"నన్ను బ్యాన్ చేయండి" - జర్నలిస్టులని స్వయంగా కోరిన కంగనా రనౌత్

"నన్ను బ్యాన్ చేయండి" - జర్నలిస్టులని స్వయంగా కోరిన కంగనా రనౌత్

కంగనా రనౌత్ (Kangana Ranaut) - ఈ పేరు చెప్పగానే గొప్ప నటి, స్వయంకృషితో ఎదిగిన కథానాయిక అని ఆమె అభిమానులు చెబుతారు. కానీ అదే స్థాయిలో ఆమెపై వస్తున్న వివాదాల గురించి  కూడా చెప్పుకోవాలి. ఆమె ముక్కుసూటితనం  ఆమెకి కెరీర్‌కి ఎంత పాజిటివ్ అయ్యిందో.. అంతే నెగటివ్ కూడా అయ్యింది. 

'ఓ బేబీ' హిందీ రీమేక్‌లో.. అలియా భట్ లేదా కంగనా రనౌత్?

తాజాగా కంగన తన చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా' (Judgmental Hai Kya) ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ ప్రెస్ మీట్‌లో ఒక విలేకరి ఆమెని సినిమా గురించి ప్రశ్నించగా, ఆమె జవాబు తన తలబిరుసుతనాన్ని అందరికీ చెప్పకనే చెప్పింది. దీనితో కంగనా రనౌత్ వ్యవహరించిన తీరు పట్ల అక్కడి జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు జర్నలిస్ట్‌కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివాదం కాస్త ముదురుతోంది అని అనిపించగానే.. అక్కడే ఉన్న సినిమా నిర్మాత ఏక్తా కపూర్ విలేకర్లకు సర్ది చెప్పారు. 

ఇక కంగన వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని... ఆమె సదరు విలేకరికి భేషరతుగా క్షమాపణ చెప్పితే తప్ప ఆమెని మీడియా కవర్ చేయదు అని "ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ అఫ్ ఇండియా" ఒక స్టేట్ మెంట్‌ని విడుదల చేసింది. దానికి కంగనా రనౌత్ ఓ వీడియో ద్వారా తన స్పందనని తెలియచేశారు.

ఆ వీడియోలో ఆమె ఇలా తెలిపారు - "మీడియాలో మంచి వారు.. అలాగే చెడ్డ వారు కూడా ఉంటారు. చెడ్డవారి విషయానికి వస్తే నా గురించి,  నా సినిమాల గురించి వారు పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తున్నారు. అదే సమయంలో వారంతా డబ్బుకి అమ్ముడుపోయే రకాలు మరియు దేశద్రోహులు. అసలు జర్నలిస్ట్‌గా పనిచేసే అర్హత లేని వారు" అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

"అలాంటి వారు నన్ను దయచేసి బ్యాన్ చేయాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే నా పై వార్తలు రాసి.. వాటితో వచ్చే డబ్బుతో మీ ఇల్లు గడవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరంతా ఉచితంగా భోజనం చేసి వెళ్ళడానికే ప్రెస్ మీట్స్‌కి వస్తుంటారు, మీరు 50,60,70 రూపాయలకి అమ్ముడుపోతారు' అంటూ కంగన స్పందించారు. 

ఈ రెండు వీడియోలను కంగన సోదరి.. రంగోలి ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలను పోస్ట్ చేశాక,  కంగనా రనౌత్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పదని ఆమె స్పష్టం చేసింది.

మీరు నన్ను భయపెట్టలేరు - 'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండ

దీనికన్నా ముందు, జులై 7వ తారీఖున సినిమా పాటల విడుదల కార్యక్రమంలో జరిగిన వివాదానికి తమ నిర్మాణ సంస్థ ద్వారా క్షమాపణ తెలుపుతున్నట్టుగా ఏక్తా కపూర్ ఓ లేఖను విడుదల చేశారు. అదే లేఖలో ఒక్క నటి పై ఉన్న కోపాన్ని సినిమా మొత్తం పైన చూపడం భావ్యం కాదని, ఒక సినిమా పై ఎందరో జీవితాలు ఆధారపడి ఉంటాయని, దయచేసి ఆలోచించండని పేర్కొన్నారు.

తర్వాత మీడియా వ్యక్తులు కొందరు  మాట్లాడుతూ.. తమ వ్యతిరేకత కంగన మాట్లాడిన తీరు పట్లే తప్ప .. చిత్రం  లేదా యూనిట్ పైన తమకి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ వివాదం ఎలా ముగుస్తుందో? ఈ వివాదం వల్ల 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనుందో అన్నది వేచి చూడాలి.

ఇక ఈ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి కథని అందించిన కనికా థిల్లాన్ ... ప్రకాష్ భార్య కావడం విశేషం. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్‌తో పాటుగా  నటుడు రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. జులై 26 తేదిన 'జడ్జ్ మెంటల్ హై క్యా' చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. 

మిస్టీరియస్ ఫీలింగ్ కలిగించిన.. అడివి శేష్, రెజీనాల "ఎవరు" ఫస్ట్ లుక్..!