అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విశేషాలు..!

అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విశేషాలు..!

"అమ్మ బ్రహ్మదేవుడో .. కొంప ముంచినావురో...

ఎంత గొప్ప సొగసురో ... యాడ దాచినావురో ...

పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు... రంగరిస్తివో... ఇలా బొమ్మ చేస్తివో...

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా!!"

సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన ఈ పల్లవిలో.. ఎంత భావుకత ఉందో మనకు తెలియంది కాదు. అతిలోకసుందరి శ్రీదేవిని దృష్టిలో పెట్టుకునే  ఈ పాటను రాశానని.. ఆయనే స్వయంగా ఒకానొక సందర్భంలో తెలిపారు. అదీ కాకుండా ఈ పాటను రాయడానికి.. తనకు ప్రేరణను అందించింది దర్శకుడు రాంగోపాల్ వర్మ అని కూడా చెప్పారు.

సిరివెన్నెల చెప్పారని కాదు కానీ.. పైన పల్లవిలో చెప్పిన ప్రతి పదం.. దివంగత నటి శ్రీదేవికి కచ్చితంగా సరిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె అందం, అభినయానికి ఫిదా అవ్వని అభిమాని అంటూ ఎవరూ ఉండరంటే మీరు నమ్ముతారా?? ఆమె గతించి ఏడాది పూర్తయినప్పటికీ శ్రీదేవి మన మధ్య ఇక లేరన్నది.. ఇప్పటికీ ఒక నమ్మలేని నిజంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె 50 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్‌లో.. అనేక భాషల్లో నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రాలు.. ఇప్పటికీ మనకు ఎప్పటికప్పుడు టీవీలలో కనిపిస్తూనే ఉంటాయి.


ఈ రోజు శ్రీదేవి జయంతి ( Birth Anniversary) సందర్భంగా.. ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం


* శ్రీదేవి (Sridevi) తను నటించిన ఆఖరి చిత్రం "మామ్‌"లో నటనకుగానూ.. భారత ప్రభుత్వంచే ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికయ్యారు. అయితే దానిని ఆమె మరణానంతరం ప్రకటించడంతో.. ఆ పురస్కారాన్ని ఆమె కుటుంబసభ్యులు స్వీకరించారు.


* శ్రీదేవి తల్లి రాజేశ్వరి అయ్యంగార్. అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఆమె కాలం చేశారు. దీనికి సంబంధించి కేసు కూడా అమెరికా న్యాయస్థానంలో నడిచింది.


* శ్రీదేవి 50 ఏళ్ళ కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ & కన్నడ భాషలన్నింట్లో కలిపి 300 చిత్రాల్లో నటించారు. ఆమె "మాలినీ అయ్యర్" అనే టెలివిజన్ సీరీస్‌లో కూడా నటించారు.


* శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వి తెరంగేట్రం చేసిన "దడక్" చిత్రం విడుదలకి కొద్ది రోజుల.. ముందే ఆమె మరణించారు.


* పెళ్లి చేసుకున్న తరువాత సుమారు 15 ఏళ్ళ పాటు (1998-2013) శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు.

నా దగ్గర అంత డబ్బు లేదు: శ్రీదేవి కుమార్తె జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు

 

 

* భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ పురస్కారాన్ని శ్రీదేవి 2013లో అందుకున్నారు.

* శ్రీదేవి నటించిన ఆఖరి తెలుగు చిత్రం - క్షణక్షణంకి ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుతో పాటుగా.. ఫిలిం‌ఫేర్ సౌత్ అవార్డుని కూడా దక్కించుకున్నారు.

* ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా ఛానల్ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఉన్న గొప్ప నటీమణులలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు శ్రీదేవి.

* ఆమె నటించిన ఆఖరి హిందీ చిత్రం - షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'జీరో' (ఇందులో ఆమె అతిథి పాత్రలో మెరిశారు).

నా ముద్దు "ఆ" యువ హీరోకే: జాన్వీ కపూర్

 

 

* శ్రీదేవి మరణించాక.. ఆమెకు కడపటి వీడ్కోలను అందివ్వడానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. హిందీ చిత్రసీమలో మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ , రాజేష్ ఖన్నాల తరువాత ఇంత భారీ సంఖ్యలో ప్రజలు వచ్చిన అంతిమయాత్రగా ఇది నిలిచింది. దీని ప్రకారం ఆమెకు ప్రజల్లో ఉన్న అభిమానం.. ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఆమె అభిమానులు లేదా సినీ అభిమానులు శ్రీదేవి గురించి చెప్పుకునే ఏకైక మాట - 'ఆమెకు మరణం లేదు' అని. ఇది ఒకరకంగా నిజమే. ఎందుకంటే నటిగా అయిదు దశాబ్దాల పాటు.. హీరోయిన్‌గా సుమారు దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు శ్రీదేవి. సినీ పరిశ్రమపై అంతటి ప్రభావం చూపిన ఆమెను మర్చిపోవడం ఎవ్వరి తరం కాదు.