Astrology

పరమ పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం.. ఎందుకు చేయాలో మీకు తెలుసా?

Soujanya Gangam  |  Aug 8, 2019
పరమ పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతం.. ఎందుకు చేయాలో మీకు తెలుసా?

శ్రావణ మాసం (Sravana month).. ఎంతో పవిత్రమైన మాసం ఇది. ఈ మాసంలో ఆడవాళ్లు తమ కుటుంబ శ్రేయస్సు, సంపదలను కాంక్షిస్తూ రకరకాల వ్రతాలు చేస్తుంటారు. కట్టుకున్నవాడి క్షేమం కోసం చేసే మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబమంతా ఐశ్వర్యారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం (Friday) నాడు వరలక్ష్మీ వ్రతం (vara laxmi vratam) చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ వ్రతానికి తెలుగు లోగిళ్లలో చాలా ప్రాధాన్యమిస్తారు. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా.. అసలు ఈ పండగ ఎందుకు చేసుకోవాలో.. దాని వెనుక ఉన్న కథేంటో మనమూ తెలుసుకుందాం రండి.

instagram

సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్ (Raksha Bandhan Quotes In Telugu)

శ్రావణ మాసం శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు.. వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటికి సకల సౌభాగ్యాలు అందాలని కోరుకుంటూ ఆడవారు చేసే వ్రతం ఇది. వర అంటే వరాలిచ్చే లక్ష్మీ అంటే.. దేవత అని అర్థం. సిరులిచ్చే దేవతను పూజించే పండగ కాబట్టి.. దీనిని వరలక్ష్మీ వ్రతం అని చెబుతారు.

ఈ వ్రతం జరిపే రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. తర్వాత అష్ణలక్ష్ములందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవతను పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, శాంతి, ప్రేమ, చదువు, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు, ఆనందం.. వంటివన్నీ అందుతాయని భక్తుల నమ్మకం.

instagram

నాగ పంచమి రోజు పుట్టలో పాలు పోస్తున్నారా? అయితే ఇది ఓసారి చదవండి.

ఈ వరలక్ష్మీ దేవి వ్రతాన్ని పార్వతీ దేవి కూడా తన కుటుంబం కోసం ఆచరించిందట. అప్పటి నుంచి ఈ వ్రతాన్ని పెళ్లయిన స్త్రీలందరూ చేసే పద్ధతి ప్రారంభమైంది. కుటుంబమంతటి ఆరోగ్యశ్వైర్యాల కోసం చేయదగిన ఒక నోము గురించి చెప్పమని పార్వతీ దేవి శివుడిని కోరుకుందట. ఆయన ఈ వ్రతం గురించి వెల్లడించి దీన్ని చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారట.

వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. తర్వాత కలశ స్థాపన చేసుకున్న తర్వాత.. గణపతి పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి  చదివి.. కథ చెప్పుకున్న తర్వాత నైవేద్యాలు అర్పించి.. కంకణం కట్టుకొని.. అక్షతలు తలపై వేసుకొని పూజ పూర్తి చేయాలి.

ఆ తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆ రోజు తినాలి. ఆ తర్వాత రాత్రి వరకూ ఉపవాసం ఉండాలి. ఇంతకుమించి ఈ వ్రతం చేయడానికి ఎలాంటి నియమనిష్ఠలు లేవు. భక్తితో పూజిస్తే చాలు.. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఈ వ్రతం మనసు నిండా భక్తితో చేస్తే చాలు.. సకల శుభాలు కలుగుతాయి.

instagram

ఆంధ్రప్రదేశ్‌లో మీరు తప్పక సందర్శించాల్సిన.. పుణ్యక్షేత్రాలు ఇవే ..!

అసలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలి.. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే వరలక్ష్మీ కథ గురించి తెలుసుకోవాల్సిందే. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. బంగారు గోడతో ఉన్న ఆ పట్టణం ఎంతో అందంగా కనిపించేది.

అక్కడ చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్త, అత్తమామలకు సేవలు చేస్తూ ఉండేది. ఓ రోజు వరలక్ష్మీ దేవి ఆమె కలలోకి వచ్చి శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు.. తనని పూజించాలని అలా చేస్తే.. తను కోరిన వరాలు, కానుకలు ఇస్తానని చెప్పింది.

ఆమె లేచి అదంతా కల అని తెలుసుకొని.. తర్వాత దాని గురించి ఇంట్లో వాళ్లందరికీ వెల్లడించిందట. వారు కూడా చాలా సంతోషించి ఆమెను వరలక్ష్మీ వ్రతం చేయమని చెప్పారట. ఆ ఊరిలోని ముత్తైదువులందరూ కూడా చారుమతి కలను విని శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు.. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి ఆమె ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి బియ్యం పోసి పంచ పల్లవాలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి.. వరలక్ష్మీ దేవిని పూజించింది.

పూజ చేసి నైవేద్యాలు అర్పించి.. కంకణం కట్టుకొని మూడు ప్రదక్షిణలు చేయగానే కేవలం చారుమతికి మాత్రమే కాదు.. అక్కడికి వచ్చిన స్త్రీలందరూ ఆభరణాలతో మెరవసాగారు. వారందరి ఇళ్లు ధన, కనక, వస్తు, వాహనాలతో నిండిపోయాయి. ఆ తర్వాత వారంతా కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సిరిసంపదలతో జీవితాంతం గడిపారు. ఈ వ్రతం చేసినప్పుడు చూసినా.. వ్రత కథ చదివినా కూడా ఐష్టైశ్వర్యాలు, ఆరోగ్యభాగ్యాలు సొంతమవుతాయి.

అమ్మవారి అలంకరణను విభిన్నంగా చేస్తూ.. విశేష పూజలు జరిపించడం కొందరికి అలవాటు. అలా చేయలేనివారు కేవలం కలశం పెట్టుకొని పూజించినా సరే.. అవే ఫలితాలు దక్కుతాయి. కాబట్టి పెద్దగా నియమనిష్టలు పాటించాల్సిన అవసరం లేని ఈ వ్రతాన్ని.. అందరూ పాటించి ఆ లక్ష్మీ మాత కరుణా కటాక్షాలను పొందండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Astrology