ఫేసియల్ హెయిర్(facial hair).. ముఖం మీద పెరిగే అవాంఛిత రోమాలు మహిళల్నిచాలా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వాటిని తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు మహిళలు. దీని కోసం వ్యాక్సింగ్, త్రెడ్డింగ్, షేవింగ్ వంటివి చేసుకొంటూ ఉంటారు. ఇవే కాకుండా కొన్నిహెయిర రిమూవల్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. అయితే ఇవి వెంటనే ఫలితాన్నివ్వకపోయినప్పటికీ దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. చర్మంపై అవాంఛిత రోమాలు పెరగకుండా చేస్తాయి.
1. పెసర పిండి, రోజ్ వాటర్
పెసరపిండిలో ఎక్స్ఫోలియేటింగ్ గుణాలుంటాయి. ఇవి చర్మంపై ఉన్న మృతకణాలు, మురికిని సమర్థంగా తొలగిస్తాయి. పెసరపిండిని రోజ్ వాటర్ తో కలిపి ఉపయోగించినప్పుడు అది చర్మంపై వెంట్రుకలు పెరగకుండా చేస్తుంది.
కావాల్సినవి:
- పెసరపిండి – 2 టేబుల్ స్పూన్లు
- రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు
- నిమ్మరసం – టేబుల్ స్పూన్
గిన్నెలో పెసరపిండి, రోజ్ వాటర్ వేసి రెండింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత నిమ్మరసం కూడా వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వెంట్రుకలు ఉన్న చోట రాసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత దాన్ని వేళ్లతో రుద్దుతూ ప్యాక్ ను తొలగించుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వేసుకోవడం ద్వారా ముఖంపై అవాంఛిత రోమాలు పెరగకుండా చూసుకోవచ్చు. ఈ ప్యాక్ ఎలాంటి చర్మతత్వం కలిగినవారైనా వేసుకోవచ్చు.
2. ఓట్ మీల్, అరటిపండు
ఓట్ మీల్, అరటిపండుతో తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.
కావాల్సినవి:
- ఓట్ మీల్ – రెండు టేబుల్ స్పూన్లు
- బాగా ముగ్గిన అరటిపండు – ఒకటి
అరటిపండును మెత్తటి పేస్ట్ లా తయారుచేయాలి. దీనిలో ఓట్ మీల్ కూడా కలిపి బాగా బ్లెండ్ చేయాలి. దీన్ని ముఖంపై అవాంఛిత రోమాలున్న చోట అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ ను వారానికి కనీసం రెండు సార్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
3. బంగాళాదుంప, కందిపప్పు
కందిపప్పు ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. బంగాళాదుంపలో ఉండే నేచురల్ బ్లీచింగ్ గుణాలు చర్మంపై మిగిలిపోయిన వెంట్రుకలను కనబడకుండా చేస్తాయి. కాబట్టి ముఖంపై ఉన్న ఫేసియల్ హెయిర్ తొలగించడానికి ఈ హెయిర్ రిమూవల్ ప్యాక్ ప్రయత్నించండి.
కావాల్సినవి:
- కందిపప్పు – కప్పు
- బంగాళాదుంప – ఒకటి
- నిమ్మరసం – టేబుల్ స్పూన్
- తేనె – టేబుల్ స్పూన్
కందిపప్పును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన కందిపప్పును మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బంగాళాదుంప తొక్క తీసి దాన్ని కూడా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేయాలి. బంగాళాదుంప పేస్ట్ ను పలుచని వస్త్రంలో మూటగా కట్టి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. దీనిలో ముందుగా రుబ్బి పెట్టుకొన్న కందిపప్పు పేస్ట్, నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసి పూర్తిగా ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత వేళ్లతో రుద్దుతూ ప్యాక్ ను తొలగించాలి. ఇలా చేసేటప్పుడే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు చాలావరకు రాలిపోతాయి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా ఫేసియల్ హెయిర్ సమస్య నుంచి బయటపడవచ్చు.
4. బొప్పాయి, పసుపు
పచ్చి బొప్పాయిలో ఉన్న పపైన్ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను నాశనం చేస్తుంది. అందుకే పచ్చి బొప్పాయితో తయారు చేసిన హెయిర్ రిమూవల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు.
కావాల్సినవి:
- పచ్చి బొప్పాయి – పావు చెక్క
- పసుపు పొడి – అర టీస్పూన్
తొక్క తీసిన పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేయాలి. దీనికి పసుపు కలిపి అవాంఛిత రోమాలున్న చోట ప్యాక్ మాదిరిగా అప్లై చేయాలి. పావుగంట లేదా 20 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా వెంట్రుకలు వాటికవే రాలిపోతాయి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు చొప్పున వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
5. కమలాఫలం, నిమ్మ తొక్కలు
సాధారణంగా కమలాఫలం, నిమ్మ తొక్కల పొడిని చర్మం అందంగా మెరవడానికి ఉపయోగిస్తాం. ఇవి చర్మాన్ని మెరిపించడం మాత్రమే కాదు.. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సైతం తొలగిస్తాయి.
కావాల్సినవి:
- కమలాఫలం తొక్కల పొడి : టేబుల్ స్పూన్
- నిమ్మ తొక్కల పొడి: టేబుల్ స్పూన్
- ఓట్ మీల్: టీ స్పూన్
- బాదం గింజల పొడి: టీస్పూన్
- ఆలివ్ నూనె: రెండు టీస్పూన్లు
- రోజ్ వాటర్: టీస్పూన్
ఈ పదార్థాలన్నింటినీ గిన్నెలో తీసుకొని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతివేళ్లతో ముఖంపై గుండ్రంగా రుద్దుతూ ప్యాక్ తొలగించుకోవాలి. ఇలా తొలగించుకొనేటప్పుడు వెంట్రుకలు పెరుగుతున్న దిశకు వ్యతిరేక దిశలో రుద్దాలి. అంటే కింది నుంచి పైకి రుద్దుకోవాలి. ఇలా పది నిమిషాలు చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. వారానికి మూడుసార్లు ఈ హెయిర్ రిమూవల్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
Images: shutterstock
ఇవి కూడా చదవండి:
ఈ ఫేస్ మాస్క్స్ ట్యాన్ తొలగించి.. చర్మాన్ని మెరిపిస్తాయి..!
జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఈ చిట్కాలు పాటించండి
అందమైన, మెరిసే చర్మం కోసం నలుగు పిండిని ఇలా ఉపయోగించండి..!