ADVERTISEMENT
home / వినోదం
Sye Raa Narasimha Reddy Movie Review :  ‘సైరా’ చిత్రంలో..  ‘సై.. సైరా’ అనిపించే 9 అంశాలివే

Sye Raa Narasimha Reddy Movie Review : ‘సైరా’ చిత్రంలో.. ‘సై.. సైరా’ అనిపించే 9 అంశాలివే

(Megastar Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy Movie Review)

మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో నటించాలని పరితపిస్తున్న చిత్రం… అలాగే తన తండ్రికి రామ్ చరణ్ తనకింత బంగారు జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా అందిస్తున్న చిత్రం… దర్శకుడిగా సురేందర్ రెడ్డి తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్న చిత్రం.. నటీనటులు, సాంకేతిక వర్గం తమ పనితీరుని ప్రజలకి చూపెట్టాలని కోరుకున్న చిత్రం…. ఆఖరిగా మెగా అభిమానులు తమ ఆరాధ్య నటుడు చిరంజీవిని.. ‘మెగాస్టార్’ అని ఇన్నేళ్లయినా ఎందుకు పిలుచుకుంటున్నారో మనకు తెలియచేసే చిత్రం.. ఈ ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొద్ది గంటల క్రితమే విడుదలైంది.

మరి ఈ చిత్రంలో సై .. సైరా అనిపించే అంశాలేంటి? ఆ అంశాలు ఈ చిత్రానికి ఎంతమేర బలాన్ని చేకూర్చాయనేది ఈ క్రింది సమీక్షలో తెలుసుకుందాం…

‘ప్రతి ప్రేమకథ కంచికి చేరదు’ అని తెలిపే.. ‘పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌’ల లవ్ స్టోరీ ..!

ADVERTISEMENT

ముందుగా ‘సైరా నరసింహా రెడ్డి చిత్ర కథ’ ఏంటంటే

1857కి పదేళ్ళ ముందే రేనాడు ప్రాంతంలోని (ఇప్పటి రాయలసీమ)..  61 మంది పాలెగాళ్ళు బ్రిటిష్ పాలకుల కనుసన్నలలో పాలించేవారు. ఈ క్రమంలో తన చిన్నతనం నుండే బ్రిటిష్ వారి అకృత్యాలని ఎదుర్కోవాలనే తెగువతో పెరుగుతుంటాడు ఉయ్యాలవాడ బిడ్డ నరసింహారెడ్డి (చిరంజీవి). అతని ఆవేశాన్నీ సరైన మార్గంలో పెట్టేందుకు గురువు గోసాయి వెంకన్న (అమితాబ్ బచ్చన్) దగ్గరికి పంపిస్తారు తన తల్లిదండ్రులు. అదే నరసింహా రెడ్డి పెద్దయ్యాక ఉయ్యాలవాడ పాలెగాడిగా.. బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం..  61 మంది పాలెగాళ్ళ మద్దతు కోరతాడు. అందులో కొందరు తనకి శత్రువులని తెలిసి కూడా.. వారిని తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఈ 61 మంది పాలెగాళ్ళు ఒకటైతేనే.. బ్రిటిష్ వారిని సమర్ధవంతంగా ఎదిరించవచ్చనే భావనతో ముందుకి సాగుతాడు.

మరి తన తోటి పాలెగాళ్ళు చివరి వరకు తనతో ఉన్నారా? బ్రిటిష్ వారిని నరసింహారెడ్డి సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాడా? అనేది వెండితెర మీద చూడాలి.

ఇక ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో మనల్ని ఆకట్టుకునే ‘9 అంశాలు’

ADVERTISEMENT

* కథని ఆరంభించిన తీరు

ఏదైనా మనం ఒక కథ చెబుతున్నామంటే.. దాని ప్రారంభం ఆసక్తికరంగా ఉండాలి. ఆ కథని వినేవాడికి ఉత్సుకత కలగాలి. అలా ఈ ‘సైరా’ చిత్రం ప్రారంభం కూడా.. ఎవ్వరు ఊహించని విధంగా ఓ మహారాణి యుద్ధరంగం నుండి మొదలవుతుంది. ఆ యుద్ధరంగంలోని సైనికులలో ధైర్యాన్ని నింపడానికి ఆమె సైరా నరసింహారెడ్డి కథ చెప్పడంతో ఈ సినిమాని ఆరంభించడం.. అలాగే ఆ మహారాణి పాత్రలో ఒక ప్రముఖ నటిని చూపెట్టడం ద్వారా .. ఈ చిత్రానికి ప్రారంభంలోనే దర్శకుడు ఒక మంచి కిక్ ఇచ్చినట్లయింది. 

* చిరంజీవి

నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో ఒక్క కాస్ట్యూమ్ డ్రామా చిత్రం కూడా లేదు. తన కొడుకు మాత్రం రెండవ చిత్రంతోనే ఆ అవకాశం దక్కించుకున్నాడు. ‘ఇది ఒకరకంగా నాలోని నటుడికి ఈర్ష్యను కలిగించేదే’ అని చిరంజీవి పలుమార్లు చెప్పడం జరిగింది. ఒక నటుడిగా అంత కోరిక, కసితో ఆయన చేసిన పాత్రే ఈ నరసింహా రెడ్డి.

ADVERTISEMENT

ఈ క్రమంలో మనం కూడా చిరంజీవి.. ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని చెప్పడం లాంటివి చేయకుండా.. ఆయన ఆ పాత్రలో ఎలా నటించాడన్న అంశం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ చిత్రంలో నీటి లోపల నటించాల్సిన ఒక కీలక ఘట్టంలో .. అలాగే శివుడి ముందు శ్వాస దిగ్బంధం చేస్తూ కూర్చునే సన్నివేశాల్లో చిరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు. ఆరు పదుల వయసులో.. ఒకరకంగా ఈ అండర్ వాటర్ సన్నివేశాలు చేయడం నిజంగా ఓ సాహసమే. దీన్నిబట్టి ఆయన ఈ చిత్రం కోసం ఎంతమేర కష్టపడ్డాడో తెలుస్తుంది.

అలాగే పోరాట సన్నివేశాల్లో కూడా ఎక్కువశాతం.. ఆయన ఎటువంటి డూప్ లేకుండా నటించడం జరిగింది. ఇక బ్రిటిష్ అధికారులతో ‘సై .. సై’ అంటూ పలికే సంభాషణలు.. అలాగే ఆయా సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తాయి. ఆయన కోరుకున్నట్టుగానే ఈ చిత్రం కచ్చితంగా.. ఆయన కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా ఎప్పటికీ తనకు ఒక తృప్తినిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

* నటీనటులు

ఇంతటి భారీ స్కేల్ ఉన్న చిత్రంలో.. ప్రధాన పాత్రతో పాటుగా సహాయక పాత్రలు కూడా చాలా కీలకం. అలాంటి పాత్రల కోసం దర్శకుడు చాలా చక్కగా నటులని ఎంపిక చేసుకున్నాడు. గోసాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్, అవుకు రాజుగా సుదీప్, పాండిరాజుగా విజయ్ సేతుపతి, వీరరెడ్డిగా జగపతి బాబు, రైతు సుబ్బయ్యగా సాయి చంద్, లక్ష్మీగా తమన్నా, సిద్ధమ్మగా నయనతార.. ఇలా చాలామంది ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించడం విశేషం.

ADVERTISEMENT

* రైతులకి అండగా నిలిచే సన్నివేశం

చిత్రం మొదటి భాగంలో బ్రిటిష్ దొర జాక్సన్ తన అహం, అధికారంతో రైతుల వద్ద నుండి పొలం లాక్కోవడానికి వచ్చిన సమయంలో రైతు సుబ్బయ్య (సాయి చంద్), నరసింహారెడ్డి, జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశం చాలా బాగుంది. ‘ఎందుకు కట్టాలిరా శిస్తు?’ అంటూ చిరంజీవి పలికే డైలాగ్స్‌కి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఉన్న బలమైన సన్నివేశాలలో ఇదొకటి. అలాగే ఇదే జాక్సన్‌ని నరసింహారెడ్డి.. ఇంటర్వెల్‌లో చంపేసే సన్నివేశాన్ని కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించడం జరిగింది.

రామ్‌చరణ్ – ఉపాసనల.. ప్రేమ బంధం వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందామా?

* మాటలు

ADVERTISEMENT

ఆయుధాలు చేయలేని పని ఒక బలమైన మాట చేస్తుందని అంటారు. అలాగే ఈ చిత్రంలో ‘పాట పాడుతూ ఒక్కతే యుద్ధం చేస్తుంది. కాని ఆమె పాడే పాట కొన్ని వందల మందిని ఆ యుద్ధంలోకి వచ్చేలా చేస్తుంది’ వంటి అర్థవంతమైన సంభాషణలు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భోచిత సన్నివేశాలు, మాటలే చిత్రం స్థాయిని మరింత పెంచాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్‌ సన్నివేశాలకు సంబంధించి సాయి మాధవ్ బుఱ్ఱా రాసిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

* నేపధ్య సంగీతం

అమిత్ త్రివేది అందించిన పాటలు ఈ చిత్రానికి అచ్ఛంగా సరిపోయాయి. సైరా టైటిల్ సాంగ్ అయితే ఈ ఆల్బమ్ మొత్తంలోనే హైలైట్ అని చెప్పాలి. ఇక స్వాతంత్య్రం పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో.. ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. అటువంటి సన్నివేశాలు మనల్ని హత్తుకోవాలంటే.. అందుకు తగిన నేపధ్య సంగీతం ఉండాల్సిందే. ఈ సినిమాకి జూలియస్ అందించిన నేపధ్య సంగీతం ఎంతో బలాన్నిచ్చింది. ఎందుకంటే ఈ చిత్రంలో వచ్చే నేపధ్య సంగీతం.. సినిమాకి నిజంగానే పెద్ద హైలెట్‌గా నిలిచింది. 

* ఛాయాగ్రహణం

ADVERTISEMENT

రత్నవేలు తన ఛాయాగ్రహణంతో.. ఈ చిత్రాన్ని మనకి ఎంతో అందంగా కనిపించేందుకు గాను తన శక్తినంతా ఉపయోగించారు. ప్రధానంగా ఈ సినిమాలో మనకి కనిపించే రంగులు చాలా బాగున్నాయి. నటీనటుల దుస్తుల దగ్గర నుండి.. సినిమాలో కనిపించే ప్రతి వస్తువు రంగు కూడా కంటికి ఎంతో ఇంపుగా కనిపించడం విశేషం.  అది రత్నవేలు ప్రతిభేనని చెప్పాల్సిందే. ఇక పోరాట సన్నివేశాలను సాధ్యమైనంత వరకు.. సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఛాయాగ్రహణం వల్లే సాధ్యమైంది.

* దర్శకత్వం

ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్‌ రెడ్డి గురించి కూడా మనం తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఆయన ఇప్పటివరకు తీసిన చిత్రాలకి .. ఈ చిత్రానికి అసలు ఏమాత్రం పోలిక ఉండదు. అయితే ఆయన ఈ కథలో ఉన్న భావోద్వేగాల్ని అర్ధం చేసుకుని.. నరసింహారెడ్డి కథలో ఒక మంచి కమర్షియల్ యాంగిల్‌ని చూడగలిగారు. దానినే వెండితెర పై చూపెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో సాగే చిత్రాల్లో కథనం అనేది చాలా కీలకం.

అటువంటి కీలకమైన కథనంలో తన మార్క్‌ని చూపెడుతూ కూడా.. కథలో ఏమాత్రం కూడా లోపం లేకుండా చాలా చక్కగా కథనాన్ని రాసుకున్నాడు. ముఖ్యంగా కథని ప్రారంభించిన తీరు అయితే.. ఆయనలోని ప్రతిభని తెలియచేస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో నరసింహారెడ్డి పాత్రతో చేయించిన ఒక ఫీట్ చాలా బాగుంది. ఆ సన్నివేశానికి తగిన లీడ్‌ని మనకి సినిమా ప్రారంభంలోనే చూపెట్టడం జరుగుతుంది. ఒక కమర్షియల్ దర్శకుడు.. ఇటువంటి ఒక చిత్రాన్ని తీయగలడా? అనే మాటని ఆయన ఈ చిత్రం ద్వారా చెరిపేశారనే చెప్పాలి. ఈ చిత్ర విజయంలో ఈయన పాత్ర తప్పక ఉంది.

ADVERTISEMENT

* నిర్మాణం

‘నా నలభై ఏళ్ళ సినీ కెరీర్‌లో నేను సాధించింది ఏంటంటే… అది రామ్ చరణ్’ అని చిరంజీవి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అది అక్షరాలా సత్యం. తన తండ్రి కోసం ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా.. అది కచ్చితంగా ఘన విజయం సాధించాలని కోరుకున్న రామ్ చరణ్.. అందుకోసం  తీసుకున్న జాగ్రత్తలు ఈ చిత్రాన్ని చూస్తుంటే మనకి స్పష్టంగా కనిపిస్తాయి.

నటీనటులు, సాంకేతిక వర్గం, ప్రొడక్షన్ డిజైన్.. ఇలా అన్ని విభాగాల్లో కూడా ఈ చిత్రానికి కావాల్సినవన్నీ అందించారు. ఎక్కడా రాజీ పడకుండా.. ప్రాజెక్టుని ఆయన నడిపించిన తీరు చూస్తే.. శభాష్ అనిపించక మానదు. ఈ సైరా నరసింహా రెడ్డి చిత్రం ఈరోజు ఇంత భారీవిజయం సాధించిందంటే.. అందులో రామ్ చరణ్‌ది కూడా భారీ పాత్ర ఉందనేది ఎవరూ కాదనలేని నిజం.

ఇవి ఈ సైరా నరసింహా రెడ్డి చిత్రంలో సై.. సైరా అనిపించే 9 అంశాలు. ఆఖరుగా సైరా నరసింహా రెడ్డి చిత్రం.. ఒక గొప్ప చిత్రంగా మిగిలినా మిగలకపోయినా… ఒక మంచి చిత్రంగా.. సంతృప్తినిచ్చేదిగా మెగాస్టార్ చిరంజీవికి.. అలాగే ఆయన అభిమానులకి గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ADVERTISEMENT

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ మేనియాకి ప్రతిరూపమే.. ‘సైరా తాలి’ @ హోటల్ రాజుగారి తోట

02 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT