స్కూల్లో (School) ఉన్నప్పుడు “అబ్బా.. రోజూ స్కూల్‌కి వెళ్లాలా? నాకెందుకో ఇన్ని ఇబ్బందులు?” అని మనమంతా అనుకున్నాం. ముఖ్యంగా పరీక్షల సమయంలో స్కూల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ స్కూల్ డేస్ (School days) అయిపోయిన తర్వాత మళ్లీ అలా స్కూల్‌కి వెళ్తే ఎంత బాగుండు అని అనుకోని వాళ్లు ఎవరైనా ఉంటారా? ఇలా పెద్దవాళ్లయిపోయిన తర్వాత.. స్కూల్ గురించి మిస్సయ్యే విషయాలు ఎన్నో.. అందులో ముఖ్యమైన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..
1. ఉదయాన్నే లేవడం..
స్కూల్‌కి వెళ్లాలి కాబట్టి ఉదయాన్నే లేవాలి. పొద్దున్నే గంటకొట్టే ఆ అలారం అంటే మనకు అస్సలు నచ్చేది కాదు కదా.. అయితే ఇలా ఉదయాన్నే లేవడానికి ఇబ్బందిపడడంలోనే మనకు నిద్ర అంటే ఎంత ఇష్టమో అర్థమయ్యేది.పెద్దయ్యాక ఆఫీస్, పని, ఇతర టెన్షన్లలో నిద్రలేకుండా ఉన్నప్పుడు.. “స్కూల్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా నిద్రపోయేవాళ్లమో కదా” అనిపించకమానదు.
2. స్కూల్‌కి రడీ అవ్వడం
స్కూల్ యూనిఫాం అందరికీ ఒకలాగే ఉంటుంది. కానీ అందరిలోనూ మనం ప్రత్యేకంగా కనిపించాలని ఆ యూనిఫాంనే స్టైలిష్‌గా వేసుకోవడానికి మనమంతా ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటాం. స్కర్ట్ సైజ్ చిన్నగా ఉన్నవి ఎంచుకోవడం, నెక్ డిఫరెంట్‌గా ఉండేలా కుట్టించుకోవడం.. వంటివి చేస్తూ ప్రత్యేకంగా కనిపించేలా చూసుకునేవాళ్లం. ఇక స్కూల్లో ఎవరైనా ప్రత్యేక వ్యక్తులను కలవాల్సి వస్తే మరింత ప్రత్యేకంగా సిద్ధమయ్యేవాళ్లం. మేకప్ లేకుండా అందంగా కనిపించాలంటే అప్పటి రోజులను గుర్తుచేసుకోవడం తప్పనిసరి..
3. అందమైన అబ్బాయిలు
స్కూల్లో అందరూ కాకపోయినా.. కొందరు అబ్బాయిలపై మనకు ఎంతో ఇష్టం ఉండేది. అది ఫ్రెండ్షిప్ కంటే కాస్త ఎక్కువే. వారు మనకు పరిచయం లేనివారైతే స్కూల్ అసెంబ్లీలో.. కారిడార్‌లో ఎవరూ చూడకుండా వారిని చూస్తూ మనలో మనమే మురిసిపోయేవాళ్లం. అయితే వారితో స్నేహం చేయడానికి కానీ.. ఇష్టపడుతున్నామని చెప్పడానికి కానీ మనలో చాలామంది ధైర్యం చేసి ఉండరు. అయినా సరే.. ఫస్ట్ క్రష్ మనకు ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది.
4. సివిల్ డ్రస్
స్కూల్లో ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు లేదా మన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ డ్రస్ కాకుండా.. మనకు నచ్చిన డ్రస్ వేసుకోవడానికి అనుమతి దొరికేది. ఆ రోజుల్లోనే మనలోని ఫ్యాషనిస్టా బయటకొచ్చేది.. అందంగా తయారవ్వడానికి ఆ రోజు ఎన్ని రకాలుగా ప్రయత్నించేవాళ్లమో.. మంచి మంచి దుస్తులను ఆ రోజు కోసం దాచి ఉంచుకునేవాళ్లం కూడా. ఇప్పుడు రోజూ మంచి దుస్తులు వేసుకోవడానికి వీలున్నా.. ఆ స్కూల్ రోజుల్లో ఉన్న ఫీలింగ్ ఇప్పుడు రాదు.
5. పుట్టినరోజు ప్రత్యేకత
స్కూల్లో ఉన్నప్పుడు పుట్టినరోజు వస్తోందంటే చాలు.. నెలరోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకునేవాళ్లం. అమ్మానాన్నలను అడిగి చక్కటి డ్రస్ కొనిపించుకోవడంతో పాటు చాక్లెట్లు, కేక్ సిద్ధం చేసుకొని.. ఫ్రెండ్స్‌కి క్యాంటీన్లో ట్రీట్ ఇవ్వడానికి డబ్బులు కూడా తీసుకునేవాళ్లం. ఆ రోజు మనమే ఒక వీఐపీ. స్నేహితులంతా చప్పట్లు కొడుతూ “హ్యాపీ బర్త్‌డే టూ యూ” అంటూ పాట పాడుతూ మనల్ని విష్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఫీలయ్యేవాళ్లం. ఆ తర్వాత స్నేహితులంతా మన చుట్టూ చేరి ట్రీట్ కోసం అడుగుతుంటే వీఐపీగా ఫీలైపోయి.. క్యాంటీన్లో వారికి నచ్చినవి ఇప్పించేవాళ్లం.
6. స్కూల్ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు..
ఇంట్లో ఫంక్షనుందంటే కాస్త పనైనా చేస్తామో లేదో తెలీదు.. కానీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం పనులన్నీ మన తలపై వేసుకొని చేసేవాళ్లం. ఫంక్షన్ ఏర్పాట్లు, డ్యాన్స్ ప్రాక్టీస్‌ల కోసం స్కూల్లోనే ఎక్కువ సమయం పాటు ఉండిపోవడం.. ఆ సమయంలో అందరూ తెచ్చిన స్నాక్స్ డబ్బాలు తెరిచి పంచుకొని తినడం.. ఇవన్నీ ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇలాంటి సమయంలోనే వేరే సెక్షన్లు, ఇతర క్లాసుల వారితోనూ మనకు స్నేహం ప్రారంభమయ్యేది. వీటిలో కొన్ని స్నేహాలు ఇప్పటికీ కొనసాగుతుంటాయనుకోండి. వీటితో పాటు స్కూల్లో ఎన్నికలు పెడితే మాత్రం నాలుగైదు రోజుల పాటు హల్చల్ చేసేవాళ్లం. నామినేషన్ దగ్గర్నుంచి.. స్పీచ్, క్యాంపెయిన్లు, కాన్వాసింగ్.. ఇలా ప్రతి నిమిషం ఎంతో కష్టపడేవాళ్లం. అయితే అదెప్పుడూ మనకు పెద్ద కష్టంగా కూడా అనిపించలేదు. పైగా జీవితంలో వివిధ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో ఇవి మనకు నేర్పించాయని చెప్పుకోవచ్చు.
7. స్కూల్ బెల్
అప్పట్లో మనకు ఎంతో ఇష్టమైన శబ్దం ఏదైనా ఉందంటే అది స్కూల్ బెల్ సౌండే.. స్కూల్ ప్రారంభమవగానే ప్రతి క్లాస్ అయిపోవడానికి కొట్టే బెల్ కోసం వేచి చూసేవాళ్లం. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాతైతే ఎప్పుడు ఆఖరి బెల్ కొడతారా? ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా? అని వెయిట్ చేసేవాళ్లమంటే అతిశయోక్తి కాదు.
8. ఆ పనిష్మెంట్లు
స్కూల్లో ఉండగా మనం తప్పు చేస్తే టీచర్లు మనకు ఇచ్చే పనిష్మెంట్లు అప్పుడు ఇబ్బందిపెట్టినా.. ఇప్పుడు తలచుకుంటే నవ్విస్తాయి. మా స్కూల్లో బెత్తం చాలా తక్కువగా వాడేవారు. దీనికి బదులుగా గోడకుర్చీ వేయించడం, క్లాస్ బయట చెవులు పట్టుకొని నిల్చోమనడం, క్లాస్‌లో అందరి ముందూ మోకాళ్లపై కూర్చోమనడం లేదా బెంచీ ఎక్కించడం.. ఇలాంటి శిక్షలే ఎక్కువగా ఉండేవి. అప్పట్లో అవి ఇబ్బందికరంగా, అవమానంగా అనిపించినా.. ఇప్పుడు ఆ శిక్షలు తలచుకుంటే తప్పక నవ్వొస్తుంది.
9. మన టీచర్లు
మనందరికీ ఉన్న ఫేవరెట్ టీచర్ల లిస్ట్‌లో స్కూల్ టీచర్లు తప్పనిసరిగా ఉంటారు. వారితో మన అనుబంధం అలాంటిది. మన పేరెంట్స్ తర్వాత మనకు చిన్నతనంలో ఎంతో ఇష్టమైన వాళ్లు ఈ టీచర్లే.. అప్పుడప్పుడూ వాళ్లు తిట్టినప్పుడో, కొట్టినప్పుడో కోపం వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం వాళ్లే. మనకు విద్య అనే తరగని సంపదను వారే అందించారు.
10. ఆ స్నేహితులు
మనకున్న స్నేహితుల్లో స్కూల్ ఫ్రెండ్స్‌తో ఉన్నన్ని జ్ఞాపకాలు ఇంకెవరితోనూ ఉండవేమో. అంతటి ఆనందమైన రోజులవి. ఆ స్నేహాలు చాలామంది జీవితంలో పెద్దయ్యేవరకూ కొనసాగుతాయి. మన క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో స్కూల్ ఫ్రెండ్స్ ఒకరో, ఇద్దరో తప్పక ఉంటారు. వాళ్లు మనతో పాటే పెరిగారు.. కాబట్టి వారికి మన గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. అందుకే మన సమస్యలన్నీ అర్థం చేసుకొని మనకు తోడు నిలుస్తారీ స్నేహితులు.
ఇవి కూడా చదవండి.
చిన్నతనంలో.. అవి నిజంగానే నిజం అని నమ్మేశాం కదా..!
విజేతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మకు మాత్రం పసిబిడ్డే..!
తమ తల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భలే ఫేమస్ తెలుసా..!
Images : Giphy.