"స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది - "అల వైకుంఠపురంలో" టీజర్‌లో అల్లు అర్జున్

"స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది - "అల వైకుంఠపురంలో" టీజర్‌లో అల్లు అర్జున్

(Allu Arjun and Trivikram Srinivas's Ala Vaikuntapuram Lo Teaser Talk)

వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే మూడు భారీ చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న "అల వైకుంఠపురంలో" కూడా  ఒకటి. ఇక ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకొనేలా ఈ "అల వైకుంఠపురంలో" టీజర్ ఉందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' టీజర్.. ఫ్యాన్స్ అంచనాలని అందుకుందా?

టీజర్ మొదట్లోనే .. అల్లు అర్జున్  పాత్ర గురించి.. సినిమాలోని ఓ ప్రముఖ పాత్ర చేత.. ఒక సింపుల్ డైలాగ్ చెప్పించేశాడు దర్శకుడు. 

"మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్ను!!

సరిగా చూడలేదు ఎప్పుడూ

ముందుకి రా

గట్టోడివి!"

ఈ ఒక్క డైలాగ్‌తో అల్లు అర్జున్ పాత్రకున్న బలం గురించి.. ఒక్క ముక్కలో చెప్పేసినట్టుగా ఉంది కదా. అలాగే స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌కి తగ్గట్టుగానే.. అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, ఫైట్స్‌ను ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు దర్శకుడు త్రివిక్రమ్ బన్నీ చేత పలికించిన ఓ  డైలాగ్ కూడా ట్రెండీగా ఉంది. బహుశా అది ట్రెండింగ్ డైలాగ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

"స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది" - ప్రస్తుతం ఈ డైలాగ్‌కి ఒక్క రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. 

స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌కి సరిగ్గా సరిపోయేలా ఈ డైలాగ్ రాయడంతో.. ఇది బన్నీ అభిమానులకి కూడా ఎంతగానో నచ్చే అవకాశముందని చెప్పుకోవచ్చు. ఇక హీరో పై మొత్తం దృష్టి పెట్టి.. హీరోయిన్‌ని పక్కన పెట్టేయలేదు త్రివిక్రమ్. సినిమాలో కథానాయిక పూజ హెగ్డే‌ను పొడిగేలా ఒక చక్కటి డైలాగ్ పలికించాడు.

ఆ డైలాగే - "మేడం సార్... మేడం అంతే!!"

న్యాచురల్ స్టార్ 'నాని' కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్ .. 'టక్ జగదీశ్'

 

ఇక ఈ టీజర్‌లో కొద్దోగొప్పో కథ గురించి.. కొద్దిగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే చాలా సినిమాల్లో చూపించినట్టుగానే   వైకుంఠపురం అనేది ఇంటి పేరని.. ఆ ఇంటికి అల్లు అర్జున్ ఏదో పని మీద వెళ్తాడనేది మనకు ఇట్టే అర్థమవుతోంది. అయితే దీని పై క్లారిటీ మాత్రం అసలు ట్రైలర్ లేదా సినిమా విడుదల అయ్యాక కాని రాదు.

ఇక త్రివిక్రమ్ అనగానే అన్నిటికన్నా ముందు గుర్తొచ్చేవి డైలాగ్స్. మరి ఆయన మార్క్ డైలాగ్స్ లేకుండా టీజర్ పూర్తయితే.. అది అసంపూర్ణం అనే చెప్పాలి. అందుకనే ఈ టీజర్‌లోనే ఒక సందర్భం సృష్టించి.. దానికి అనుగుణంగా ఆయన మార్క్ డైలాగ్ వినిపించాడు.

 "సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు" అనే డైలాగ్‌ని హీరో సుశాంత్‌తో చెప్పించి.. దానికి కౌంటర్‌గా అల్లు అర్జున్‌తో - "ఇన్ని పాటలతో ప్యాక్ చేసాక.. డైలాగ్ లేదనా?" అని చెప్పించగానే ..

విలన్ సముత్రిఖని కారులో నుండి దిగుతాడు. అప్పుడు అతన్ని చూస్తూ అల్లు అర్జున్ - "మీరిప్పుడే కారు దిగారు... నేనిప్పుడే క్యారెక్టరెక్కా.. " అంటూ కౌంటర్ విసరడం హైలెట్. చివరగా కొడవలిని ఇనుపగేటుకి రాస్తూ.. దానితో సిగరెట్ వెలిగించడం .. అలాగే ఇంకొక చేతిలో కోడిపుంజుతో నడుస్తూ రావడం.. లాస్ట్ పంచ్‌గా మనకి ఈ టీజర్ లో కనిపిస్తుంది.

మొత్తానికి ఈ "అల వైకుంఠపురంలో" టీజర్‌ని (Ala Vaikunthapuram Lo Teaser)  మాత్రం.. తమ అభిమానులు సంతృప్తి పడే విధంగానే త్రివిక్రమ్ ముగించాడని చెప్పాలి. ఇక ఈ టీజర్‌ను బట్టి.. త్వరలో విడుదల కాబోయే ట్రైలర్.. అలాగే ఆ తరువాత  విడుదలయ్యే చిత్రంలో మనకి స్టైలిష్ యాక్షన్ డ్రామా కనపడబోతుందనే అంచనాకి వేయవచ్చు.

ఏదేమైనా.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌లు సంక్రాంతి పండుగకి తమ సొంత కోడి పుంజుతో బరిలోకి దిగుతున్నట్టుగా.. సింబాలిక్‌గా టీజర్‌ని కోడి పుంజుతో ముగించడం బాగుంది.

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా...