Advertisement

Celebrations

అక్షింతలకు బదులుగా.. కరెన్సీ నోట్లను వాడారు: హైదరాబాద్ పెళ్లి వేడుకలో విడ్డూరం..!

Sandeep ThatlaSandeep Thatla  |  Mar 20, 2019
అక్షింతలకు బదులుగా.. కరెన్సీ నోట్లను వాడారు: హైదరాబాద్ పెళ్లి వేడుకలో విడ్డూరం..!

మన దైనందిన జీవితంలో రోజు ఏదో ఒక వింతను చూస్తేనే ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకల్లో జరిగే కొత్త (వింత) సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్ని సమయాల్లో అవి వార్తలుగా కూడా వైరల్ కావడం గమనార్హం.

తాజాగా హైదరాబాద్ (Hyderabad) ప్రాంతంలో ఇలాంటి సంఘటనే జరిగింది.  ఆదివారం అనగా 17 మార్చి తేదిన జరిగిన ఒక పెళ్లి వేడుక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే – మాంగల్యధారణ తంతు ముగిశాక నూతన వధూవరులను బంధుమిత్రులంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే తంతే.

అయితే ఈ పెళ్లి వేడుకలో మాత్రం.. ఒక పెద్ద మనిషి నవ దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం రొటీన్ అని అనుకున్నాడు. అందుకే వచ్చేటప్పుడు తన వెంటే.. ఒక రెండు గంపల నిండా డబ్బుని తీసుకొచ్చాడు. వాటినే అక్షింతల రూపంలో  ఆ కొత్త జంట పై కురిపించాడు. ఊహించని ఈ పరిణామంతో నూతన దంపతులతో సహా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.

ఆయన కొత్త దంపతులపై గుమ్మరించిన నోట్లు కింద పడగానే.. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వెంటనే వాటిని తీసి కవర్లలో జాగ్రత్త చేస్తుండడం కొసమెరుపు. అంతేలెండి.. ఎంత డబ్బుని కురిపించినా.. అది వేస్ట్ అవ్వకూడదు కదా.

ఇక ఈ విషయం బయటకి ఎలా వచ్చిందంటే – సదరు వ్యక్తి నోట్లను గుమ్మరిస్తున్న సమయంలో ఆ పెళ్ళికి హాజరయిన వారెవరో తమ సెల్ ఫోన్‌లో ఈ మొత్తం తంతంగాన్ని బంధించారు. అలా రికార్డు చేసిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉండగా ఈ వార్తని జాతీయ మీడియా కూడా ప్రధాన వార్తగా.. పరిగణించి ప్రసారం చేస్తుండడం విశేషం.

అయినా ఈమధ్య పెళ్లి (Marriage) అంటేనే ఒక భారీ స్థాయి ఈవెంట్ అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఒకప్పుడు పెళ్లి అంటే ఎలా ఉండేదో ఏమో కాని .. ప్రస్తుతం పెళ్లి అంటే మాత్రం హంగు, ఆర్భాటాలు తప్పకుండా దర్శనమిస్తున్నాయి. ఇలా జరిగే వివాహా వేడుకల్లో పలు వింతలు కూడా జరగుతున్నాయి.

మొన్నటికి మొన్న జరిగిన ఒక పెళ్లి విందులో, వియ్యంకులకు ఇష్టమైన వంటకాన్ని.. వధువు తల్లిదండ్రులు చేయించలేదు. దాంతో పెద్ద గొడవే జరిగి..  ఇరుపక్షాల వారు ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇంకొక పెళ్లి వేడుకలో, పెళ్ళికి వచ్చిన బంధువు.. నూతన దంపతులని ఆశీర్వదించే సమయంలో తికమకపడ్డారు. ఆ తికమకలోనే.. ఫోటో‌కి ఫోజ్ ఇచ్చే ధ్యాసలో  జంట పై అక్షింతలకి బదులుగా.. పొరపాటుగా పాలు పోశాడు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలా చెప్పుకుంటే పోతే ఈరోజుల్లో పెళ్లిళ్లు “ఎన్నో వింతలకి” కేర్ అఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు పెళ్లి ముహూర్తానికి అవుతుందా లేదా అనేది చూసే వారు. ఇప్పుడు ఏ ఫంక్షన్ హాల్‌లో చేస్తున్నారు? ఎన్ని రకాల వంటకాలని చేయిస్తున్నారు? ఎన్ని లక్షలు వెచ్చించి డెకరేషన్ చేయిస్తున్నారు? వంటి విషయాలకు ప్రాధాన్యం పెరిగిపోవడం గమనార్హం. చెప్పాలంటే.. ప్రస్తుతం మన సమాజంలో ఒక ఖరీదైన వేడుకగా “పెళ్లి” మారిపోయింది అని చెప్పాలి.

Featured Image: Pixabay

ఇవి కూడా చదవండి

ఏమయ్యా వార్నర్.. మా తెలుగు వారి దోశ రుచి చూస్తావేంటి?

“ఇది అన్నాద‌మ్ముల అనుబంధం..” అంటూ పాట‌లు పాడుతోన్న ట్విట్ట‌ర్.. ఎందుకో తెలుసా?

భాగ్యనగరంలో బీజింగ్ కళ చూస్తారా.. అయితే ఈ చైనీస్ రెసార్టెంట్లకు వెళ్లాల్సిందే..!