ఛలో (Chalo).. చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులని కట్టిపడేసిన ముద్దుగుమ్మ రష్మిక మందాన (Rashmika Mandanna). తాజాగా గీత గోవిందం కోసార్ట్ విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) “డియర్ కామ్రేడ్” (Dear Comrade) సినిమాలో నటించి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోందీ సుందరి.
అయితే ఫిలిం నగర్‌లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం రష్మిక ప్రస్తుతం తన తదుపరి చిత్రం విషయమై.. నిర్ణయం తీసుకోవడంలో బాగా ఇబ్బందిపడుతోందట. ఇంతకీ ఈ ముద్దుగుమ్మని అంతగా ఇబ్బందికి గురిచేస్తోన్న ఆ విషయం ఏంటంటే..
ఛలో, గీత గోవిందం, దేవదాస్.. వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామకు తెలుగులో ఆఫర్ల వెల్లువ బాగానే ఉంది. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #AA20 (వర్కింగ్ టైటిల్) లోనూ అవకాశం దక్కించుకుంది.
ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) & అనిల్ రావిపూడిల (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఈ అమ్మడినే హీరోయిన్‌గా ఎంపిక చేశారట. తెలుగులో పెద్ద హీరోల సరసన నటించే అవకాశం కెరీర్ ప్రారంభంలోనే రష్మికకు రావడంతో అంతా ఆమెను లక్కీ గర్ల్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ముంగిట మరో పెద్ద ఆఫర్ కూడా వచ్చి పడిందట.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించనున్న నాలుగో చిత్రం.. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంలో కూడా కథానాయికగా రష్మికనే సెలక్ట్ చేసుకున్నారట. మంచిదే కదా.. ఇందులో ఇబ్బందేముంది అని ఆలోచిస్తున్నారా?? అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.
ఈ సినిమాల్లో మహేష్ బాబు & అనిల్ రావిపూడి చిత్రం; అలాగే అఖిల్ & బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో రానున్న చిత్రం ఏకకాలంలో షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందట. రెండు సినిమాలలోనూ రష్మిక ప్రధాన కథానాయిక కాబట్టి.. రెండు చిత్రాల షూటింగ్స్‌కీ ఒకేసారి తన కాల్షీట్స్ సర్దుబాటు చేయాల్సి వస్తోంది.
ఒకేసారి రెండు పెద్ద చిత్రాలకు కాల్షీట్స్ సర్దుబాటు చేయడం ఇబ్బంది అవుతుండడంతో అటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకోవాలా? లేక గీతా ఆర్ట్స్ వంటి మెగా బ్యానర్‌తో కలిసి పని చేసే అవకాశం వదులుకోవాలో తెలియక తెగ సతమతమైపోతోంది రష్మిక.
అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించేందుకు అంగీకరించిన సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు ఇంకా నాలుగైదు నెలలు సమయం పడుతుంది కాబట్టి ఆ సినిమాతో అంతగా ఇబ్బంది లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.
కానీ మహేష్ & అఖిల్ సినిమాల విషయంలోనే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవ్వక ఈ రెండు చిత్రాలకూ అధికారికంగా సంతకాలు కూడా చేయలేదట ఈ చిన్నది. ఈ కారణంగానే ఆయా చిత్ర యూనిట్స్ సైతం తమ చిత్రంలో ప్రధాన కథానాయికగా రష్మిక నటించనున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మరి, రష్మిక ఈ సినిమాల్లో ఏ అవకాశాన్ని ఎంచుకోనుంది? ఎవరి సరసన నటించనుంది.. తెలియాలంటే ఆమె నిర్ణయం కోసం మనం కూడా వేచి చూడాల్సిందే..
ఇవి కూడా చదవండి
‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ ఎదుర్కొన్న.. #MeToo అనుభవం గురించి మీరు విన్నారా??
చిన్నారి ప్రాణాలు కాపాడిన ఫైర్‌మెన్‌కి.. మెగాస్టార్ ప్రశంసలు..!
‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!