మాది ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. కానీ నా వైవాహిక జీవితంలో హాయిగా సాగిపోయే రోజులు ఉన్నా.. అతి తక్కువ అని నేను ఏనాడూ అనుకోలేదు. మా ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతోందని నాకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ అందుకు కారణాలు మాత్రం ఏంటో నేను వూహించలేకపోయాను. రోజూ రాత్రి పడుకునే సమయంలో వీటి గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని.
ఒక రోజు రాత్రి ఉన్నట్లుండి నేను నిద్రలో నుంచి మేల్కొన్నాను. అప్పటికే నా కళ్లు ఏడ్చి ఏడ్చి వాచినట్లుగా తయారయ్యాయి. నా గుండె చప్పుడు రేసులో పరిగెడుతున్న గుర్రం కంటే వేగంగా కొట్టుకుంటున్నట్లు వినిపిస్తోంది. అప్పుడు కానీ నా వైవాహిక జీవితం సమస్యల వలయంలో చిక్కుకోవడానికి గల కారణాలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. అంతేకాదు.. ఆ సమస్యల కారణంగా నేను ఎంతగా ఆత్మన్యూనతాభావానికి గురయ్యానో గ్రహించలేకపోయా.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే నా భర్తలో వచ్చిన మార్పుని నేను జీర్ణించుకోలేకపోవడమే దీనంతటికీ కారణం. అవును.. పెళ్లికి ముందు ఆయన నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. నాతో ఉండేందుకు సమయం కేటాయించడమే ఆయన మొదటి ప్రాధాన్యతగా ఉండేది. కానీ పెళ్లయ్యాక మాత్రం ఎప్పుడూ పనికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. నాతో అసలు సమయం గడిపేందుకే ప్రయత్నించడం లేదు. అదీకాకుండా ఆయన మునుపు నా పట్ల చూపిన శ్రద్ధ ఇప్పుడు నాకు అసలు కనిపించడం లేదు. ఆయనలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ దీని కారణంగా మా మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, మానసికంగా ప్రశాంతత లేకుండా పోవడం వంటివి జరుగుతున్నాయి.
అంతేకాదు.. పెళ్లికి ముందు వరకు ఎంతో సంతోషంగా ఉన్న నేను పెళ్లయ్యాక ఈ గొడవల కారణంగా దాదాపు ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉన్నాను. కానీ ప్రతి బంధంలోనూ ఇదొక దశ అని అప్పుడు నాకు అర్థమైంది. సాధారణంగా ఈ దశలోనే ఆలుమగలు ఒకరి గురించి మరొకరు ఇంకా వివరంగా, క్షుణ్ణంగా తెలుసుకుంటారని, వారి బలహీనతలు కూడా తెలుసుకొని బంధాన్ని మరింత దృఢపరుచుకునే క్రమంలో ఇదొక పరీక్షలాంటిదని తెలుసుకున్నా. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడి, మా బంధాన్ని దృఢపరుచుకోవాలని అనుకున్నా. ఇందుకోసం బాగా ఆలోచించగా నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలిసి వచ్చింది.
అవును.. పెళ్లికి ముందు నా కోసం నేను అన్నట్లుగా జీవించిన నేను.. పెళ్లయ్యాక నాకు కనీస ప్రాధాన్యం ఇచ్చుకోవడమే మానేశా. మరి, నాకు నేనే ప్రాధాన్యం ఇచ్చుకోకుండా, నన్ను నేనే ప్రేమించుకోకపోతే ఇంకెవరు నన్ను ప్రేమిస్తారు? ప‌్రాధాన్యం ఇస్తారు?? ఈ ప్రశ్న నన్ను, నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. పెళ్లయ్యాక ఎవరి జీవితంలోనైనా చిన్న చిన్న మార్పులు రావడం సహజం.
వాటిని ఆలుమగలిద్దరూ పరస్పరం అర్థం చేసుకొని ముందుకు సాగినప్పుడే ఆ బంధం నిలబడుతుంది. కానీ ఈ క్రమంలో నా భర్తకు నచ్చే విధంగా ఉండేందుకు నన్ను నేను పూర్తిగా మార్చేసుకున్నానని గ్రహించలేకపోయాను. అంతేకాదు.. ఆ మారిన నేను (self sacrifice) నాకు అస్సలు నచ్చలేదు. ఈ ఒత్తిడి, ఆందోళనే నాలో మరింత మానసిక అలజడికి కారణమయ్యాయి. నన్ను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాయి. అందుకే ఇకపై వాస్తవం కాని.. ఆ నేనులా జీవించడం ఇష్టం లేక తిరిగి నాలా నేను జీవించడం మొదలుపెట్టా.
కేవలం నా భర్తతో కలిసి జీవించాలనే ఒకే ఒక్క ఆశతో నన్ను నేను పూర్తిగా మార్చుకుని ఇష్టం లేని జీవితాన్ని గడపడమా?? లేక ఏం జరిగినా సరే.. నాలా నేను ఉంటూ నా సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వడమా?? అని ఆలోచించుకున్నా. సంతోషంగా లేని వైవాహిక జీవితం కోసం నన్ను నేను త్యాగం చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆలోచించా. అలాగే మా దాంపత్య బంధం ద్వారా నాకు మిగిలిన తీపి, చేదు అనుభవాలను లిస్ట్ గా తయారు చేశా. నిజం చెప్పాలంటే- రెండూ బేరీజు వేసి చూసుకుంటే సమానంగానే అనిపించాయి.
ఒక్కసారి పెళ్లికి మునుపు నా జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటే నా కంటూ ఉన్న కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు, పూర్తి చేయాల్సిన పనులు, డెడ్ లైన్స్, ఫ్రెండ్స్ గ్యాంగ్, వారితో గడిపిన సరదా క్షణాలు, కుటుంబ సభ్యులు.. ఇలా చాలా కళ్ల ముందు మెదిలాయి. కానీ నేను నా భర్తను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నా ప్రపంచం అంతా మారిపోయింది. నా ప్రాధాన్యాలన్నీ పక్కన పెట్టి నా భర్త ఇష్టాలనే నా ఇష్టాలుగా మార్చుకున్నా. ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు నాకు తెలియకుండా నన్నే మార్చేసుకున్నా. అంతేకాదు.. నేను చేసే ప్రతి పనికీ ఆయన నుంచి గుర్తింపు లభించకపోతుందా? చిన్న ప్రశంస అయినా రాకపోతుందా.. అంటూ ఎంతో ఆశగా ఎదురుచూడడం, అది రాకపోయేసరికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం.. ఇదే తంతుగా మారిపోయింది.
ఇదంతా ఇప్పుడు ఆలోచిస్తుంటే అసలు నేను నేనేనా అన్న సందేహం వస్తోంది. అందుకే ఈసారి పొరపాటు చేయదలుచుకోలేదు. మునుపు నాకు నచ్చినట్లు నేను ఎలా ఉండేదాన్నో అలానే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నా. నా మనసుకి సర్ది చెప్పుకుని నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి కలవడం ప్రారంభించా. వారితో సంతోషంగా సమయం గడుపుతూనే నాకు నచ్చిన రంగంలో ఉద్యోగం సంపాదించుకున్నా.
మళ్లీ నా కంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడం కోసం కష్టపడి పని చేయడం ప్రారంభించా. ఇలా నా ప్రాధాన్యాలు మార్చుకున్న తర్వాత మానసికంగా నాకు ఎదురైన బాధ నుంచి బయటపడగలిగా. ఈ ప్రేరణతోనే నన్ను నేను ప్రేమించుకుంటూ నా కోసం మరింత సమయం కేటాయించుకోవడం మొదలుపెట్టా. క్రమంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. అది నాకు స్పష్టంగా తెలుస్తోంది. అయినా సరే.. ఈసారి ఎవరి కోసమూ లేదా ఏ కారణం చేతనూ నన్ను నేను మార్చుకోదల్చుకోలేదు. అందుకే మరింత సంతోషంగా ఉండేందుకు ఇంకా ఉత్సాహంగా ఉంటూ పని చేయసాగా. కానీ నాలో వచ్చిన ఈ మార్పు కారణంగా నా భర్త నాతో తిరిగి మరోసారి ప్రేమలో పడతారని నేను అస్సలు ఊహించలేదు.
నిజమండీ.. ఆయన నన్ను నాలానే ప్రేమించారు. కానీ పెళ్లయ్యాక వచ్చిన మనస్పర్థలు, మార్పులతో పాటు నాలో వచ్చిన మార్పు కూడా ఆయన ప్రేమ నాకు దూరం కావడానికి కారణమైందని నేను గ్రహించలేకపోయా. కానీ ఎప్పుడైతే నేను మళ్లీ నాలా ఉండడం మొదలుపెట్టానో అప్పుడే ఆయన కూడా మళ్లీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మా బంధంలో కలతలు సర్దుకోవడం మాత్రమే కాదు. ఇద్దరం ఎంతో సంతోషంగా కూడా జీవిస్తున్నాం. నా కథ ద్వారా మీ అందరితోనూ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. అదేంటంటే- మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించే క్రమంలో మనల్ని మనం కోల్పోకూడదు. అలా చేస్తే మీ జీవితంలో ఏ బంధంలోనైనా కుదుపులు రాక తప్పవు. అలాకాకుండా మనల్ని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు ఏ బంధంలో వచ్చిన సమస్యలైనా వాటంతట అవే సర్దుకుంటాయి. ఏమంటారు??
Featured Image: Pixabay
ఇవి కూడా చదవండి
#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకున్నాం..!
డియర్ ఎక్స్ .. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు..!
మీ బాయ్ ఫ్రెండ్ కలలోకి వస్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??