సాధారణంగా పెళ్ళి అంటేనే ఎక్కువమంది దృష్టి నగలు, దుస్తుల పైకి మల్లుతుంది . అలాంటిది ఇక ఏకంగా అది ఒక సెలబ్రిటీ వివాహం అయితే వేరే చెప్పాల్సిన పనేముంది ..
బాలీవుడ్ లో ఒకరకంగా ఇది పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పొచ్చు. పదిహేను రోజుల వ్యవధిలోనే హిందీ చిత్రపరిశ్రమకి చెందిన దీపిక పదుకొనే & ప్రియాంక చోప్రా వివాహాలు చేసుకోవడం ఒక ఆసక్తికరమైన పరిణామం. దీపిక తన సహచర నటుడు, హీరో రన్వీర్ సింగ్ ని వివాహం చేసుకోగా.. అమెరికాకి చెందిన ప్రముఖ సింగర్ అయిన నిక్ జోనాస్ అనే వ్యక్తిని ప్రియాంక పరిణయం చేసుకుంది .
ప్రియాంక వివాహం జోధ్ పూర్ ప్రాంతంలో రంగరంగ వైభవంగా జరగగా.. అందుకు తాజ్ ఉమైద్ ప్యాలెస్ వేదిక కావడం గమనార్హం. హిందూ -క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం నవంబర్ 1 & 2 తేదీల్లో వీరి వివాహం జరిగింది. అయితే క్రిస్టియన్ వివాహం సందర్బంగా పీసీ ధరించిన గౌను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది .
ఎందుకంటే ఈ గౌను సుమారు 75 అడుగుల పొడవు ఉండడంతో పాటు, ఆ గౌనులో ఆమె కుటుంబసభ్యుల వివాహ తేదీలు మొదలైన వివరాలతో కూడిన 8 అంశాలని కూడా పొందుపరచడం జరిగింది. ఇక ఈ గౌనుని సిద్ధం చేయడానికి దాదాపు 1826 గంటలు పట్టిందని సమాచారం ! అన్నిటికంటే ఆసక్తి కలిగించే విషయమేమిటంటే , ఈ గౌనుని సిద్ధం చేసింది ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ అయిన రాల్ఫ్ లౌరెన్ .
ఈయన తన 50 ఏళ్ళ కెరీర్ ప్రస్థానంలో కేవలం ముగ్గురికి మాత్రమే పెళ్ళి గౌను డిజైన్ చేయగా ఆ ముగ్గురు కూడా తన కుటుంబసభ్యులే . ఇక ఆయన రూపొందించిన 4వ గౌను ప్రియాంక చోప్రా కోసమే కావడం నిజంగా విశేషమే.
అదే సమయంలో ప్రియాంక చోప్రా హిందూ సంప్రదాయ వివాహా వేడుకలో ధరించిన రెడ్ కలర్ లెహంగాని ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేయడం జరిగింది. ఇది రూపొందించడానికి సుమారు 3720 గంటలు పట్టినట్టుగా సమాచారం .
ఇక ఈ వివరాలన్నీ తన అభిమానులతో పంచుకుంటూ.. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహం ఒక మధురజ్ఞాపకంగా మిగిలిపోతుందని ఎప్పుడు ఊహించలేదని తెలిపింది పీసీ.
ఇంతలా డిజైన్ చేసిన ఈ దుస్తుల విలువెంత అనేది ఇప్పుడు ఈ వివరాలు అన్ని తెలిసాక అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న … ఏం కాదంటారా !!
Image Credits: People Magazine