సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ఒక తరానికి సంబంధించిన కథలు, కథనాలు, వాస్తవాలను దృశ్యరూపంలో తర్వాతి తరాలకు అందించే ఒక మాధ్యమం కూడా! అందుకే కొందరు దర్శక, నిర్మాతలు స్వాతంత్య్రోద్యమం గురించి, అందులో పాల్గొన్న దేశ నాయకుల గురించి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో దేశభక్తిని ప్రధానాంశంగా చేసుకొని కొన్ని సినిమాలను రూపొందించారు. వాటిలో చాలావరకు సినిమాలు ప్రేక్షకుల మెప్పును కూడా పొందాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా మనలో దేశభక్తిని పెంపొందించే అలాంటి కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం..
తెలుగు పేట్రియాటిక్ సినిమాలు – Best Telugu Patriotic Movies
అల్లూరి సీతారామ రాజు (Alluri Seetharamaraju) – దేశభక్తి ప్రధాన చిత్రాలు (Patriotic movies) అనగానే సగటు తెలుగువారికి ముందుగా గుర్తుకొచ్చే సినిమా అల్లూరి సీతారామరాజు . కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.
మన్యం వీరుడిగా ఆయన పలికించిన హావభావాలు వెండితెరపై చూసినప్పుడు మనలో కూడా దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. వి. రామచంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రిపురనేని మహారధి కథ- కథనాలను అందించారు. ఈ సినిమాను పద్మాలయ స్టూడియోస్ నిర్మించింది.
ఆంధ్ర కేసరి (Andhra Kesari) – టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. విజయ్ చందర్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రంలో మురళీమోహన్ కూడా నటించారు. 1983లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) సందర్భంగా ఈ సినిమాను విడుదల చేశారు.
బొబ్బిలి పులి (Bobbili Puli) – నందమూరి తారక రామారావు, శ్రీదేవి కాంబినేషన్ అంటే ఆ సినిమా దాదాపు హిట్ అనే భావన ఉండేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బొబ్బిలి పులి (Bobbili Puli) కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సైనికుడిగా తన దేశభక్తిని చాటుకొని.. ఆ తర్వాత సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తూ ప్రభుత్వం, చట్టాలకు వ్యతిరేకంగా పని చేస్తూ సంఘ విరోధిగా మారతారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్నే సొంతం చేసుకుందని చెప్పచ్చు.
సర్దార్ పాపారాయుడు (Sardar Paparayudu) – ఇక తెలుగు సినీ చరిత్రలో సర్దార్ పాపారాయుడు చిత్రానిది ప్రత్యేక స్థానం. దర్శక రత్న దాసరి నారాయణ రావు రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పచ్చు. ఈ సినిమాలో బ్రిటిష్ అధికారి అయిన మోహన్ బాబుతో సర్దార్ పాపారాయుడు పలికే సంభాషణలు ఇప్పటికీ అభిమానుల్లో చెరగని ముద్ర వేయగలవంటే మీరు నమ్ముతారా?
మేజర్ చంద్రకాంత్ (Major Chandrakanth) – ఎన్టీఆర్ నటించిన మరొక అద్భుతమైన చిత్రం మేజర్ చంద్రకాంత్ (Major Chandrakanth). ఇందులో ఆయన ఒక మాజీ ఆర్మీ సైనికుడి పాత్రలో కనిపిస్తారు. అలాగే పుణ్యభూమి నా దేశం అంటూ సాగే పాటలో ఛత్రపతి శివాజీ (Shivaji), సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు & కట్ట బ్రహ్మన్న పాత్రలలో నటించి అందరిని మంత్రముగ్ధుల్ని చేశారు.
భారతీయుడు (Bharateeyudu) – సినీ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న చిత్రం. స్వాతంత్య్ర ఉద్యమం ముందు భారత్‌లో నెలకొన్న పరిస్థితులు, స్వాతంత్య్రం లభించిన తర్వాత తలెత్తిన సమస్యలు, పరిస్థితులకు అద్దం పట్టిన సినిమా ఇది. ఇందులో సేనాపతి, ఆయన కుమారుడి పాత్రల్లో కమల్ హాసన్ నటన ఆకట్టకుంటుంది. ముఖ్యంగా కొన్ని ఉద్యమ, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సుభాష్ చంద్రబోస్ (Subash Chandrabose) – ఈ సినిమాల తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన సుభాష్ చంద్రబోస్ చిత్రం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎంతో కీలకమని మనందరికీ తెలుసు. అటువంటి దేశనాయకుని పాత్ర నుంచి స్ఫూర్తి పొంది రాసిన కథే ఈ సినిమా. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా; శ్రియా శరణ్, జెనీలియా కథానాయికలుగా మెరిశారు.
ఖడ్గం (Khadgam) – ఇప్పటివరకు దేశ నాయకుల కథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాల గురించి మాట్లాడుకున్నాం. అయితే వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతూనే మనలోని దేశభక్తిని సైతం తట్టి లేపే ప్రయత్నాలు చేశాయి చాలా తెలుగు చిత్రాలు. ఇలాంటి సినిమాల గురించి చర్చించడం మొదలుపెడితే ఆ జాబితాలో మొట్టమొదటిగా వినిపించే చిత్రమే ఖడ్గం (Khadgam). దర్శకుడు కృష్ణవంశీ (Krishnavamsi) ఈ సినిమా ద్వారా ఓవైపు మన దేశంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తూనే భారతీయులు ప్రతిఒక్కరిలోనూ గుండెల నిండా దేశభక్తి నిండి ఉంటుందని చూపారు.
రాజన్న (Rajanna) – స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచే చిత్రాల్లో ఈ తరానికి బాగా చేరువైన చిత్రం అంటే రాజన్న అని చెప్పచ్చు. అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ ఆనీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో స్వాతంత్ర్యం రాక ముందు తెలంగాణలో ఉన్న దొరల పాలన, అప్పటి పరిస్థితులను స్పష్టంగా కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఇవే కాకుండా.. తెలుగులో మహాత్మ, మనోహరం, హిందుస్థాన్ ది మదర్, ఈశ్వర్ అల్లా, గగనం మొదలైన చిత్రాలు దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో రూపొందించినవే. శ్రీహరి నటించిన “హనుమంతు” చిత్రానికి కూడా ప్రేరణ స్వాతంత్ర్య సమరయోధుడైన కన్నెగంటి హనుమంతు కథే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మరో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్నారు.
ఇవేకాదు.. తమిళంలో విడుదలై తెలుగులో డబ్బింగ్ చేయబడ్డ రోజా, బొంబాయి, ఉరిమి, కాలాపానీ, మద్రాసు పట్టణం చిత్రాలు కూడా మంచి ఆదరణనే పొందాయి… దేశభక్తి చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి! మలయాళంలో మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన బాబా సాహెబ్ అంబేద్కర్ జీవిత కథ కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు పొందింది.
బాలీవుడ్ దేశభక్తి చిత్రాలు – Best Bollywood Patriotic Movies
మణికర్ణిక (Manikarnika) – కంగనా రనౌత్ ఈ చిత్రంలో రాణీ లక్ష్మీబాయి పాత్రలో నటించారు. స్వాతంత్ర్య సమర యోధురాలు లక్ష్మీబాయి బాల్యం, వివాహం.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు.. తన భర్త చనిపోయాక.. బ్రిటీష్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ.. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న వైనం.. మొదలైన వివరాలన్నీ ఈ బయోపిక్‌లో మనకు దర్శనమిస్తాయి.
బోర్డర్ (Border) – కార్గిల్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా.. మన దేశం కోసం సైనికులు ఎంతగా కష్టపడతారన్న విషయాన్ని కూలంకషంగా చర్చిస్తుంది. ఉన్న ఊరిని, భార్య బిడ్డలను వదలి.. సరిహద్దులో శత్రుసేనల నుండి మన దేశాన్ని కాపాడడానికి.. అహర్నిశలు కష్టపడే సైనికుల మనోభావాలకు అద్దం పట్టే సినిమా ఇది.
రంగ్ దే బసంతీ (Rang De Basanti) – భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల జీవితకథను డాక్యుమెంటరీ తీయడానికి సంకల్పించిన కొందరు యువకులు.. ఆ తర్వాత తమ జీవితాలను కూడా పణంగా పెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాలోని కొన్ని భాగాల్లో భగత్ సింగ్ పాత్రలో సిద్ధార్థ, చంద్రశేఖర్ ఆజాద్ పాత్రలో అమీర్ ఖాన్ కనిపిస్తారు.
మంగళ్ పాండే (Mangal Pandey) – బ్రిటీష్ వారిపై తొలిసారిగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు.. ఆ విప్లవానికి ప్రధాన కారకుడైన మంగళ్ పాండే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో అమీర్ ఖాన్ నటించడం విశేషం.
ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (The Legend of Bhagat Singh) – అజయ్ దేవగన్ ఈ చిత్రంలో భగత్ సింగ్ పాత్రను పోషించడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు భగత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఆర్థికంగా నిర్మాతలకు అంత లాభం చేకూర్చకపోయినా.. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో మాత్రం పాల్గొంది. అజయ్ దేవగన్‌కు జాతీయ అవార్డు కూడా అందించింది.
లగాన్ (Lagaan) – శిస్తు రద్దు కోసం బ్రిటీష్ అధికారులతో.. సామాన్య జనం ఆడే క్రికెట్ ఆట నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం.. మన దేశం నుండి ఆస్కార్ అవార్డులకు అధికారిక ఎంట్రీగా కూడా ఎంపికైంది.
చక్ దే ఇండియా (Chak De India) – భారత మహిళల హాకీ జట్టులో ప్రేరణ నింపడమే కాకుండా.. వారిని ప్రపంచ కప్ విజేతగా నిలపడానికి అహర్నిశలు కష్టపడిన ఓ కోచ్ కథ ఈ చిత్రం. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కోచ్ పాత్రలో నటించారు.
ఉరి (Uri) – 2016లో కాశ్మీర్‌లో భారత సైన్యంపై ముష్కరులు దాడి చేశాక.. మన సైన్యం వారిని ఏ విధంగా ఎదుర్కొంది.. తర్వాత మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా పగ తీర్చుకుంది.. అనే అంశాలను ప్రస్తావించిన చిత్రమిది.
ఎల్ఓసీ కార్గిల్ (LOC Kargil) – కార్గిల్ యుద్ధం జరగడానికి కారణాలు, తర్వాత ఎదురైన పర్యవసానాలు.. శత్రుసైన్యాన్ని తుదముట్టించేందుకు భారత సైనికులు చేసిన దాడులు.. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న అనుభవాాలు అన్నీ ఈ చిత్రంలో పూర్తిగా చర్చించడం జరిగింది.
చిట్టగాంగ్ (Chittagong) – సూర్య సేన్ అనే టీచర్ సహాయంతో.. విద్యార్థులు ఏ విధంగా ప్రేరణ చెంది స్వాతంత్ర్య సమరయోధులుగా మారతారో.. ఆ తర్వాత చిట్టగాంగ్ ప్రాంతంలో బ్రిటీష్ సేనలకు వ్యతిరేకంగా వారు ఎలా పోరాడారన్నదే ఈ చిత్రకథ.
వీటిలో కొన్నైనా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయంటే ఇప్పటికీ స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక ఛానెల్లో అవి తప్పకుండా ప్రసారమయ్యేంతగా!
ఏది ఏమైనా ఇలాంటి చక్కని కథాంశాలతో నిర్మించే చిత్రాలు మన తర్వాతి తరాల వారికి స్వాతంత్య్ర స్ఫూర్తిని అందించడం మాత్రమే కాదు.. సగటు భారతీయులుగా మన బాధ్యత ఏంటో కూడా గుర్తు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, మీరేమంటారు??
ఇవి కూడా చదవండి
ఈ ట్రైకలర్ కేక్ లతో.. గణతంత్ర స్ఫూర్తిని ఘనంగా చాటండి..!
ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశభక్తిని మరింత పెంచుతాయి..!
రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?