మెగాస్టార్ చిరంజీవి నా అభిమాన నటుడు: అమీర్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి నా అభిమాన నటుడు: అమీర్ ఖాన్

ఈ రోజు ఉదయం జపాన్ క్యోటో ఎయిర్ పోర్టులో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan), టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుకోకుండా కలిశారట. తొలుత చిరంజీవిని చూడగానే ఆశ్చర్యానికి గురైన అమీర్ ఖాన్.. హుటాహుటిన వెళ్లి తనని కలిశారట. తర్వాత వారిద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు కూడా. ఈ సందర్భంగా మెగాస్టార్‌తో తీసుకున్న సెల్ఫీలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాల్లో పోస్టు చేశారు అమీర్ ఖాన్.


ఈ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. "నా అభిమాన నటుడు సూపర్ స్టార్ చిరంజీవిని  ఎయిర్ పోర్టులో చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. వెంటనే పరుగెత్తుకుంటూ అతని వద్దకు వెళ్లాను. తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన తెలుగులో చేస్తున్న కొత్త ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి డిస్కస్ చేశాం. ఆయన నిజంగానే మాకు ఆదర్శం. ప్రేమతో అమీర్ " అని అమీర్ ఖాన్ పోస్టు చేశారు.


అమీర్ ఖాన్ గతంలో హిందీలో చేసిన "గజనీ" చిత్రాన్ని చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఆ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి కూడా అప్పట్లో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అప్పటి నుండీ చిరంజీవి ఫ్యామిలీతో అమీర్ ఖాన్‌కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమీర్ ఖాన్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ధూమ్ 3, దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.


చిరంజీవి ప్రస్తుతం "సైరా" చిత్రం నుండి కాసేపు బ్రేక్ తీసుకొని.. తన భార్యతో కలిసి పలు ప్రాంతాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.


ఇటీవలే ఆయన తన భార్యతో కలిసి జపాన్ సకూరా బ్లాజమ్స్‌లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "సైరా" చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడంతో.. ఉత్తరాదిలో కూడా ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తి ఏర్పడింది.


సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ మొదలైన వారందరూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా... బుర్రా సాయిమాధవ్ మాటలను అందిస్తున్నారు.


అమీర్ ఖాన్ కూడా ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా పాత్రలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం కసరత్తు కూడా మొదలుపెట్టారు. 1994లో హాలీవుడ్‌లో విడుదలైన టామ్ హాంక్స్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.    


                                                                                                                                                      


ఇవి కూడా చదవండి


కొరటాల దర్శకత్వంలో చిరంజీవి.. త్వరలో షూటింగ్ ప్రారంభం..


మంచుకొండ‌ల్లో మెగాస్టార్ హాలిడే.. విరామాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి దంపతులు..!


మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న మ‌రో హీరో.. వైష్ణ‌వ్ తేజ్..!