ఒకప్పుడు 300 కిలోలు.. ఇప్పుడు 86 కిలోలు: బరువు తగ్గడంలో ముంబై వనిత రికార్డ్

ఒకప్పుడు 300 కిలోలు.. ఇప్పుడు 86 కిలోలు: బరువు తగ్గడంలో ముంబై వనిత రికార్డ్

ఊబకాయం (Obesity) - ఇప్పుడు భారతదేశాన్ని డయాబెటిస్ తరువాత ఎక్కువమందిని ఆందోళనకి గురిచేస్తున్న ఆరోగ్య సమస్య.  మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఊబకాయాన్ని ఎదుర్కొనేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయినాసరే, అనేకమంది ఈ సమస్య నుండి బయటపడలేకపోతున్నారు. అలాంటి వారిలో స్ఫూర్తిని కలిగించే కథ ఇది.


ముంబైకి చెందిన 42 ఏళ్ళ అమిత రజని (Amita Rajani) తన 16వ ఏటనే.. సుమారు 126 కిలోల బరువు ఉండేది. 6 ఏళ్ల నుండే అనుకోని రీతిలో ఆమె ఊబకాయం బారిన పడింది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా.. వారు ఈ  సమస్యకి పరిష్కారం చూపలేకపోయారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి.. అమిత బరువు 250 కిలోలు దాటిపోవడంతో పరిస్థితి విషమించింది. ఆమె రోజువారీ పనులు, దినచర్యలు కూడా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంది. దానితో ఆమె చుట్టూ నిరంతరం ఎవరో ఒకరు ఉండి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.


ఈ క్రమంలో ఆసియాలోనే అత్యంత ఎక్కువ బరువు ఉన్న మహిళగా అమిత వార్తల్లోకెక్కింది. దాదాపు 300 కిలోల బరువుకి చేరుకుంది. బరువు బాగా పెరిగాక.. దాదాపు పదేళ్ళ పాటు అమిత ఇంటికే పరిమతమైంది. ఒక రోజు అనుకోకుండా మంచం పై నుండి ఆమె క్రింద పడితే, ఆరుగురు మనుషులు సుమారు 3 గంటల పాటు కష్టపడి కాని.. మళ్ళీ తనని మంచం పై పడుకోపెట్టలేకపోయారు. ఇక ఆమె బరువు తగ్గడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమె కుటుంబీకులు దాదాపు రూ 20 లక్షల మేర ఖర్చు చేసినా కూడా సరైన ఫలితం లేకపోయింది.


చివరగా 2015లో లీలావతి ఆసుపత్రి (Leelavati Hospital) & హిందుజా హెల్త్ కేర్ సర్జికల్ హాస్పిటల్‌‌లలో ల్యాప్రో ఒబేసీ సెంటర్ స్థాపకుడైన డాక్టర్ శశాంక్ షాని కలవడానికి.. అమిత రజని తొలిసారిగా ఇంటి నుండి బయటకి రావడం జరిగింది.


అయితే ఆమెని ఆసుపత్రికి తరలించడానికి..  ఒక స్పెషల్ అంబులెన్స్‌ని సిద్ధం చేశారట డాక్టర్లు. అలా ఆమెని ఆసుపత్రికి తరలించి పలు పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో.. ఆమెకి ఊబకాయ సమస్యతో పాటుగా కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం, కొలస్ట్రాల్, టైప్ - 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు గుర్తించారు.


దాదాపు అన్నిరకాల పరీక్షల అనంతరం, డాక్టర్ శశాంక్ షా ఈ సమస్యకి శస్త్రచికిత్సనే మార్గంగా ఎంచుకున్నారు. అయితే ఈ శస్త్రచికిత్సకి రోగి అనుమతితో పాటు తోడ్పాటు అవసరం. అందుకుగాను అమిత రజనికి పరిస్థితిని పూర్తిగా వివరించి ఆమెని శస్త్రచికిత్సకి ఒప్పించడం జరిగింది.


అలా 2015లో తొలిసారిగా లేప్రాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమి (Laparascopic Sleeve Gastrectomy) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇది జరిగాక ఆమె కొన్ని నెలలకి 117 కిలోలు మేర బరువు తగ్గడం జరిగింది. ఇక ఆ శస్త్రచికిత్స తరువాత స్పెషల్ డైట్ అందించడమే కాకుండా, ప్రతిరోజు డాక్టర్ల పర్యవేక్షణతో ట్రీట్‌మెంట్ ఇవ్వగా.. ఊబకాయంతో పాటుగా ఉన్న మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.


ఇక రెండవ శస్త్రచికిత్స 2017లో చేయడం జరిగింది. అయితే రెండవ సారి చేసింది గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ (Gastric Bypass Surgery). ఇది కూడా విజయవంతంగా పూర్తయ్యాక, అన్ని ఆరోగ్య సమస్యలని అమిత రజని పూర్తిగా అధిగమించగలిగింది. ఈ రెండు శస్త్రచికిత్సలు పూర్తయిన తర్వాత.. వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన డైట్‌ని తీసుకోవడం ద్వారా.. తన బరువును 300 కిలోల నుండి 86 కిలోలకి తీసుకురాగలిగింది అమిత రజని. అంటే ఈ నాలుగేళ్ళ కాలంలో దాదాపు 214 కిలోలు తగ్గిందట ఆమె.


మెడికల్ రంగంలో అమిత కేసును ఒక ప్రత్యేకమైన  కేసు‌గా అభివర్ణించారు డాక్టర్ శశాంక్ షా. అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించిన వివరాలు తెలిపారు. ఈ చికిత్సలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు & ఊబకాయం నుండి రోగిని సాధారణ స్థితికి ఎలా తీసుకొచ్చారు? మొదలైన విషయాలను తెలిపారు.  ఈ చికిత్స తీసుకున్న అమిత రజని 300 కిలోల బరువు నుండి.. 86 కిలోలకు తగ్గడం ఒక రికార్డు అని.. ఈ విషయాన్ని ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియజేశామని ఈ సందర్భంగా శశాంక్ తెలిపారు. 


"ఇక దాదాపు 214 కిలోలు తగ్గిన తరువాత.. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది" అని అమిత రజనిని మీడియా ప్రశ్నించగా - నాకు ఇప్పుడు స్వేచ్ఛ లభించిదని భావిస్తున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరి పైన ఆధారపడిన నాకు.. ఈ సమస్య తొలిగిపోయాక సొంత కాళ్ళ పైన నిలబడినట్టుంది" అని తెలిపింది.


అయితే ఈ ఊబకాయ సమస్యలకు జీవన విధానం మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు జెనెటిక్‌గా  సంక్రమించే సమస్యలు కూడా కారణమయ్యే అవకాశం ఉందట. అలాగే మన శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఊబకాయ సమస్య ఎదురుకావచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక తాజాగా ఆరోగ్య సంస్థలు వెలువరించిన పలు సర్వేలలో కూడా.. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.


ఇప్పుడు ఈ ఊబకాయ సమస్యకి చెక్ పెట్టడానికి చాలామంది బేరియాట్రిక్ శస్త్రచికిత్స (Bariatric Surgery) , లేప్రాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్ పద్ధతులని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ శస్త్రచికిత్సలు చేసే సమయంలో అనుకోకుండా రక్తస్రావం ఎక్కువగా జరిగినా లేదా రక్తం గడ్డ కట్టినా.. రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయట.


మనకి బాగా తెలిసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) & సినీ నటి ఆర్తి అగర్వాల్ (Aarti Agarwal) కూడా ఇటువంటి సర్జరీలు చేయించుకున్న తరువాత ఏర్పడిన ఆరోగ్య సమస్యల ద్వారానే కన్నుమూయడం జరిగింది. అందుకే ఇటువంటి సర్జరీలతో.. మంచి పరిణామాలతో పాటుగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవాలి.


ఏదేమైనా.. రోజు మనం తినే ఆహరం మితంగా ఉండి.. శరీరానికి కావాల్సినంత వ్యాయామం ఉంటే.. ఈ ఊబకాయ సమస్య రాకుండా చూసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి


ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి చేయాల్సిన సులభమైన వ్యాయామాలివే..


ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..!


30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?