ఆలుమగలిద్దరూ కలిసి సంతోషంగా గడపాలని ఆశపడని జంట ఉంటుందా చెప్పండి? ప‌్రతిఒక్కరూ తమ జీవిత భాగస్వామితో ప్రతి క్షణాన్ని ఎంతో మధురంగా గడపాలని భావిస్తారు. అయితే ఈ విషయంలో కొన్ని జంటలు సఫలత సాధిస్తే; ఇంకొన్ని జంటలు మాత్రం విఫలమవుతూ ఉంటాయి. అందుకు చాలా కారణాలు కూడా ఉంటాయి. సంతోషం అంటే ఇద్దరూ కలిసి కేవలం పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవడంలోనే అది లభ్యమవుతుందని భావించడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు.
కానీ ఏ ఆలుమగలైనా తమ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి చిన్న క్షణాలను ఆస్వాదించడం తెలుసుకుంటే.. నిత్యం వారి బంధం సంతోషమయంగానే సాగుతుంది. కొరియాకు చెందిన హ్యోచియాన్ జియాంగ్ (hyocheon jeong) అనే ఆర్టిస్ట్ కూడా ఆయన గీసిన కొన్ని చిత్రాల ద్వారా ఇదే విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె గీసిన ఆ అద్భుతమైన చిత్రాల్లో కొన్ని మాకు గ్రాఫోలియోలో కనిపించాయి. అవి మీ కోసం..
1. మీ భాగస్వామితో కలిసి రోజుని సంతోషంగా ప్రారంభించండి.
ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేసే సమయంలోనో లేక బయటకు వెళ్లి వాకింగ్ చేసే సమయంలోనో మీ భాగస్వామితో సరదాగా మాట్లాడండి. లేదా వారికి నచ్చిన అల్పాహారం తయారు చేసి మీరే స్వయంగా తినిపించండి. ఇంకాస్త రొమాంటిక్ గా రోజుని గడపాలనే ఆలోచన ఉంటే వారు బ్రేక్ ఫాస్ట్ తినే సమయంలో మీరు వారికి ఇబ్బంది కలిగించకుండా ఒళ్లో కూర్చొని మీరు కూడా అల్పాహారం తినేందుకు ప్రయత్నించి చూడండి.
2. భాగస్వామితో కలిసి సరదాగా డ్యాన్స్ చేయండి.
ఇద్దరూ కలిసి సంతోషంగా సమయం గడపాలంటే అందుకు బయటకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని మీ ఆలుమగలిద్దరూ సరదాగా డ్యాన్స్ చేసి చూడండి. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా?? మరి, మాకు డ్యాన్స్ రాదుగా.. అంటూ ఏవేవో ఆలోచించకండి. మీరేమీ పోటీల్లో పాల్గొనట్లేదు. ఇద్దరూ ఒకరితో మరొకరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు నచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తే చాలు.. ఇది మీ ఇద్దరినీ మరింత దగ్గర చేయడమే కాదు.. రోజువారీ పనుల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని మాయం చేసి, మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది కూడా!
3. ఆయన ఒళ్లో హాయిగా నిద్రించండి..
ఆలుమగలిద్దరూ సంతోషాలను పోగుచేసుకునేందుకు ఉదయం మాత్రమే కాదు.. రాత్రి కూడా అనువైన సమయమే! ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే ఇద్దరూ కలిసి గడిపేందుకు అంతగా సమయం చిక్కకపోవచ్చు. కానీ రాత్రివేళ అలా కాదు.. పనులన్నీ ముగించుకున్న తర్వాత మీరిద్దరూ కలిసి సమయం ఎలా గడపాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుదామనుకునే వారు.. మీవారి ఒళ్లో తల వాల్చి తీయతీయగా కబుర్లు చెప్తూ ఉండండి. అయితే ఈ సమయంలో మీరు మాట్లాడే విషయాలు మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తెచ్చేవిగా ఉండకుండా జాగ్రత్తపడే బాధ్యత మీదే సుమా!
4. ఇద్దరూ కలిసి స్నానం చేయండి..
సంతోషంగా గడపడం అంటే కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఉండాల్సిందే మరి! అందుకే ఇద్దరూ కలిసి సరదాగా స్నానం చేసి చూడండి. ఒకవేళ ఇది మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేయడం, బయటకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడడం వంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
5. ఒకరి పట్ల మరొకరు కేరింగ్‌గా ఉండండి..
ఆలుమగలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం ఎంత ముఖ్యమో.. ఆ ఇష్టాన్ని వారిపై సరైన కేర్ తీసుకోవడం ద్వారా వారికి అర్థమయ్యేలా చేయడం కూడా అంతే ముఖ్యం. ఇలా పరస్పరం కేర్ తీసుకోవడంలో కూడా మీకు కావాల్సిన బోలెడంత సంతోషాన్ని మీరు మూటకట్టుకోవచ్చు.
6. వర్షంలో ఒక ముద్దు పెట్టుకుని చూడండి..
చల్లగా చినుకులు పడుతూ ఉంటే ఆ సమయంలో వర్షంలో తడిచే అవకాశం ఎంతోమంది ఆలుమగలకు ఉంటుంది. కానీ ఇప్పుడెందుకు వర్షంలో తడవడం.. జ్వరం, జలుబు.. వంటివి వస్తాయి. మళ్లీ ఇబ్బంది పడాలి.. అనుకుంటూ చాలామంది ఈ సందర్భాన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఊహించండి. చిటపట చిటపట చినుకులు పడుతూ ఉంటే.. ఆ వర్షంలో మీ ఆలుమగలిద్దరూ సరదాగా కలిసి నడుస్తూ ఒక వెచ్చని ముద్దు పెట్టుకుంటే?? భలే ఉంటుంది కదూ!
7. పడుకునే సమయంలో ముద్దుముద్దుగా..
ఆలుమగలిద్దరూ కలిసి సంతోషంగా గడిపేందుకు గల మార్గాల్లో సెక్స్ కూడా ఒకటి. అయితే సెక్స్‌లో పాల్గొనేటప్పుడు మాత్రమే కాదు.. ఆ తర్వాత కూడా మీ భాగస్వామిని ముద్దు చేస్తూ మీ ప్రేమను వారిపై కురిపించి చూడండి. ఇలా చేస్తే వారు మీకు ఫిదా అయిపోవడం మాత్రమే కాదు.. మిమ్మల్ని కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించేందుకు ప్రయత్నిస్తారు. ఏమంటారు??
ఈ చిత్రాలు చాలా సింపుల్‌గా ఉన్నా.. ఆలుమగలిద్దరూ కలిసి చిన్న చిన్న సంతోషాలను ఎలా పొందాలో చాలా స్పష్టంగా మనకు చెబుతున్నాయి కదూ! మరింకేం.. మీరు కూడా వీటిని ఫాలో అయ్యేందుకు సిద్ధమైపోండి. మీ భాగస్వామితో కలిసి సంతోషంగా సమయం గడుపుతూ బోలెడన్ని మధురానుభూతులను మీ ఖాతాలో జమ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
పాఠశాల నుంచి పరిణయం వరకు.. సాగిన ఈ ప్రేమకథ అద్భుతం..!
చూపులతోనే మాటలు.. పుస్తకాల్లో ప్రేమలేఖలు.. ఆనాటి ప్రేమ అద్భుతం..
#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!