డియర్ ఎక్స్ (Ex boyfriend),
ఎలా ఉన్నావ్? నిన్ను చూసి చాలా రోజులైంది. నీ జీవితంలో అంతా బాగానే జరుగుతుందనుకుంటున్నా. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. నువ్వు చేసిన మోసం(cheating) గురించి.. నేను కనీసం జీర్ణించుకోవడానికి కూడా ఇష్టపడని నిజం గురించి మాట్లాడాలనుకుంటున్నా. నువ్వు మన బంధాన్ని ఎలా నాశనం చేశావో.. నా మనసును ఎంతగా గాయపర్చావో దాని గురించి నీకు చెప్పాలనుకుంటున్నా.
ఒకరు మనల్ని మోసం చేస్తే దాన్ని తట్టుకోవడం అంత సులువేం కాదు. చాలా బాధనిపిస్తుంది. నేను నీతో ఉన్నప్పుడు నువ్వెప్పుడూ నన్ను మోసం చేయవని.. కనీసం నాతో అబద్ధాలు కూడా చెప్పవని భావించేదాన్ని. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నమ్మాను. కానీ నువ్వు దానికి అర్హుడవు కాదని ఆ తర్వాతే అర్థమైంది. ఒక బంధం జీవితాంతం కొనసాగాలంటే ప్రేమ కంటే ఎక్కువగా ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్నే నువ్వు పోగొట్టుకున్నావు. అలా మన బంధం ఫెయిలయ్యేలా చేశావు.
నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నేను మొదటిసారి తెలుసుకున్న రోజు నాకింకా గుర్తుంది. నా కాళ్ల కింద భూమి కదిలి భూకంపం వచ్చినట్లు అనిపించింది. నా జీవితం అక్కడితో ఆగిపోయినట్లుగా అనిపించింది. నువ్వెందుకు ఇలా చేశావు? అన్న ప్రశ్న నన్ను చాలాకాలంపాటు వెంటాడింది. నేను మరీ అంత చెడ్డదాన్నా? అంత అందవిహీనంగా ఉంటానా? ఎందుకు తను నన్ను వదిలి వేరే వ్యక్తిని ఎంచుకున్నాడు? అసలు తను నన్ను ప్రేమించాడా? లేదా కొంతకాలం టైమ్‌పాస్ చేశాడా? నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? అని ఎన్నో ప్రశ్నలు నాకు నేనే వేసుకుంటూ బాధపడేదాన్ని. కానీ ఈ ప్రశ్నల్లో దేనికీ నాకు సమాధానం దొరికేది కాదు. నేను ధైర్యంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నించేదాన్ని. కానీ రాత్రయ్యే సరికి నాకు నువ్వు చేసిన మోసం గుర్తొచ్చి ఏడుస్తూ పడుకునేదాన్ని. నా జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్ను ద్వేషిస్తూ నీలాంటి వ్యక్తిని ప్రేమించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకునేదాన్ని. నా జీవితం ఇక్కడికే ముగిసిపోయింది. ఇక నేను బతికి కూడా వ్యర్థమే అనుకుంటూ బాధపడేదాన్ని.
సమయం గాయాలను మాన్పుతుందని పెద్దలు చెబుతారు. అది నిజంగా నిజమేనేమో.. కొంతకాలం తర్వాత నిన్ను మర్చిపోగలిగా. అయితే నీ మోసం నన్ను జీవితాన్ని మరో కొత్త కోణం నుంచి చూసేలా చేసింది. మనుషులను, బంధాలను కొత్తగా చూడడం ప్రారంభించా. ఇంతకుముందు నాకు సమాధానం దొరకని ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలిసిపోయాయి. ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే.. నువ్వు మోసం చేయడానికి కారణం నేను కాదు నువ్వు. నాలో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ ప్రతి మనిషిలోనూ లోపాలుంటాయి.
తప్పు చేసింది నేను కాదు. నువ్వు. నా ప్రేమను కాదని నువ్వే మరో వ్యక్తిని ఎంచుకున్నావు. ఇది నన్నెంతగానో బాధపెట్టింది. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఎవరి ఇష్టాలు వారివి. ఒకరు మనల్ని ఇష్టపడకపోతే అది మన తప్పు కాదు అని నేను తెలుసుకున్నా. నువ్వు నన్ను కాదని ఇంకొకరిని ఎంచుకున్నావంటే అందులో నా లోపమేదో ఉందని నేననుకోవడం సరికాదని నాకు అర్థమైంది. ఆ తర్వాతే మనిద్దరం గడిపిన సమయం వృథా కాదని.. దానివల్ల జీవితానికి సరిపడే గుణపాఠాలు నేర్చుకున్నానని అర్థమైంది.
ఈ రోజు ఇన్నాళ్ల తర్వాత నువ్వు చేసిన దానికి నీపై నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. కానీ నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరినీ కించపర్చకు.. ముఖ్యంగా నిన్ను ప్రేమించినవాళ్లని మోసం చేయకు. తను ప్రేమించిన వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మనిషి మనిషే కాదు. నీకు థ్యాంక్స్ కూడా చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసిన తర్వాత నేను జీవితంలో ధైర్యంగా తయారయ్యా. నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. నువ్వు నన్ను మోసం చేసి ఉండకపోతే ఆ కష్టకాలం నాకు ఎదురయ్యేది కాదు. దాని ద్వారా ఇలా నాకు జీవితాంతం గుర్తుండే పాఠాలు నేర్చుకొని, ఇంత ఆత్మవిశ్వాసంతో నిలబడే అవకాశం ఉండేది కాదు.
నీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ..
ఒకప్పుడు నువ్వు మోసం చేసిన అమ్మాయి.
ఇవి కూడా చదవండి
ఇష్టంలేని లవ్ ప్రపోజల్‌కి.. ఇలా తెలివిగా నో చెప్పండి..!
బ్రేకప్ అయినా వాలెంటైన్స్ డే.. ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు..!