Celebrity Life

భద్రత – నేడు పెద్ద సవాల్ (రోడ్డు ప్రమాదంలో.. వర్థమాన టీవీ తారలు మృతి)

Sandeep Thatla  |  Apr 18, 2019
భద్రత – నేడు పెద్ద సవాల్  (రోడ్డు ప్రమాదంలో.. వర్థమాన టీవీ తారలు మృతి)

హైదరాబాద్‌లో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన టీవీ తారలు భార్గవి (Bharghavi), అనుషా రెడ్డిలు (Anusha Reddy) మృతి చెందారు. పలు టీవీ సీరియళ్లల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఇరువురు.. ఇలా రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించడం యావత్ టెలివిజన్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

త్వరలో ప్రసారం కానున్న ఒక టీవీ సీరియల్ షూటింగ్ నిమిత్తం.. వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి అడవులకి యూనిట్‌తో సహా వెళ్లిన వీరిద్దరూ విగతజీవులై రావడంతో.. వారి బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌లో షూటింగ్ పూర్తి కాగానే.. నిన్న ఉదయం యూనిట్ తిరిగి పయనమైంది. కారులో వీరిద్దరితో పాటు వినయ్ అనే వ్యక్తి, డ్రైవర్ చక్రి కూడా ఉన్నారు.

హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల (Chevella) వద్ద ఉన్న అప్పారెడ్డి గూడలో (Appareddy Guda)  ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి.. పక్కనే ఉన్న చెట్టును డ్రైవర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వికారాబాద్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. భార్గవి, అనూష ప్రమాదస్థలిలోనే మరణించగా; మిగిలిన ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరికీ కూడా తీవ్ర గాయాలవ్వడం గమనార్హం.

ఈ ప్రమాద వార్త వినగానే.. మృతుల సహనటులు, యూనిట్ సభ్యులు కూడా షాకయ్యారు. నిన్నటి వరకూ తమతో కలిసి నవ్వుతూ మాట్లాడిన వీరిద్దరూ ప్రమాదంలో మరణించారనే వార్త.. నమ్మశక్యంగా లేదంటూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ వర్ధమాన నటీమణుల్లో భార్గవి బుల్లితెరపై ప్రసారమవుతోన్న ముత్యాల ముగ్గు (Muthayala Muggu) సీరియల్‌‌తో ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ఈ సీరియల్‌లో నెగెటివ్ రోల్ పోషిస్తోన్న నందిక స్నేహితురాలి పాత్రలో ఆమె నటిస్తోంది. అలాగే అనుషారెడ్డి ఇప్పుడిప్పుడే వర్థమాన నటిగా రాణిస్తోంది. భార్గవి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంత వాసి కాగా; అనూషా రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అమ్మాయి.

ఈ రోడ్డు ప్రమాద ఘటన మరోసారి.. చిత్రరంగంలో మహిళల భద్రతకు సంబంధించిన అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. ఆ మాటకొస్తే.. మహిళలనే కాదు.. రోడ్డు భద్రత విషయంలో అందరూ అవగాహన పెంచుకోవాలని.. డ్రైవర్లు జాగరూకతతో వ్యవహరించాలని.. సర్వీస్ ప్రొవైడర్లు కూడా సుశిక్షితులైన క్యాబ్ డ్రైవర్లనే రిక్రూట్ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. చలన చిత్ర నటులు రోడ్డు ప్రమాదంలో మరణించడం కొత్తేమీ కాదు.

గతంలో ప్రముఖ చలన చిత్ర నటుడు హరిక్రిష్ణ, అంతకు ముందు ఆయన తనయుడు కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం కన్నడ టీవీ నటి రేఖ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించింది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదాలతో మరణాలకు కారణమవుతున్న డ్రైవర్లపై పోలీసులు ఇటీవలే ఉక్కుపాదం మోపేందుకు సంకల్పించారు. 

లైసెన్స్ పొంది కూడా రోడ్డు  ప్రమాదాలు చేస్తూ.. మరణాలకు కారణమయ్యే డ్రైవర్లపై ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 19 కింద చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఓ సర్క్యులర్ జారీ చేశారు. లైసెన్సులు జారీ చేసే విషయంలో ఆర్టీఓ అధికారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

తెలంగాణ విషయానికి వస్తే.. గతేడాది 22,219 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 6599 మంది మరణించారు. ఇక డ్రైవర్లపై ఎంవీ యాక్టు క్రింద నమోదైన కేసులు లక్షకు పైగానే ఉంటాయని అంచనా.

ఏదేమైనా.. టెలివిజన్ రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు తారలు.. చాలా చిన్నవయసులోనే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదకరం. 

ఇవి కూడా చదవండి

నా ఆఫీస్‌లో ఆడవారికి మాత్రమే ఎంట్రీ : రేణు దేశాయ్

బాక్సింగ్‌లోనే కాదు.. పాట పాడడంలో కూడా మేరీ కోమ్ నెం 1..!

ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!

Read More From Celebrity Life