దొరసాని (Dorasani) అనే డిఫరెంట్ టైటిల్‌తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) – జీవిత, డాక్టర్ రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్‌లను (Shivatmika) హీరో-హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు దర్శకులు కేవీఆర్ మహేంద్ర. ఈ సినిమా ట్రైలర్.. ఇప్పటికే సగటు సినీ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈ క్రమంలో ఈ రోజే ‘దొరసాని’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
దొరసాని ట్రైలర్ టాక్ – ప్రేమ కూడా ఒక ఉద్యమమే..!
ఇంతకి ‘దొరసాని’ సినిమా కథేంటి అంటే..
(Dorasani Movie Review)
ఇది 30 ఏళ్ళ క్రితం వరంగల్ జిల్లాలోని జయపురం అనే గ్రామంలో జరిగిన కథ. ఆ గ్రామంలో ఉండే దొర కూతురు చిన్న దొరసాని (దేవకి) దసరా సెలవులకి ఊరికి వస్తుంది. అదే సమయంలో అదే ఊరిలో సున్నాలు వేసుకునే కూలోని కొడుకు రాజు కూడా సెలవులకి వస్తాడు. ఆ సమయంలో అనుకోకుండా వీరి మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? దాని పర్యవసానాలేమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
దొరసాని, రాజుల నటన ఎలా ఉందంటే –
శివాత్మిక, ఆనంద్ దేవరకొండలకి ఇది తొలిచిత్రమే అయినప్పటికి నటనలో పరిణితి బాగానే కనిపిస్తుంది. పైగా ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి.. సంభాషణలన్నీ ఆ ప్రాంత మాండలికంలోనే ఉంటాయి. అయినా సరే.. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమ శక్తి మేరకు అదే మాండలికంలో డైలాగ్స్ చెప్పడానికి ప్రయత్నించారు. అందులో కొంతమేర సక్సెస్ అయ్యారు కూడా.
ఇక వీరిద్దరి గురించి చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే – తొలిచిత్రానికే ఇటువంటి కథాంశాన్ని ఎంచుకోవడానికి సాహసించడం. తద్వారా మంచి కథలకి ప్రాధాన్యమివ్వడం. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రలు పోషించిన వినయ్ వర్మ, శరణ్య ప్రదీప్, కిషోర్‌లు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక రాజు స్నేహితులుగా నటించిన ముగ్గురు నటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు.
దొరసాని చిత్రాన్ని ఎలా తెరకెక్కించారంటే..!
ముందుగా ఈ చిత్రానికి రచయిత, దర్శకుడిగా పరిచయమైన కేవీఆర్ మహేంద్రని ప్రశంసించాలి. 30 ఏళ్ళ క్రితం నాటి తెలంగాణ ప్రాంత గ్రామీణ కట్టుబాట్లు, దొరల పెత్తనం, నక్సలిజానికి జనాలు ప్రభావితమవడం, పరువు హత్యలు వంటి అంశాలని ఒకే కథలో మిళితం చేసిన తీరు ఒకరకంగా సవాలనే చెప్పాలి. అదే సమయంలో విభిన్న అంశాలున్న చిత్రానికి.. ఇద్దరు కొత్త నటీనటులని తీసుకోవడం ఇంకొక సాహసం.
ఇక ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంభాషణల గురించి. ఈ ట్రైలర్‌లో మనకి కనిపించిన – “కదిలించావు నన్నే గుండెని మీటి.. కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి” వంటి భావోద్వేగ వాక్యాలతో పాటు.. మరికొన్ని చక్కటి సంభాషణలు చిత్రంలో కనిపిస్తాయి. “దొర పోయినా.. దొర రక్తం మారదు” వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. అయితే దర్శకత్వం విషయానికి వస్తే, సినిమా రెండవ భాగంలో కాస్త సాగదీత కనిపిస్తుంది.
హైదరాబాద్ – సికింద్రాబాద్ బోనాలు 2019: జాతరలో భక్తులు సందర్శించే 6 టెంపుల్స్
అయితే దర్శకుడు చెప్పాలనుకున్న అంశం మాత్రం క్లైమాక్స్‌లో బాగా చూపించగలిగాడు. ఈ సినిమాకి పతాక సన్నివేశాలు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే పాత్రల స్వభావం తెలిసేది అక్కడే కాబట్టి. ఈ చిత్రం ఆర్థికంగా ఎన్ని లాభాలు తీసుకొస్తుందో చెప్పలేం కానీ.. పడిన శ్రమకు మాత్రం మంచి మార్కులే సంపాదించాడు దర్శకుడు.
సాంకేతికంగా ‘దొరసాని’ ఎలా ఉందంటే –
ఛాయాగ్రాహకుడిగా సన్నీ కూరపాటి కెమెరాపనితనం చాలా బాగుంది. 30 ఏళ్ళ నాటి పరిస్థితులకి తగ్గట్టుగా మూడ్ క్రియేట్ చేయగలిగాడు. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ డిజైన్ గురించి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. మనకి తెరపైన కనిపించేవి ఆ కాలపు నేటివీటికి దగ్గరగా ఉండాలి. ప్రధానంగా గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్‌ని కథలో భాగంగా చూపడం బాగుంది.
సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పవచ్చు. అందులోనూ నేపధ్యసంగీతం ఈ సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలన్ని ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకున్నాయి. దొరసాని చిత్రాన్ని నిర్మించిన మధుర శ్రీధర్, యష్ రంగినేనిల సినిమా అభిరుచి ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది.
ఆఖరుగా.. తెలంగాణా గడీలో పుట్టిన “ప్రేమ పువ్వు” ఈ చిత్రం.