ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!

ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!

ఆర్జీవీ (RGV) తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో తెలుసా?? ఇప్పటివరకు కెమెరా వెనుక ఉంటూ కథ ప్రకారం సినిమా రూపొందించడంలో తలమునకలైన ఆయన త్వరలోనే కెమెరా ముందుకు వచ్చి నటించనున్నారట.. అది కూడా ఆయన దర్శకత్వం వహిస్తోన్న ఒక సినిమాలో కీలక పాత్ర కావడం విశేషం. ఆర్జీవీ ఈ వార్తను ప్రకటించింది మొదలు ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు. ఇక, తెలుగు సినిమా ప్రేక్షకుల్లో అయితే ఈ వార్త బాగా ఉత్సాహాన్ని రేకెత్తించిందనే చెప్పాలి.


ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వర్మ.. తాజాగా నటుడిగా మారనున్నట్లు ప్రకటించారు. అది కూడా ఒక పెద్ద క్రిమినల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆయన రూపొందించే ‘కోబ్రా (Cobra)’ అనే సినిమా ద్వారా. ఇందులో మూడు కీలక పాత్రలు ఉండగా వాటిలో ఒకటైన ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు నటుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్ర కథ కూడా మాఫియా నేపథ్యమే ప్రధానంగా సాగడం విశేషం.


cobra-1


అంతేకాదు.. ఈ కథలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ది కూడా ప్రధాన పాత్రేనట.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించిన అగస్త్య ఈ చిత్రానికి కూడా వర్మతో కలిసి దర్శకత్వ బాధ్యతలను పంచుకోనున్నారట.. ఈ విషయాలన్నీ పంచుకుంటూ కోబ్రా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నారు. దీనిని ద్విభాషా చిత్రం (తెలుగు, హిందీ)గా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.


అయితే తాను నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నట్లు మన ఆర్జీవీ ప్రకటించిన కాసేపటికే ప్రముఖ నటీనటుల ప్రశంసలు, వ్యాఖ్యలతో ట్విట్టర్‌లో రాంగోపాల్ వర్మ పేరు మారుమోగిపోయింది. బిగ్ బీ అమితాబ్ మొదలుకొని సుదీప్ వంటి ప్రముఖ నటుల వరకు చాలామంది వర్మ కోసమైనా సినిమా చూస్తామని, కెమెరా వెనుక ఉండే ఆర్జీవీ కెమెరా ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూడాలనుందంటూ తమ మనసులోని సంతోషాన్ని బయటపెడుతూనే వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


రాంగోపాల్ వర్మ ఎంచుకున్న ఈ దారిలో ఆయన కంటే ముందే.. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు నటులుగా మారి తమ నటనాభిరుచిని చాటుకోవడం జరిగింది. తాజాగా ఈ జాబితాలో ఆర్జీవీ కూడా చేరారు. ఈ నేపథ్యంలో తెలుగులో దర్శకత్వం నుంచి నటన దిశగా అడుగులు వేసిన కొందరు డైరెక్టర్ కమ్ యాక్టర్స్ పై ఒక లుక్ వేద్దాం..


dasari-1


నటులుగా మారిన దర్శకుల జాబితా గురించి మాట్లాడుకునే క్రమంలో అందరి కంటే ముందుగా వినిపించే పేరు దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao). దర్శక రత్నగా పేరు పొందిన ఈ అగ్రదర్శకుడు అనేక కథలకు ప్రాణం పోయగా; వాటిలో కొన్ని కీలక పాత్రలకు తన నటనతో ఊపిరిపోశారు. మామగారు, స్వర్గం- నరకం, మేఘ సందేశం, ఒసేయ్.. రాములమ్మ, ఎర్రబస్సు.. మొదలైన చిత్రాలే ఇందుకు ఉదాహరణ. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పిన ఘనత ఆయనకే సొంతమని చెప్పచ్చు.


k-vishwanath-1


దాసరి తరువాత ఈ జాబితాలో మనమంతా చెప్పుకోవాల్సిన మరో గొప్ప దర్శకుడు, నటుడు- కె. విశ్వనాథ్ (K Vishwanath). ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏ స్థాయిలో గౌరవాన్ని సంపాదించుకున్నాయో వెండితెరపై ఆయన పండించిన పాత్రలు కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంకా చెప్పాలంటే- దర్శకత్వం నుంచి కాస్త విరామం తీసుకున్న సమయంలో ఆయన నటుడిగా బాగా బిజీ అయిపోయారు. అందుకే ఆయన దర్శకత్వానికే కాదు.. నటనకు కూడా దాసోహం అనే అభిమానులు చాలామందే ఉన్నారు.


ఈ ఇద్దరు ఘనాపాటిల తర్వాత డైరక్టర్ కమ్ యాక్టర్ లిస్ట్‌లో మనం మాట్లాడుకోవాల్సింది మరో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV krishna Reddy) గురించి. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నటుడిగా మారడమే కాదు.. హీరోగా ఉగాది, అభిషేకం.. వంటి సినిమాల్లో కూడా నటించి తనలోని నటుడిని అందరికీ పరిచయం చేశారు. అయితే హీరో అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ముందు డైరెక్టర్ అయిన తర్వాత తన కలను సాకారం చేసుకున్నారు.


ఎవర్ గ్రీన్ క్రేజీ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కూడా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో తళుక్కున మెరుస్తుంటారు. మాస్ ప్రేక్షకులకు ఆ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నవారే. ఆయన రూపొందించిన బాహుబలి (Baahubali) చిత్రంలో చిన్న పాత్రలో మెరుపు తీగలా మెరిశారు. వెండితెరపై నటీనటులు ఎలా నటించాలో చేసి చూపించే ఆయనే ఒక పాత్ర చేయడం నిజంగా విశేషమే..


krish-as-kv-reddy


ప్రస్తుత తరంలో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుల్లో క్రిష్ (Krish) కూడా ఒకరు. తొలిచిత్రం గమ్యంలో నక్సలైట్‌గా అతిథి పాత్రలో మెప్పించిన ఆయన ఆ తర్వాత కూడా అడపాదడపా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. గతేడాది విడుదలైన మహానటి చిత్రంలో క్రిష్ పోషించిన కె.వి.రెడ్డి పాత్ర మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో సైతం ఇదే పాత్రను ఆయన పోషించడం విశేషం.


వీరే కాదు.. ఆర్. నారాయణమూర్తి, కోడి రామక్రిష్ణ, కాశీ విశ్వనాథ్ మొదలైనవారు కూడా నటులుగా రాణించిన వారే. ఈతరం దర్శకుల్లో మారుతీ, అనిల్ రావిపూడి.. వంటి దర్శకులు సైతం వెండితెరపై తళుకున్న మెరిసినవారే. కొందరు సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తే.. ఇంకొందరు మెరుపుతీగలా కనిపించి మాయమైపోతూ ఉంటారు. ఏది ఏమైనా.. దర్శకునిలో కూడా ఒక నటుడు ఉంటాడన్న మాటను నిజమేనని నిరూపిస్తూ అందరి కళ్లకూ కట్టారు ఈ దర్శకులు, నటులు. మరి, ఆర్జీవీ తన నటనతో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


ఇవి కూడా చదవండి


అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన 'గీత గోవిందం' హీరోయిన్..!


#JoinRishi అంటూ 'ఉగాది'ని స్టైలిష్‌గా మార్చేసిన... మహేష్ బాబు 'మహర్షి' టీజర్


ప్రేమ ఉన్న చోట.. బాధ కూడా ఉంటుంది (మజిలీ మూవీ రివ్యూ)