నిజమైన ప్రేమంటే కొట్టే స్వేచ్ఛ ఉండాలి : దర్శకుడు సందీప్ వంగా వివాదాస్పద వ్యాఖ్యలు..!

నిజమైన ప్రేమంటే కొట్టే స్వేచ్ఛ ఉండాలి : దర్శకుడు సందీప్ వంగా వివాదాస్పద వ్యాఖ్యలు..!

కబీర్ సింగ్(kabir singh) .. తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం రెండు వందల కోట్ల మార్జిన్ దాటి షాహిద్ కపూర్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే కమర్షియల్‌గా సక్సెస్ అయినా ఈ సినిమాపై విమర్శలు మాత్రం చాలా వస్తున్నాయి. ఆడవారిని నీచంగా చూపించారని ఎంతోమంది సినిమాపై విమర్శలు కురిపించారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ వంగా (sandeep reddy vanga) మొదటిసారిగా జర్నలిస్ట్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. సినిమాపై వస్తున్న విమర్శలు ఎందుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదు అంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూని మీరూ ఓసారి చూడండి.

కబీర్ సింగ్ సినిమాలో అమ్మాయికి ఇష్టం లేకుండానే తనని తాకేందుకు, తనని కొట్టేందుకు, ప్రేమించేందుకు సాహసించిన కబీర్ సింగ్‌ని గొప్పగా చూపించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అయినా సరే.. దర్శకుడు సందీప్ ఈ ప్రవర్తనలో ఏమాత్రం తప్పు లేనట్లుగా ఆ పాత్రను సమర్థించారు.

అంతేకాదు.. ఒకరినొకరు కొట్టుకునే హక్కు లేకపోతే ఇద్దరి మధ్యా ప్రేమ ఉన్నట్లే కాదని చెప్పడం విశేషం. సినిమాలో హీరో ప్రీతి పాత్రను కొట్టే సీన్ గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి అతడిని ఏ కారణం లేకుండా కొట్టింది. కనీసం కబీర్ కొట్టేందుకు ఓ కారణం అయితే ఉంది కదా.

మీరు మీ భాగస్వామిని కొట్టలేకపోతే.. మీకు నచ్చిన చోట ముట్టుకోలేకపోతే, ముద్దు పెట్టలేకపోతే అక్కడ ప్రేమ ఉన్నట్లు నేను అనుకోను.. అని చెప్పాడు. అంతేకాదు.. తన సినిమాపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ ఈ విమర్శలన్నీ అబద్ధాలే.. ఓ లావుపాటి వ్యక్తి నా సినిమాకి రివ్యూ రాసి కేవలం రెండు పాయింట్లు ఇచ్చాడు. కానీ అభిమానులు రెండు వందల కోట్లు ఇచ్చారు అని చెప్పడం విశేషం.

కబీర్ సింగ్ మూవీ రివ్యూ - హిందీలోనూ తన సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగ ..!

అంతేకాదు.. ఇలాంటి వ్యక్తులు సినిమాలపై పరాన్నజీవుల్లా జీవిస్తారని.. ఇండస్ట్రీకి అతిపెద్ద ముప్పని చెప్పుకొచ్చాడు. ఆ క్రిటిక్స్ ఎప్పుడూ ప్రేమను సరైన రీతిలో ఫీలవ్వలేదేమో అంటూ చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. హీరో క్లాస్ రూంలోకి వచ్చి ప్రీతిని తన గర్ల్ ఫ్రెండ్‌గా చెప్పే సీన్ గురించి కూడా సందీప్ తన అభిప్రాయాన్నే వెనుకేసుకొచ్చాడు. నాకైతే ఇందులో తప్పేమీ కనిపించడం లేదు. మనం రెండు వేల మంది ముందు పెళ్లి చేసుకొని అదేగా నిరూపించాలనుకుంటాం అని చెప్పాడు.

అంతేకాదు.. ఇష్టం లేకుండా ముట్టుకోవడం వంటి విషయాలను అంత నార్మల్‌గా ఎలా చూపిస్తారని అడిగితే సినిమాని సినిమాలా చూడాలి. అయితేనేం కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి లాంటి భర్త కావాలని కోరుకునే అమ్మాయిలను నేను చాలామందిని చూశాను అంటూ చెప్పడం గమనార్హం. ఈ వీడియోకి మిక్స్‌డ్ రియాక్షన్లు రావడం విశేషం. చాలామంది సందీప్ రెడ్డి వంగకి ప్రేమ గురించి తెలీదని చెబుతుండగా.. కొందరు మాత్రం ఆయన మాటలను వెనకేసుకొస్తున్నారు.

అయితే చెంపపై కొట్టడం, ఇష్టం లేకుండా తాకడం.. ఒకమ్మాయిని మనం హింసించడం కిందకే వస్తుంది. తనకు ఇష్టం లేకుండా అమ్మాయిని ముట్టుకునే హక్కు ఎవరికీ లేదు. అది ప్రేమికుడైనా, భర్తైనా.. అంతేకాదు.. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై మరొకరు ప్రేమలో ఉన్నారంటే వారిద్దరికీ ఒకరంటే మరొకరికి గౌరవం కూడా ఉండాలి. గౌరవం ఉన్న చోటే ప్రేమ కూడా ఉంటుంది. అలా గౌరవించే వ్యక్తులు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం ఎప్పటికీ చేయరు. అలా చేసేది ప్రేమ అనిపించుకోదు.

ఇదే విషయాన్ని చెబుతూ చాలామంది సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సందీప్ తిరిగి స్పందిస్తూ నేను హింసను ప్రేరేపించట్లేదు. కానీ ఇద్దరు వ్యక్తులు ప్రేమలో మునిగిపోయినప్పుడు తమలోని చెడును కూడా అవతలి వ్యక్తికి చూపించేందుకు వాళ్లు భయపడరు. హింస గురించి నేను మాట్లాడలేదు. తమ భావాలను ప్రకటించే స్వేచ్ఛ గురించి మాట్లాడాను. అది కేవలం ఒకరికే కాదు.. ఇద్దరికీ వర్తిస్తుంది.. అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం.

అందాల నటి సమంత ఈ ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చాలా డిస్బర్బింగ్ గా ఉన్నాయి ఈ మాటలు అంటూ పోస్ట్ చేసింది. గతంలో అర్జున్ రెడ్డి సినిమా బాగుందంటూ ఆమె పోస్ట్ చేసిన ట్వీట్ ని ఈ పోస్ట్ ని పక్కపక్కన పెట్టి కొందరు అభిమానులు ఆమెను అడగ్గా.. తను ట్విట్టర్ లో సమాధానం అందించింది. అర్జున్ రెడ్డి అనేది ఓ వ్యక్తి కథ. అతడు ఎలా అయినా ఉండొచ్చు. అది సినిమా. నిజ జీవితం కాదు. కానీ నిజ జీవితంలో ప్రేమంటే ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ ఉండడం అని ఆయన చెప్పిన మాటలను నేను వ్యతిరేకిస్తున్నా అంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది సామ్.

పెళ్లి తర్వాత నాకు సినిమా ఆఫర్లు తగ్గాయి : సమంత

గాయని చిన్మయి కూడా దీనిపై స్పందించారు. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మీపై చెయ్యి ఎత్తడానికి ఎప్పుడూ ధైర్యం చేయడు. మిమ్మల్ని కొట్టడమే కాదు.. మీకు నచ్చకుండా మిమ్మల్ని ముట్టుకోడు కూడా. అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా దెబ్బలు తినడం ప్రేమకు, క్రమశిక్షణకు సంకేతం కానే కాదు.. ఇది హింస మాత్రమే. నేను కూడా ప్రేమలో ఉన్నా. నా భర్త కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ తను దాన్ని నిరూపించుకోవడానికి నన్ను కొట్టాల్సిన అవసరం లేదు.

అమ్మాయిలు ఇలాంటి హింస పెట్టే అబ్బాయిలతో కలిసి ఉంటున్నారు. ఎందుకంటే ముందు కొట్టి తర్వాత వాళ్లే ఆ గాయాలు తగ్గేలా సహాయం చేస్తుంటారు. దాన్నే వాళ్లు ప్రేమనుకుంటారు. ఇలాంటి ఇళ్లలో పెరిగిన పిల్లలు కూడా అదే ప్రేమనుకొని అలాగే తయారవుతున్నారు. కానీ అది నిజంగా ప్రేమ కాదు.. అంటూ చిన్మయి వరుస ట్వీట్లు చేసింది.

 

చిన్మయి వ్యాఖ్యలపై స్పందిస్తూ యాంకర్, నటి అనసూయ డియర్ స్ట్రాంగ్ వుమన్ చిన్మయి గతంలోనే నేను ఈ వ్యక్తి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు, తీసిన సినిమా గురించి అతడికి వ్యతిరేకంగా పోరాటం చేశాను. అప్పుడు నాకు మీ సపోర్ట్ రాకపోవడం నన్ను బాధించింది. కనీసం ఇప్పుడైనా తన గురించి గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నా. ప్రేమంటే గౌరవం. అంతే.. అంటూ పోస్ట్ చేసింది.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా దీనిపై స్పందించింది. సినిమా అంటే సినిమానే.. కానీ నిజ జీవితంలో హింసను సమర్థించడం ఏంటి? మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే తనని కొట్టే హక్కుండాలనడం ఏంటి? ఈ వ్యక్తికి హింస లేకుండా ప్రేమ ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటూ ట్వీట్ చేసింది.

పెళ్లైన వారి కంటే.. సింగిల్‌గా ఉండేవారే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారట.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటి కుబ్రా సేట్ దీనిపై స్పందిస్తూ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. అది మీరే చూసేయండి.

ప్రేమ అంటే గౌరవం ఉండడమని.. ఒకవేళ ప్రేమంటూ ఎవరైనా వ్యక్తి తమను కొట్టేందుకు ప్రయత్నించడం లేదా ఇష్టం లేకుండా తాకడం వంటివి చేస్తే ఎముకలు విరగ్గొట్టి.. తన నుంచి దూరమవుతానని చాలామంది అమ్మాయిలు చెప్పడం ద్వారా ఈతరం అమ్మాయిలు ప్రేమ విషయంలో ఏం కోరుకుంటున్నారో తెలుస్తోంది.

2018లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసకు గురవుతోంది. 27 శాతం మంది మహిళలు పదిహేనేళ్ల వయసు నుంచే హింసకు గురవుతున్నారు. కేవలం పల్లెల్లోనే కాదు.. నగరాల్లోనూ ఈ పరిస్థితే కొనసాగుతోందట. ఇలాంటి దేశంలో ఆడవాళ్లపై హింసను ప్రేరేపించేలా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సినిమాలు తీయడం.. దాంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.