Entertainment

2018లో ఈ తెలుగు సినిమాలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా..?

Sandeep Thatla  |  Dec 27, 2018
2018లో ఈ తెలుగు సినిమాలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా..?

ప్రతి సంవత్సరం కొత్త తెలుగు సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి.  అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను పొందుతుంటాయి. మరికొన్ని అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలమవుతుంటాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం రొటీన్ ఫార్మాలాకి భిన్నంగా రూపొంది.. చూసిన ప్రేక్షకులకి థ్రిల్‌ని కలుగచేస్తాయి.

ఈ సంవత్సరం అటువంటి టాలీవుడ్ (Tollywood) చిత్రాలు ఒక అయిదు వరకు విడుదలయ్యాయి, ఆ చిత్రాలు రొటీన్ ఫార్ములా సినిమాలకి భిన్నంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల మనసులని సైతం గెలవగలిగాయి. ఆ చిత్రాలే – RX 100, అ, అంతరిక్షం, C/o కంచరపాలెం & గూఢచారి.

ముందుగా RX 100 చిత్రం గురించి మాట్లాడుకుంటే, అసలు ఇప్పటివరకు తెలుగు చిత్రాల్లో మునుపెన్నడూ చెప్పని వైవిధ్యమైన కథాంశం తీసుకుని దానిని ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయడంలో దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) సక్సెస్ అయ్యాడు. అయితే ఆ పాయింట్ చాలా సున్నితమైనదే కాకుండా.. అత్యంత వివాదస్పదమయ్యే అవకాశం ఉండి కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంది అని అనుకున్న వారందరి అంచనాలని తిరగరాస్తూ ఈ చిత్రం.. ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ లిస్ట్‌లో ఉన్న రెండవ చిత్రం గూఢచారి. మనం సీక్రెట్ ఏజెంట్ & జేమ్స్ బాండ్ సినిమాలు హాలీవుడ్‌లో ఎక్కువగా చూస్తుంటాము. ఇలాంటి పాయింట్‌తో మన తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఎప్పుడో సూపర్ స్టార్ కృష్ణ తీసిన గూఢచారి 116 తరువాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రభావం చూపగలిగే మరో సీక్రెట్ ఏజెంట్ సినిమా తెలుగులో రాలేదు. అయితే ఇన్నాళ్ళకి  మళ్ళీ తెలుగులో వచ్చిన సీక్రెట్ ఏజెంట్ సినిమా గూఢచారి (Goodachari). ఈ సినిమా కోసం సాంకేతిక వర్గం పడిన కష్టం మనకి తెరపైన కనిపిస్తుంది.

ఒక సీక్రెట్ ఏజెంట్ సినిమాలో ఉండాల్సిన ఉత్కంఠత ఈ సినిమాలో మనకి కావాల్సినంత ఉంటుంది. ఇక సీక్రెట్ ఏజెంట్‌గా అడివి శేష్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పాలి.  ఇటీవలే ఈ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించిన గూఢచారి టీం వచ్చే ఏడాది చివరిలో గూఢచారి 2 విడుదల చేస్తామని ప్రకటించడం గమనార్హం.  పార్ట్ 2 ఈ సినిమాని మరిపించే స్థాయిలో ఉంటుందా లేదా అనేది చిత్రం రిలీజ్ అయితే కానీ చెప్పలేం…

తన తొలిచిత్రంతోనే.. తానెంత వైవిధ్యమైన కథనాన్ని తెరకెక్కించగలడో నిరూపించుకున్న దర్శకుడు సంకల్ప్. మొదటి సినిమానే ఒక సబ్ మెరైన్  నేపథ్యంలో తీసి సంచలనం సృష్టించాడు. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో పురస్కారం రావడం ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఆ విజయం & గుర్తింపు ఇచ్చిన నమ్మకంతో తన రెండవ చిత్రం కూడా అంతే స్థాయిలో వైవిధ్యంగా ఎంపిక చేసుకున్నాడు. అదే అంతరిక్షం (Antariksham). బి  ది ఫస్ట్ లేదా బి ది బెస్ట్ అనే ఫిలాసఫీని నమ్మే సంకల్ప్ అంతరిక్షంతో తెలుగులో తొలిసారి ఒక స్పేస్ డ్రామా చిత్రాన్ని తీసాడు. ఈ చిత్రంలో టెక్నికల్ అంశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసినా కూడా.. అవి సాధ్యమైనంత వరకు సులభంగా ప్రేక్షకుడికి అర్ధమయ్యే రీతిలోనే చూపెట్టే ప్రయత్నం చేసాడు. ఏదేమైనా తన ట్రేడ్ మార్క్‌ని మాత్రం తన రెండవ చిత్రంలో కూడా కొనసాగించగలిగాడు సంకల్ప్.

సినిమా అనేది మనిషికి ఆటవిడుపు లాంటిది. ఇక ఆ సినిమాని ఎక్కువగా ఆదరించేది కూడా సామాన్య ప్రేక్షకుడే. అలాంటిది ఒక సామాన్యుడే మనకి తెరపైన హీరోగా కనిపిస్తూ ఉంటే ఇక మనం థ్రిల్ అవ్వకుండా ఎలా ఉంటాము. అలాంటి ఒక చిత్రమే ఈ C/o కంచరపాలెం (C/o Kancharapalem). ఈ చిత్రం కోసం నిజంగా కంచరపాలెంలో ఉండే సామాన్యులనే నటీనటులుగా ఎంపిక చేసి వారితో అత్యద్భుతంగా నటింపచేసిన దర్శకుడు వెంకటేష్ మహా అభినందనీయుడు. భవిష్యత్తులో ఇటువంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుందాం.

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో  నేను స్వయంగా చూసి థ్రిల్ అయిన చిత్రం ‘‘. ఒక చిన్న పాయింట్‌ని తీసుకుని దాని చుట్టూ జరిగిన సంఘటనలకి పాత్రలు సృష్టించి వాటిని నడిపించిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేము. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) రాసుకున్న కథకి హీరో నాని (Nani) నిర్మాతగా వ్యవహరించగా..  కాజల్, నిత్యా, ఈషా, రెజీనా  తదితరులు ముఖ్యపాత్రలు పోషించి ఈ చిత్రానికి ప్రాణం పోశారు. కచ్చితంగా ఈ ఏడాది వచ్చిన మంచి చిత్రాలలో  ‘అ’ కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి ఈ ఏడాది కాలంలో రొటీన్ ఫార్ములాకి భిన్నంగా వచ్చిన సినిమాలు. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరగాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

2018లో టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!

2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే

Read More From Entertainment