంక్రాంతి (Sankranti) పండగ మహిళల పండగ. ఈ నాలుగు రోజులు ఇంట్లో వారికి క్షణం తీరిక ఉండదు. ఓ వైపు ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తూ.. మరో వైపు ఇంటి పనులను చక్కబెడుతుంటారు. ఇంటిల్లిపాదికీ కావాల్సిన పిండివంటలను వండి పెడతారు. అలాగే ఇంటి ముందు రంగు రంగుల రంగవల్లులను తీర్చిదిద్ది.. ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి.. గుమ్మడి పూలతో అలంకరించి.. ‘గొబ్బియల్లో గొబ్చియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడి పువ్వులో’ అంటూ పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. ఈ సంప్రదాయం కూడా ఇప్పుడు దాదాపుగా కనుమరుగైందనే చెప్పుకోవాలి. 

సంక్రాంతికి పల్లె చెంతకు పట్నం చేరుకొంటుంది. తమ కుటుంబంతో సరదాగా సమయం గడిపేందుకు నగరాల్లో స్థిరపడిన వారు తమ స్వస్థలాలకు చేరుకొంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. వెళుతూ వెళుతూ ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళతారు. మళ్లీ సంక్రాంతి కోసం ఎదురుచూస్తారు. అందుకే కదా.. సంక్రాంతిని ఆనందాల క్రాంతి అంటారు.

సంతోషాల క్రాంతి.. సరదా సంక్రాంతి శుభాకాంక్షలు.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

సంక్రాంతి ముంగిట్లో విరిసే ముత్యాల హరివిల్లు

సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

హైదరాబాద్ కీర్తిని జగద్విఖ్యాతం చేసే.. పతంగుల పండగ & మిఠాయిల వేడుక..!

 

Read More From Lifestyle