ఏం సాధిద్దామనుకుంటున్నావ్ రిషి? అని అడగ్గానే – ఏలేద్దామనుకుంటున్నాను సర్… ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సర్!!
ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తాజా చిత్రం మహర్షి (Maharshi) చిత్రం ట్రైలర్ ప్రారంభంలో వినిపించే తొలి డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ చాలు.. మహర్షిలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండనుందో చెప్పడానికి. ఇలా ఒక డైలాగ్ ద్వారా రిషి పాత్ర ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.
దీనికి తోడు టీజర్‌లో ఒక బిజినెస్ మ్యాన్ లుక్ లో కనిపించిన మహేష్ బాబు లుక్‌ని ట్రైలర్‌లో కూడా మరింత అందంగా చూపించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ ట్రైలర్‌లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.
ఆ తర్వాత ‘సక్సెస్‌కే ఒక ఎగ్జామ్‌పుల్‌గా మారిన మీ గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు సక్సెస్‌ని గుర్తించేదెలా?‘ అనే డైలాగ్ కి సమాధానంగా – గతం! గతంలో మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? అన్నదాన్ని బట్టి మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది తెలిసిపోతుంది… అంటూ రిషి ఇచ్చే సమాధానం వింటే.. ఆ పాత్రపై మనకు ఓ స్పష్టత వస్తుంది.
అంతేనా.. అతను జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నాడు? ఎలా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు.. వంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా మనం ఊహించుకోవచ్చు. కేవలం ఇవే కాదు.. ఈ చిత్రంలో ప్రతి పాత్ర పలికే సంభాషణలు చాలా సరళంగా ఉంటూనే.. క్యారెక్టర్ లోతుని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేస్తాయి. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని కూడా పెంచే విధంగా సాగుతాయి.
అలాంటి కొన్ని డైలాగ్స్ ఒకసారి మీరు ఓసారి ఇక్కడ చదివేయండి…
ఓడిపోతామన్న భయంతో ఆటలోకి దిగితే… ఎప్పటికీ గెలవలేం!
ప్రశ్న – జీవితంలో గెలవడమంటే సంపాదించడమేనా?
మహేష్ బాబు- ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలాగే మిగిలిపోతాను!
ఓడిపోవడమంటే నాకు భయం.. ఆ భయంతోనే ఇక్కడవరకు వచ్చాను.
ఈ సంభాషణల బట్టి మహర్షి చిత్రంలో రిషి పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్‌లో ఇలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో పాటుగా ఆఖరుగా – ఇదే కథ… ఇదే కథ నీ కథ… ముగింపు లేనిదై సాగదా సదా! అంటూ సాగే పాట మనకు వినిపిస్తుంది. అయితే ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు పొలంలో దిగి నాగలి పట్టి దున్నడం, రైతులతో కలిసి పని చేయడం.. వంటి సన్నివేశాలను చూపించాడు దర్శకుడు.
ఈ ట్రైలర్ మొత్తం చూస్తే.. జీవితంలో సక్సెస్ కోసం దూసుకుపోయే ఒక వ్యక్తి.. చివరికి అసలైన సక్సెస్‌ను ఎలా చవిచూస్తాడో అన్న ఉత్సుకతకు ప్రేక్షకుడు లోనవుతాడు. మరి, నిజంగా సినిమాలో కూడా ఇదే కథ మనకు కనిపిస్తుందా?? లేక వేరే ఏదైనా ట్విస్ట్ ఉంటుందా?? అనేది ఈ నెల 9వ తారీఖున మహర్షి చిత్రం విడుదలయితే కానీ తెలియదు.
ఇక ఈ ట్రైలర్ చూశాక మహర్షి చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ముఖ్యంగా ఛాయాగ్రాహకుడిగా చేసిన మోహనన్ (Mohanan) గురించి ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ చిత్రంలో మనకి కనిపించే విజువల్స్ అత్యద్భుతంగా ఉండడమే కాకుండా కథని మనకి తెరపైన అందంగా చూపించడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.
నేపధ్య సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) మరోసారి తనదైన మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర ని ఈ ట్రైలర్ ద్వారా మనకు వినిపించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ చిత్రాన్ని చాలా పకడ్బందీగా రూపొందించినట్లు తెలుస్తుంది. ముగ్గురు నిర్మాతలు – దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీలు మహర్షిని చాలా భారీ వ్యయంతో నిర్మించారు.
ఇవి కూడా చదవండి
సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!
మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!
నా ముద్దు “ఆ” యువ హీరోకే: జాన్వీ కపూర్