న్యాచురల్ స్టార్ 'నాని' కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్ .. 'టక్ జగదీశ్'

 న్యాచురల్ స్టార్ 'నాని' కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్ .. 'టక్ జగదీశ్'

#Nani26 - Natural Star Nani to star in a new film called "Tuck Jagadhish"

వరుస హిట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్పెషల్ ఫాలోయింగ్ కలిగిన నేటితరం హీరోలలో నాని  ఒకరు. ఆయన ఈ ఏడాది నటించిన 'జెర్సీ' చిత్రం ఎంత పెద్ద హిట్టో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా విజయం ఒక్కసారిగా బాలీవుడ్‌ని సైతం తాకగా.. ఇప్పుడు ఇదే చిత్రం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతోంది. 

నాని 'జెర్సీ' హిందీ రీమేక్ లో నటిస్తున్న షాహిద్ కపూర్

ఇక ఇటీవలే, యువ దర్శకుడు శివ నిర్వాణ.. నానితో ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని తెలపడం గమనార్హం. తన తొలిచిత్రం 'నిన్ను కోరి'తో ఆయన ప్రేక్షకులకి ఒక చక్కటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మొదట్లో ఆయనే 'మజిలీ' పేరుతో మరొక ప్రేమకథని కూడా అందించారు. ఇలా అటు నాని.. ఇటు శివ.. తమ కెరీర్‌లో మంచి హిట్స్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు వీరిరువురు కలిసి మరో చిత్రానికి పనిచేయడం విశేషం

కొద్దిసేపటి క్రితమే  నాని తాను నటించబోయే తదుపరి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ సినిమా టైటిల్ చాలా వెరైటీగా ఉండడంతో పాటు.. అందరినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏంటా టైటిల్ అనుకుంటున్నారా? - అదే టక్ జగదీశ్. చిత్రమేంటంటే.. ఈ టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా చాలా విలక్షణంగా ఉంది. నాని తన షర్ట్‌ని టక్ చేసుకుంటున్నట్లు కనిపించే పోస్టర్ ఒకటి నిర్మాతలు విడుదల చేశారు. ఆ షర్ట్ పైనే 'టక్ జగదీశ్' అని రాసి ఉంది.

అయితే శివ ఈ చిత్రాన్ని లవ్ స్టోరీలా కాకుండా..  ఒక మాస్ సినిమా మాదిరిగా తీయనున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌తో పాటు.. పోస్టర్‌ను చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇక ఈ సినిమా శివ, నానిల కలయికలో వస్తున్న రెండవ చిత్రం కావడంతో.. ప్రేక్షకుల అంచనాలు కూడా పెరుగుతున్నాయి. 

 

'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!

ఈ   'టక్ జగదీశ్'  చిత్రం వివరాల్లోకి వెళితే.. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ.. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మరొక పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించడం విశేషం. ఇక త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకి వర్క్ చేస్తున్న సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రసాద్ మురెళ్ళ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నీరజ కోన కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పతాకంపై నిర్మిస్తున్నారు. అలాగే శివ నిర్వాణ అందిస్తున్న కథనం కూడా.. సినిమా మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్‌ను నిర్మాతలకు కలిగిస్తోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన పేరుని సుస్థిరం చేసుకున్న నాని.. మరోసారి ఈ చిత్రం ద్వారా ఆ పంథాని కొనసాగిస్తాడనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

మరో విషయం ఏమిటంటే.. ఇప్పటికే  నాని , సుధీర్ బాబు & నివేతా థామస్‌లు నటిస్తున్న 'V'  చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మిస్తుండగా .. ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. 

 న్యాచురల్ స్టార్ నాని 'జెర్సీ' మూవీ రివ్యూ