అంగరంగవైభవంగా జరిగిన.. నటి స్నేహ శ్రీమంతం విశేషాలు మీకోసం ..!

అంగరంగవైభవంగా జరిగిన.. నటి స్నేహ శ్రీమంతం విశేషాలు మీకోసం ..!

(Actress Sneha celebrates baby shower ceremony)

తెలుగు సినీ ప్రేక్షకులకి నటి స్నేహ గురించిన పరిచయం ప్రత్యేకంగా అక్కర్లేదు. కారణం ఆమె నటించిన పాత్రలు ఆ స్థాయిలో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయాయి. ఆమె అసలు పేరు సుహాసిని అయినప్పటికి.. వెండితెరకి మాత్రం స్నేహగానే పరిచయమైంది. తమిళ నటుడు ప్రసన్నను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Sye Raa Narasimha Reddy Movie Review: 'సైరా' చిత్రంలో.. 'సై.. సైరా' అనిపించే 9 అంశాలివే

ఇక నిన్న చెన్నైలో స్నేహ శ్రీమంతం అంగరంగవైభవంగా జరిగింది. ఈ శ్రీమంతానికి స్నేహ కుటుంబసభ్యులు, ఆత్మీయులు విచ్చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా.. పండంటి బిడ్డ పుట్టాలని కూడా ఆశీర్వదించారు. ఇక ఈ వేడుక ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవడంతో.. ఆమెకి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన నటి జీవితంలో ఇదొక మరుపురాని సందర్భం కావడంతో.. ఆమెని బెస్ట్ విషెస్‌తో ముంచెత్తుతున్నారు.

టాలీవుడ్‌‌తో పాటు కోలీవుడ్‌లో కూడా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించకున్న.. స్నేహ ప్రేమ, పెళ్లి.. ఈ రెండూ యాదృచ్చికంగా జరిగిపోయాయని చెబుతుంటారు. 2000 సంవత్సరంలో తొలిసారి నటిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు స్నేహ. తెలుగులో గోపీచంద్ నటించిన' తొలివలపు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికి.. 'ప్రియమైన నీకు' చిత్రం ద్వారా ఆమె సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తరువాతి కాలంలో కూడా.. తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది స్నేహ.

తెలుగులో  స్నేహ నటించిన అనేక చిత్రాలు ఆమెకు అవార్డులను సంపాదించి పెట్టాయి. వెంకి, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు, మాధుమాసం, రాజన్న మొదలైన చిత్రాలలో ఆమె నటనకు  ప్రశంసలు సైతం దక్కాయి. ఇక 2009లో తమిళంలో హీరో ప్రసన్నతో కలిసి.. స్నేహ ఓ చిత్రంలో నటించడం జరిగింది. ఆ చిత్రంలోని నటనకి గాను స్నేహకు ఫిలిం‌ఫేర్ నామినేషన్ దక్కగా.. అదే చిత్రం షూటింగ్ సమయంలో ఆమెకు ప్రసన్నతో ఏర్పడిన స్నేహం తరువాత ప్రేమగా మారడం జరిగింది.

అప్పట్లో వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా.. పెళ్లి చేేసేసుకున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉండేవి. అయితే ఇంతలా వీరిద్దరి మధ్య వార్తలు రావడానికి గల ప్రధానం కారణం.. తమిళంలో స్నేహ. ప్రసన్నల జోడికి మంచి ఫేమ్ ఉండడమే. దీంతో పాటుగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం.. బాక్స్‌ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో.. ఆ వదంతులు మరింత ఎక్కువయ్యాయి.

'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

అయితే తమ పై వస్తున్న గాసిప్స్ అన్నింటికీ.. ఒకరోజు తన ప్రకటనతో తెరదించేశాడు ప్రసన్న. తాము ఇద్దరం ప్రేమించుకున్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే.. మే 11, 2012 తేదిన వీరిద్దరి వివాహం.. ఇరు కుటుంబాల అంగీకారం నడుమ జరిగింది.

పెళ్లి తరువాత కూడా స్నేహ సినిమాలలో నటించడం విశేషం. అయితే 2014 తరువాత నటనకు ఆమె కొంత బ్రేక్ ఇచ్చింది. దీనికి కారణం 2015లో.. ఈ జంటకి విహాన్ అనే బిడ్డ జన్మించడమే. కొద్దికాలం తరువాత స్నేహ మరలా చిత్రాల్లో నటించడం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్ చరణ్‌కి వదినగా.. ఒక చక్కటి పాత్రలో స్నేహ నటించడం గమనార్హం. మళ్ళీ ఇప్పుడు రెండవ సారి తల్లి కాబోతున్న కారణంతో.. మరలా కొద్దికాలం ఆమె నటనకి బ్రేక్ ఇవ్వడం జరిగింది.

కాగా స్నేహ భర్త ప్రసన్న తమిళంలోనే కాకుండా.. తెలుగు చిత్రాలలో కూడా నటిస్తున్నారు. మొదటిసారిగా తను నాగార్జున 'భాయ్' చిత్రంలో నటించగా.. తర్వాత 2017లో సాయి ధరమ్ తేజ్ చేసిన 'జవాన్' చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు.  ప్రస్తుతం 'మాఫియా' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

మరి మనం కూడా త్వరలోనే స్నేహ - ప్రసన్నల ఇంట.. చంటి బిడ్డ నవ్వులు విరబూయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ ఇద్దరు భార్యాభర్తలు తమిళంతో పాటు తెలుగులో కూడా.. రాబోయే రోజుల్లో మంచి చిత్రాాలలో నటించాలని ఆశిద్దాం.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

Featured Image: Instagram.com/SSMusic