Bollywood

విశ్వక్ సేన్ “ఫలక్ నుమా దాస్” మూవీ రివ్యూ – ఇది పక్కా హైద్రాబాదీ సినిమా

Sandeep Thatla  |  May 30, 2019
విశ్వక్ సేన్ “ఫలక్ నుమా దాస్” మూవీ రివ్యూ – ఇది పక్కా హైద్రాబాదీ సినిమా

ఫలక్ నుమా దాస్ (Falaknuma Das) – #MassKaDas సినిమా విడుదలకి ముందే ప్రేక్షకుల్లో కావాల్సినంత హైప్‌ని తీసుకురాగలిగింది. అంతే కాకుండా ఈ సినిమా టీజర్‌తో పాటు ట్రైలర్ కూడా ఈ చిత్రం వైపు ఆడియన్స్ దృష్టిని మరల్చేలా చేశాయి. 

ఇక ఈ చిత్రాన్ని అన్ని తానై నడిపించిన విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా “ఫలక్ నుమా దాస్” కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని ఆడియో విడుదల & ప్రీ -రిలీజ్ వేడుకలలో ఢంకా బజాయించి మరి చెప్పాడు. ఇంతకి ఈ సినిమా ఎలా ఉంది? విశ్వక్ సేన్ చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ అవుతుందా? ప్రేక్షకులు ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలని ఈ చిత్రం అందుకుందా? అనే ప్రశ్నలకి సమాధానం ఈ క్రింద సమీక్షలో తెలుసుకుందాం…

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్రాంతంలో పెరిగిన దాస్ అనే యువకుడిని.. తన చుట్టు పక్కల పరిసరాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. స్నేహితులతో కలిసి జులాయిగా తిరగడం, మందు తాగడం, స్థానికంగా చిన్న చిన్న గొడవల్లో తలదూర్చడం వంటివి చేస్తుంటాడు దాస్. ఈ క్రమంలోనే తన మిత్రులతో కలిసి ప్రారంభించిన మటన్ షాప్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి దాస్ పైన పొలీసు కేసు నమోదయ్యే వరకు వెళ్తుంది.

ఇంతకీ ఆ కేసు నుండి దాస్ బయటపడ్డాడా? లేదా? ఆ కేసు పర్యవసానాలు తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయి అనే అంశాలు వెండితెర పైన చూడాల్సిందే!

ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా కథనంలో మనకి ఎక్కడా కూడా.. ఒక అసహజమైన మాట లేదా హీరోయిజాన్ని పెంచే సన్నివేశాలు వెతికినా కూడా దొరకవు. అలాంటి ఒక వాస్తవికతకు బాగా దగ్గరగా ఉన్న కథలో నటీనటులంతా కూడా అంతే సహజంగా అభినయించారు. 

మరి ముఖ్యంగా విశ్వక్ సేన్, ఉత్తేజ్, తరుణ్ భాస్కర్, వెంకటేష్ కాకుమాను.. ఇలా దాదాపు ఒక అరడజను మంది తమ పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు. కాకపోతే హీరోతో పాటు ఇతర పాత్రల నటన ముందు.. హీరోయిన్ల నటన తేలిపోయిందనే చెప్పాలి. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా వారి వల్ల సినిమాకి ఏ విధంగానూ ప్లస్ కాలేదు. కథానాయికలుగా నటించిన సలోని మిశ్ర, హర్షిత గౌర్, ప్రశాంతిల నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

అయితే విశ్వక్ సేన్ మాత్రం ఈ చిత్రంలో  హైదరాబాద్‌ని తనదైన శైలిలో చూపించాడు. తాను పెరిగిన సమయంలో చూసిన ప్రతి సంఘటనని ఈ చిత్రంలో మనకి చూపించే ప్రయత్నం చేశాడు. ఇంకొక ప్రధాన విషయం ఏమిటంటే.. ఈ  చిత్రానికి దర్శకుడిగా, మాటల రచయితగా & నటుడిగా కూడా విశ్వక్ భిన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. తను పోషించిన మూడు పాత్రలకూ న్యాయం చేశాడు. దర్శకత్వంలో కాస్త తడిబడినా మాటల రచయితగా, నటుడిగా మాత్రం చాలా చక్కగా ఈ రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు.

 

ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ మీరు తెరపైన వింటే.. ఈ మాటలు అచ్ఛంగా లోకల్ హైదరాబాద్‌లోని సామాన్యులు మాట్లాడుకునే మాటలే అని అనిపించక మానవు. సినిమాను వాస్తవికంగా చూపించడానికి ఈ సంభాషణలు ఎంతో మేలు చేశాయి. దీనికి కూడా క్రెడిట్ దక్కాల్సింది దర్శకుడికే అని చెప్పవచ్చు.

అలాగే ఈ చిత్రం క్లైమాక్స్‌ని చాలా డిఫరెంట్‌గా షూట్ చేశారు. దాదాపు 10 నిమిషాలకి పైగానే నిడివిగల ఉన్న ఒక సన్నివేశం ఎక్కడా కూడా ఒక్క కట్ లేకుండా షూట్ చేయడం విశేషం. ఒక కొత్త దర్శకుడు.. అందులోనూ తానే హీరోగా చేస్తున్న చిత్రంలో ఇటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

అయితే క్లైమాక్స్‌ని ఒకే సన్నివేశంగా తీయాలనుకున్న దర్శకుడి ఆలోచన ప్రశంసనీయమైనా.. ఆ స్థాయిలో మాత్రం ఆ సన్నివేశం పండలేదనే చెప్పాలి. నటుడిగా, మాటల రచయితగా విశ్వక్ సేన్ మంచి మార్కులే కొట్టేసినా… దర్శకుడిగా మాత్రం అక్కడక్కడ తడబడ్డాడు. కొన్ని చోట్ల అనుభవలేమి కనిపించినా.. బాగానే మేనేజ్ చేశాడని చెప్పుకోవచ్చు.

ఇటువంటి ఒక కొత్త తరహా చిత్రం తీయాలంటే, బలమైన సాంకేతిక వర్గం తప్పనిసరి. అలా ఈ చిత్రానికి సంగీతం అందించిన వివేక్ సాగర్ (Vivek Sagar).. పాటల విషయంలో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. నేపధ్య సంగీతాన్ని మాత్రం బాగా అందించాడు. కొన్ని సన్నివేశాల్లో వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సదరు సన్నివేశాలు బాగా ఎలివేట్ అవ్వడం జరిగింది.

ఇక రవితేజ గిరజాల (Raviteja Girijala) ఎడిటింగ్ & విద్యా సాగర్ (Vidya Sagar) కెమెరాపనితనం చాలా బాగుంది. ఒకరకంగా విశ్వక్ సేన్ ఈ చిత్రానికి నిర్మాతగానే వ్యవహరించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు (Karate Raju) నిర్మాతగా వ్యవహరించగా,  నిర్మాణ్ బాధ్యతలని కూడా చాలా వరకూ తానే దగ్గరుండి చూసుకున్నాడు. విశ్వక్ సేన్.

చివరగా చెప్పాల్సిందేమిటంటే… హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలు, ట్యాంక్ బండ్ లేదా చార్మినార్ మాత్రమే కాదని… అసలుసిసలైన మాస్ హైదరాబాదీల జీవనాన్ని మనం ఈ సినిమాలో కచ్చితంగా చూడవచ్చని చెప్పుకోవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే – ఫలక్ నుమా దాస్ — ప్రతీ హైద్రాబాదీ పక్కాగా చూడవలసిన చిత్రం.

ఇవి కూడా చదవండి

సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!

మాస్ మసాలా… పూరి జగన్నాధ్ – రామ్‌ల “ఇస్మార్ట్ శంకర్” టీజర్..!

ముగింపు లేకుండా ‘సాగే’ కథ (మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ రివ్యూ)

 

Read More From Bollywood