Health

తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి (How To Get Pregnant Faster In Telugu)

Soujanya Gangam  |  May 28, 2019
తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి (How To Get Pregnant Faster In Telugu)

అమ్మతనం ప్రతి మహిళకు దక్కే వరం.. గర్భం ధరించి (pregnant) పండంటి బిడ్డకు జన్మనిచ్చి అమ్మా.. అని పిలిపించుకోవాలని కోరుకోని అమ్మాయి ఉండదేమో.. జీవితంలో ఏదో ఒక సమయంలో త్వరగా పిల్లలు పుడితే బాగుండు అని కోరుకుంటారు చాలామంది. అయితే చాలామంది ప్రయత్నించిన కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే పిల్లలు పుడితే మరికొందరికి మాత్రం ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టేందుకు కాస్త కష్టమే. అయితే పిల్లల కోసం అటు వైద్యుల సలహాలు తీసుకుంటూనే ఇంట్లో మీరు పాటించే చిట్కాలను కూడా పాటిస్తుంటే తొందరగా గర్భం ధరించే వీలుంటుంది. అందుకే అటు వైద్యుల చిట్కాలను పాటిస్తూ ఫర్టిలిటీ ని పెంచుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి. త్వరగా గర్భం ధరించే వీలుంటుంది.

గర్భం ధరించకపోవడానికి గల కారణాలు

అండం విడుదలయ్యే తేదీ గుర్తించడమెలా?

ఫర్టిలిటీ పెంచేందుకు ఏం చేయాలంటే

చేయకూడనవి

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు

 

గర్భం ధరించకపోవడానికి గల కారణాలు (Causes Of Infertility)

ఇర్రెగ్యులర్ పిరియడ్స్ (Irregular Periods)

గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పిరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం ఎంతో అవసరం. దీనివల్లే అండం విడుదలయ్యే తేదీని పక్కాగా లెక్కించే వీలుంటుంది. పిరియడ్స్ రెగ్యులర్ గా లేకపోవడం వల్ల అండం విడుదలలో సమస్యలతో పాటు ఫలదీకరణ చెందిన తర్వాత కూడా వివిధ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా పీసీఓఎస్, థైరాయిడ్ వంటివి ఉన్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య వేధిస్తుంది. ఇవి గర్భం ధరించడంలోనూ అడ్డంకిగా మారతాయి. అందుకే ఆరోగ్య సమస్యలకు ఎప్పటికప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకొని పిరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి.

ఒత్తిడి (Stress)

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. అటు ఆఫీస్, ఇటు ఇంటి పనులు, బంధాల్లో మనస్పర్థలు ఇలా చాలా కారణాలే ఒత్తిడికి కారణమవుతాయి. ఇది కేవలం ఆడవారిలోనే కాదు.. మగవారిలోనూ సంతానలేమికి కారణం అవుతుంటాయి.

పెరిగే వయసు (Age)

వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించే అవకాశం తగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం మహిళల్లోని అండాల నిల్వ తగ్గిపోవడమే.. ప్రతి మహిళ కొన్ని వేల అండాలతో జన్మిస్తుంది. ప్రతిసారి రుతుస్రావం జరిగిన తర్వాత కొన్ని అండాలు క్షీణించిపోతాయి. అలా కొన్నేళ్ల తర్వాత అండాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అందుకే 30 తర్వాత గర్భం ధరించడం కాస్త కష్టం అవుతుంది.

బరువు తక్కువగా లేదా ఎక్కువగా ఉండడం (Being Underweight Or Overweight)

బరువు ఎక్కువగా లేదా తక్కువగా ఉండడం కూడా గర్భం ధరించడానికి ఇబ్బందులను కలిగిస్తుంది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల రుతుస్రావంలో అండం విడుదలవ్వడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే గర్భం ధరించాలనుకునేముందు సరైన బరువుకి చేరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

వీటితో పాటు గర్భాశయ, అండాశయ సమస్యలు.. మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం వంటివన్నీ గర్భం ధరించడంలో ఇబ్బందిని కలిగించేవే..

అండం విడుదలయ్యే తేదీ గుర్తించడమెలా? (Ovulation Signs)

గర్భధారణకు సంబంధించి చికిత్స తీసుకునే ముందు కనీసం కొన్ని నెలల పాటు గర్భధారణ కోసం ప్రయత్నించి అయినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ముందే తెలిస్తే మాత్రం దానికి చికిత్స కొనసాగిస్తూనే గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. గర్భం కోసం ప్రయత్నించేందుకు ముందు మీ అండం విడుదలయ్యే తేదీని గుర్తించడం ఎంతో అవసరం. అండం విడుదలయ్యే తేదీల్లో సెక్స్ లో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అండం విడుదలయ్యే తేదీని గుర్తించేందుకు చాలా పద్ధతులున్నాయి. సాధారణంగా రుతుస్రావం మొదలైన తర్వాత పద్నాలుగో రోజు నుంచి పదహారో రోజు వరకూ ఎప్పుడో ఒక సమయంలో అండం విడుదలవుతుందట. ఇలా విడుదలైన అండం కేవలం 24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. ఈ లోపు శుక్రకణం దానితో కలిసి ఫలదీకరణం చెందితే సరి.. లేకపోతే అండం, గర్భాశయ గోడలకు అంటుకున్న పొర మిగిలినవన్నీ కలిసి మరుసటి నెల రక్తస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇలా అండం విడుదలయ్యే రోజున లేదా దానికి ముందు రోజు లేదా తర్వాత రోజు సెక్స్ లో పాల్గొనడం వల్ల అండం ఫలదీకరణం చెందే వీలుంటుంది. సాధారణంగా శుక్ర కణాలు ఐదు రోజులు జీవించే అవకాశం ఉంటుంది కాబట్టి అండం విడుదయ్యేందుకు రెండు రోజుల ముందు నుంచి ప్రారంభించి అండం విడుదలైన తర్వాత రోజు వరకూ ఫర్టిలిటీ పిరియడ్ గా చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో సెక్స్ లో పాల్గొంటే గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

అండం విడుదలయ్యే తేదీని గుర్తించేందుకు కొన్ని పద్ధతులు ఉపయోగించవచ్చు.

1. సాధారణ రోజుల్లో శరీర ఉష్ణోగ్రత కంటే అండం విడుదలయ్యే ముందు విడుదలైన తర్వాత శరీర ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే రుతుస్రావం ప్రారంభమైన రోజు నుంచి ప్రతి రోజు శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసుకోవడం వల్ల అండం విడుదలయ్యే తేదీని గుర్తించవచ్చు.

2. సాధారణంగా అండం విడుదలయ్యే తేదీని గుర్తించేందుకు ఓవ్యులేషన్ ప్రెడిక్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని ఉపయోగించడం కూడా సులువే. వీటితో అండం విడుదలైందా? లేదా? అని సులువుగా తెలుసుకునే వీలుంటుంది.

3. సాధారణ సమయంలో మీ యోని స్రావాలకు.. అండం విడుదలయ్యే ముందు స్రావాలకు తేడా ఉంటుంది. సాధారణం కంటే అండం విడుదలయ్యే ముందు ఈ స్రావాలు పెరగడంతో పాటు అంతకుముందు వరకూ చిక్కగా పెరుగులా కనిపించిన ఈ స్రావాలు శుక్రకణాలు ప్రయాణించేందుకు వీలుగా పల్చగా తయారవడం మనం చూస్తుంటాం.

4. అండం విడుదలయ్యే సమయంలో యోని లోని మార్పులు వస్తుంటాయి. ఈ సమయంలో అది మెత్తగా, సున్నితంగా మారుతుంది. సున్నితమైన వ్యక్తుల్లో ఈ మార్పులు సులువుగా తెలుసుకోవచ్చు.

5. అండం విడుదలయ్యే సమయంలో ఏ వైపు ఫాలోపియన్ ట్యూబ్ లో అండం విడుదలైతే అటు వైపు కాస్త నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి తక్కువగా ఉండడం వల్ల కాస్త కష్టపడే వారికి బరువులు ఎత్తేవారికి ఇలాంటివి తెలియకపోవచ్చు.

6. కొంతమందిలో రెండు మూడు చుక్కల రక్తస్రావం, రొమ్ములు సున్నితంగా మారడం, కటి వలయంలో నొప్పి, మూడ్ ఎక్కువవడం వంటి లక్షణాలు కూడా ఎక్కవగా కనిపిస్తాయి.

ఫర్టిలిటీ పెంచేందుకు ఏం చేయాలంటే (How To Get Pregnant Faster In Telugu)

అండం విడుదలయ్యే తేదీని గుర్తించి సరిగ్గా ఆరోజు సెక్స్ లో పాల్గొనడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ దానికంటే ముందు మీ శరీరం గర్భధారణకు సిద్ధంగా ఉండాలి. మీ ఫర్టిలిటీ ఎక్కువగా ఉండాలి. అందుకే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇన్ ఫర్టిలిటీకి సంబంధించి చికిత్స తీసుకోవాలి. పరీక్షలు చేయించుకొని మీకు ఎలాంటి సమస్యలు లేవని తెలిసిన తర్వాత మీ ఫర్టిలిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం మీరు చేయాల్సిందల్లా..

1. రెగ్యులర్ గా వ్యాయామం (Exercise Regularly)

గర్బం ధరించడానికి ఇబ్బంది కలిగించే అంశాల్లో ముఖ్యమైనది అధిక బరువు. అందుకే గర్భం ధరించడానికి సిద్ధమయ్యే ముందే ఆ అధిక బరువును తగ్గించుకొని సాధారణ బీఎంఐని మెయిన్ టెయిన్ చేయడం ఎంతైనా అవసరం. దీనికోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ఎంతో అవసరం. నడక, పరుగు, స్కిప్పింగ్, సైక్లింగ్, డ్యాన్స్ వంటి కార్డియో వ్యాయామాలతో పాటు బాడీ వెయిట్ ఎక్సర్ సైజులు, జిమ్ లో బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాలు కూడా ప్రయత్నించవచ్చు.

2. స్రావాలు పెంచే ఆహారం (Have Foods That Increase Cervical Mucus)

గర్భం ధరించడానికి ముఖ్యమైన కారణాల్లో యోని స్రావాలు కూడా ఒకటి. ఇవి మరీ చిక్కగా, మరీ పల్చగా ఉండడం వల్ల శుక్ర కణాలు వాటి గుండా ప్రయాణించి అండాన్ని చేరుకోలేవు. కాబట్టి యోని స్రావాలు సరైన రీతిలో ఎక్కువగా విడుదలయ్యేలా చూసుకోవాలి. అంతేకాదు.. దాని పీహెచ్ స్థాయి కూడా సరిగ్గా ఉండాల్సిందే. దీనికోసం సెక్స్ కి ముందు కాసేపు ఇద్దరూ కలిసి గడపడం మంచిది. అంతేకాదు.. యోని స్రావాలను పెంచేందుకు, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు క్రాన్ బెర్రీ జ్యూస్, చిలగడ దుంప, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఫుడ్, సోయా ఉత్పత్తులు, యాపిల్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

3. ఈ మాత్రలు తప్పనిసరి (Have Multi-Vitamin Tablets)

చాలామంది గర్భం ధరించిన తర్వాత వైద్యులను సంప్రదించి వారిచ్చే ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కేవలం గర్భం ధరించిన తర్వాతే కాదు.. గర్భం ధరించడానికి కూడా ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. ఇక మల్టీ విటమిన్ మాత్రలను తీసుకోవడం వల్ల శరీరంలో ఏ విటమిన్, మినరల్స్ డెఫీషియన్సీ ఉండదు కాబట్టి ఈ మాత్రలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. బ్యాలన్స్ డ్ డైట్ తీసుకోండి (Eat Healthy Food)

బరువు తగ్గడం మాత్రమే కాదు.. ఫర్టిలిటీ పెరగడానికి కూడా సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అవసరమే. ఆరోగ్యం సరైన రీతిలో సాగేందుకు బ్యాలన్స్ డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ప్రాసెస్ డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ కాకుండా ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు సరైన మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

5. ఫర్టిలిటీ పెంచే పండ్లు (Eat Dates, Pomegranate & Avocados Regularly)

సాధారణంగా మిగిలిన ఆహారాలతో పోల్చితే కొన్ని రకాల పండ్లు ఫర్టిలిటీని పెంచడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజూ కనీసం రెండు ఖర్జూర పండ్లు తినడం, తరచూ అవకాడో తినడం వల్ల ఫర్టిలిటీ పెరుగుతుంది. అంతేకాదు.. దానిమ్మ గింజలు, దానిమ్మ రసం తరచూ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తినడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

6. అశ్వగంధ పొడితో (Use Ashwagandha Powder)

అశ్వగంధ పొడి మనకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. దీనివల్ల ఆస్టియో పోరోసిస్, ఆర్థరైటిస్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గడంతో పాటు కండరాలకు బలం పెరుగుతుందట. అంతేకాదు.. ఇది మన ఫర్టిలిటీని పెంచేందుకు కూడా తోడ్పడుతుంది. దీనికోసం రెండు గ్రాముల అశ్వగంధ పొడిని, గ్లాసు పాలలో వేసి పటిక బెల్లం కలిపి ఆ పాలను రోజూ రెండు సార్లు తీసుకుంటే ఫర్టిలిటీ త్వరగా పెరుగుతుంది.

7. వేరు పొడి కూడా (Banyan Tree & Maca Root Powder)

మిగిలినవన్నీ కొనసాగిస్తున్నా బరువు తగ్గకపోతే మీరు వేరు పొడిని టీగా తీసుకొని కూడా ప్రయత్నించవచ్చు. దీనికోసం మకా రూట్ పౌడర్ (ఆయుర్వేద దుకాణాల్లో లభ్యమవుతుంది) టీ స్పూన్ తీసుకొని దాన్ని వేడి నీళ్లు లేదా పాలల్లో వేసుకొని కాస్త పటిక బెల్లంతో కలిపి రోజూ ఉదయాన్నే టీ లేదా కాఫీకి బదులుగా ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో పాటు మర్రి చెట్టు వేరు పొడిని కూడా ఇదే పద్ధతిలో ఉపయోగించవచ్చు. ఆయుర్వేదంలో మర్రి చెట్టులోని వివిధ భాగాలకు మంచి ప్రాధాన్యం ఉంది. చెట్టు వేర్లతో పాటు చిగుళ్లు, ఆకులు, పూల వంటివి కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటినీ పౌడర్ రూపంలో తీసుకోవడం ఇబ్బంది అనుకునేవారి కోసం వీటిని క్యాప్యూల్స్ గా తయారుచేసి కూడా అమ్ముతున్నారు. వాటిని కూడా ఉపయోగించవచ్చు.

8. ఆముదంతో మసాజ్ (Massage With Castor Oil)

ఆముదంతో మసాజ్ చేయడం వల్ల కూడా ఫర్టిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక సన్నని వస్త్రాన్ని తీసుకొని బౌల్ లో పోసుకున్న ఆముదంలో వేసి మునిగేలా ఉంచాలి. అది బాగా మునిగిన నూనె పీల్చుకున్న తర్వాత పొట్టపై గర్భాశయం పైన దీన్ని వేసి దానిపై ఓ ప్లాస్టిక్ షీట్ వేయాలి. ఆ తర్వాత వేడినీటి కాపడం పెట్టుకోవాలి. వేడినీటి బాటిల్ కడుపు పెట్టుకొని దానిపై నుంచి ఒక టవల్ వేసుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత కడుపు పై నూనెను శుభ్రం చేసుకోవచ్చు. ఈ నూనెలో వేసిన వస్త్రాన్ని దాదాపు 30 సార్లకు పైగా అలాగే ఉపయోగించుకోవచ్చు. అయితే వాడిన తర్వాత దాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఉంచుకోవాలి. లేదంటే బొడ్డు కింద ఆముదాన్ని బాగా రాసి ప్లాస్టిక్ ర్యాప్ చుట్టి వేడి నీటి కాపడం పెట్టుకోవచ్చు. ఇలా తరచూ చేయాలి. అయితే ఈ మసాజ్ ని మీకు పిరియడ్ వచ్చిన రోజు నుంచి అండం విడుదలయ్యే రోజు వరకూ మాత్రమే ఉపయోగించాలి. అండం విడుదలైన తర్వాత ఫలదీకరణ చెందే అవకాశం ఉంటుంది. గర్భం ధరించిన తర్వాత ఆముదం ఉపయోగించకూడదు కాబట్టి కేవలం పిరియడ్ వచ్చిన రోజు నుంచి అండం విడుదలయ్యే రోజు వరకూ మాత్రమే ఈ ప్యాక్ ఉపయోగించాల్సి ఉంటుంది.

చేయకూడనవి (Things To Avoid When Trying To Conceive)

ఫర్టలిటీని పెంచేందుకు చేయాల్సిన పనుల గురించి తెలుసుకున్నారు కదా.. కానీ కేవలం ఈ పనులన్నీ చేసినంత మాత్రాన గర్భం ధరిస్తారన్న నియమమేమీ లేదు. ఈ పనులతో పాటు కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. వాటిని ఆపడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. అవేంటంటే..

సిగరెట్ (Avoid Smoking)

సిగరెట్ తాగడం వల్ల ఇటు వూపిరితిత్తులు, నోరు వంటి అవయవాలు పాడవడంతో పాటు మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఫ్రీ రాడికల్స్ కూడా పెరిగిపోతాయి. ఇది మన ఫర్టిలిటీని కూడా తగ్గిస్తుంది. గర్బం దాల్చడంలో ఇబ్బందులు కలగజేస్తుంది. అందుకే దీనికి దూరంగా ఉండడం మంచిది.

ఆల్కహాల్ (Avoid Alcohol)

సాధారణంగా గర్భం ధరించిన తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫీటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలుంటాయని మనం వినే ఉంటాం. చిన్నారుల ఎదుగుదలలో సమస్యలు కలిగించే ఈ సమస్య గర్భం ధరించిన తర్వాత వస్తే ఇలాంటివే చాలా సమస్యలు గర్భధారణ జరగకుండా కూడా అడ్డుపడుతుంటాయి. అందుకే గర్భం ధరించాలన్న ఆలోచన రాగానే ఆల్కహాల్ కి దూరమవడం మంచిది.

కాఫీ, టీలు తగ్గించండి (Reduce Intake Of Coffee & Tea)

కెఫీన్ మన శరీరంలో జీవక్రియలు వేగంగా సాగేలా చేస్తుంది. శరీరంలో అండం ఎక్కువ సేపు జీవించకుండా చేస్తుంది. అందుకే గర్భం ధరించాలనుకుంటున్నవారు కాఫీ, టీ లను బాగా తగ్గించాలి. రోజూ కేవలం 2 రెండు కప్పుల టీ లేదా కప్పు కాఫీ మాత్రమే తీసుకోవడం మంచిది.

ఒత్తిడి అసలే వద్దు (Don’t Take Stress)

గర్భం ధరించడాన్ని అడ్డుకునే కారణాల్లో ఒత్తిడి చాలా ముఖ్యమైంది. ఒత్తిడికి గురవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఒత్తిడి వల్ల బరువు పెరిగిపోవడం, పిరియడ్స్ ఇర్రెగ్యులర్ గా మారిపోవడం, అండాలు విడుదల కాకపోవడం, పాలోపియన్ ట్యూబ్స్ లో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే గర్భం ధరించాలనుకుంటున్నప్పుడు ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది.

అంత కష్టమైనవి వద్దు (Don’t Do Strenuous Exercise)

గర్భం ధరించాలంటే బరువు తగ్గాలని చెప్పాం కదా అని వెయిట్ ఎక్సర్ సైజులు చేయడం.. చాలా ఎక్కువ బరువులను ఎత్తడం, ఏరోబిక్స్ వంటివి చేస్తుంటారు. కానీ బరువు తగ్గడం ఎంత ముఖ్యమో.. కష్టమైన వ్యాయామాలకు దూరంగా ఉండడం కూడా అంతే అవసరం. లేదంటే గర్భాశయ గోడలకు ఫలదీకరణ చెందిన పిండం అతుక్కోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందుకు ముందు బరువు తగ్గి ఆ తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నెమ్మదిగా సులువైన వ్యాయామాలు లేదా నడక వంటివి చేయడం మంచిది. 

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు (FAQs)

1. గర్బం ధరించేందుకు ఏవైనా ప్రత్యేకమైన సెక్స్ పొజిషన్స్ ఉన్నాయా?

ఫలానా పొజిషన్ లో సెక్స్ చేయడం వల్లే గర్భం వస్తుందన్న రూలేమీ లేదు. అయితే భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మహిళ పైన ఉండి చేసే పద్ధతులు, నిలబడి లేదా కూర్చొని చేసే సెక్స్ భంగిమలను ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది. సాధారణంగా మిషనరీ (భర్త పైన ఉండే పొజిషన్ ), డాగీ స్టైల్ పొజిషన్లలో సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2. గర్భం ధరించడం కోసం సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఏమైనా చిట్కాలు పాటించాలా?

గర్భం ధరించడం కోసం సెక్స్ తర్వాత ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. కానీ వీర్యంలోని శుక్రకణాలు మహిళ శరీరంలోకి ప్రవేశించడానికి వీలుగా బెడ్ పై పడుకొని ఉండడం మంచిది. అలా కనీసం ఓ పావు గంట ఉండడం వల్ల గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు పిరుదుల కింద భాగంలో కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టడం వల్ల మరింత ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తుంటారు కానీ మామూలుగా పడుకున్నా శుక్రకణాలు వేగంగా లోపలికి వెళ్లిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

3. ఎంత తరచుగా సెక్స్ లో పాల్గొంటే త్వరగా గర్భం ధరించవచ్చు?

ఎంత తరచుగా సెక్స్ లో పాల్గొన్నామన్న దానిపై ఆధారపడి గర్భం రాదు. గర్భం ధరించేందుకు శుక్రకణం అండాన్ని కలవాలి. అందుకే అండం విడుదలకు రెండు రోజుల ముందు నుంచి అండం విడుదలైన తేదీతో పాటు ఆ తర్వాత రోజు కూడా సెక్స్ లో పాల్గొనాలి. శుక్రకణాలు ఐదు రోజుల పాటు జీవిస్తాయి కాబట్టి అండం విడుదలయ్యేందుకు ఐదు రోజుల ముందు నుంచి సెక్స్ లో పాల్గొంటే సరిపోతుంది. అలాగే మరీ ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల కూడా బలహీనమైన కణాలు బయటకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రోజుకోసారి లేదా రెండు రోజులకోసారి సెక్స్ లో పాల్గొనడం మంచిది.

4. ఎంత కాలం పిల్లల కోసం ప్రయత్నించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లాలి?

పిల్లల కోసం కనీసం సంవత్సరం పాటు ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు ఉపయోగించకుండా ప్రయత్నించి.. ఆ తర్వాత గర్భం రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది. అయితే 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు మాత్రం ఆరు నెలల పాటు గమనించి డాక్టర్ ని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి. 

మరో ఘనత సాధించిన తాజ్ మహల్.. అదేంటో మీకు తెలుసా??

బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

బిడ్డ‌ను ఎయిర్‌పోర్ట్‌లో మ‌ర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

Read More From Health