సమంత పాడిన పాటకు.. వారు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారంటే..?

సమంత పాడిన పాటకు.. వారు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారంటే..?

టాలీవుడ్ కథానాయిక సమంత అక్కినేని (Samantha Akkineni) ప్రస్తుతం "ఓ బేబి" (Oh Baby) అనే ఓ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ సింగర్ పాత్ర పోషిస్తున్నారు. 70 ఏళ్ల ముసలావిడ అనుకోకుండా 25 ఏళ్ల పడుచుపిల్లగా మారితే.. ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర కథ. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ‘ఆకాశంలోన..’ అనే పాట విడుదలైంది. కానీ ఈ పాటకు  లభించిన రెస్పాన్స్ అంతా ఇంతాకాదు. చాలామంది ఇప్పటికే ఈ పాటకు అభిమానులైపోయారు.

ఈ పాటను నూతన్ మోహన్ ఆలపించారు. ‘ఓ బేబీ’ సినిమాకు నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. జులై 5వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాకి నిర్మాణ సారథ్యం వహిస్తోంది.

కథానాయిక నటనకు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రం.. సమంతకు ప్లస్ పాయింట్ అవుతుందని ఇప్పటికే చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు. నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జగపతిబాబు, తేజ సజ్జా, ప్రగతి, అనీషా దామా, స్నిగ్ధ, ఐశ్వర్య,ఊర్వశి, ప్రియదర్శి, మిర్చి హేమంత్, ధనరాజ్, అడివి శేష్ ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కొరియన్ చిత్రం మిస్ గ్రానీకి ఈ చిత్రం అధికారిక రీమేక్.

ఈ చిత్రానికి ఓ కొరియన్ నిర్మాత కూడా సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2018 డిసెంబరులో తొలిసారిగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ షూట్ జరిగింది.

ఈ కథనాన్ని కూడా చదివేయండి: "చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే" : సమంత

Oh Baby - Movie Poster

అలా మొదలైంది, జబర్దస్త్, కళ్యాణ వైభోగమే చిత్రాల తర్వాత.. చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కించడంతో ప్రాజెక్టుపై ప్రస్తుతం మంచి అంచనాలే  ఉన్నాయి. నంది అవార్డు గ్రహీతైన నందిని రెడ్డి ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారని వినికిడి. ఇక ఈ చిత్రం ఒరిజనల్ వెర్షన్ మిస్ గ్రానీ  విషయానికి వస్తే.. 2014లో కొరియాలో విడుదలైన ఈ చిత్రం.. ఆ దేశంలో అన్ని రికార్డులనూ బ్రేక్ చేసింది.

ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొంది. ఈ చిత్రాన్ని తొలుత బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఇదే చిత్రం చైనీస్, వియత్నమీస్, జపనీస్, థాయ్, ఇండోనేషియన్, ఫిలిప్పీన్స్ భాషల్లో ఇప్పటికే రీమేక్ అయ్యింది. ప్రస్తుతం తెలుగుతో పాటు జర్మన్ భాషలోకి కూడా రీమేక్ అవుతోంది.

ఈ కథనాన్ని కూడా చదివేయండి: కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం

Director Nandini Reddy in Oh Baby Shoot (Instagram)

అంతర్జాతీయంగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో తెరకెక్కించడం విశేషం. ముఖ్యంగా మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్. ఇప్పటికే ఈ  సినిమా పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆకాశంలోన పాటకు అయితే ఇప్పటికే యూట్యూబులో రికార్డు స్థాయి వ్యూస్ రావడం గమనార్హం.

అంతగా అభిమానులు ఈ పాటకు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ పాటలో కథానాయిక సమంత వ్యక్తపరిచిన భావోద్వేగాలు, బాధను తనకు తాను అన్వయించుకున్న తీరు తమ గుండెలను కూడా పిండేసిందని పలువురు సినీ అభిమానులు తెలపడం గమనార్హం. ఈ పాటను రచయిత లక్ష్మీ భూపాల్ రాశారు. ఈ పాటలోనే మొత్తం సినిమా కథాంశం కనిపిస్తుందని.. సమంత మదిలోని భావాలు స్పష్టంగా ప్రేక్షకులకు చేరుతాయని పలువురు అంటున్నారు.

పెళ్లయ్యాక సమంత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. యూటర్న్ లాంటి సినిమా తర్వాత.. ఆమె మజిలీ లాంటి సినిమాను ఎంచుకోవడమే కాకుండా.. అందులో తన భర్త నాగచైతన్యకు పెయిర్‌గా సైతం నటించారు. ఇప్పుడు మరో వైవిధ్యమైన కథాంశమైన హే బేబీ చిత్రాన్ని ఎంచుకున్నారు. అంతకు క్రితమే మహానటి చిత్రంలో జర్నలిస్టు పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఏదేమైనా.. విభిన్నమైన పాత్రలను ఎంచుకోవాలన్న సమంత ఆలోచన మనకు ఈ చిత్రాల ద్వారా అవగతమవుతుంది. మరి ఆమె ఎంతో ఆసక్తితో, ఇష్టంతో చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే.. సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే. ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు తెరకు పరిచమమైన సమంత.. తొలుత గ్లామర్ పాత్రలకే పరిమితమైనా.. ఈ మధ్యకాలంలో ఎక్స్‌పరిమెంటల్ సినిమాలవైపు మొగ్గుచూపడం గమనార్హం.

ఈ కథనాన్నికూడా చదివేయండి: సమంత రిటైర్‌మెంట్ పై ఫ్యాన్ ట్వీట్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరోయిన్..!