ట్యాటూ (Tattoos).. ఈ జనరేషన్‌కు ప్రత్యేకించి పరిచయం అవసరం లేని పదం. కొందరు వారి సెంటిమెంట్స్ లేదా బాగా ఇష్టమైన వాక్యాలను ట్యాటూగా వేయించుకుంటే ఇంకొందరు అమ్మ, నాన్న.. అంటూ సింపుల్‌గా ట్యాటూ వేయించుకొని తమ ప్రేమను చాటుతూ ఉంటారు.
అయితే కొందరు అమ్మాయిలకు ట్యాటూ వేయించుకోవాలని విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కడ వేయించుకోవాలి అనే విషయంలో తెగ తికమకపడుతూ ఉంటారు. కాసేపు చేతి మీద వేయించుకుందామని అనుకుంటే; ఇంకాసేపు మెడ వద్ద లేక నడుం వద్ద వేయించుకుందామని ఆలోచిస్తారు.
కానీ ట్యాటూ వేయించుకోవడానికి సరైన ప్రదేశం ఏదనే విషయంలో మాత్రం ఒక స్పష్టత తెచ్చుకోలేరు. అలాంటి వారి కోసమే మేం ఇక్కడ కొన్ని సలహాలు ఇస్తున్నాం. ఇంతకీ అవేంటో తెలుసా?? మన వెండితెర ముద్దుగుమ్మలు (Movie stars) కూడా ఇలా రకరకాల ట్యాటూలతో పలు సినిమాల్లో మెరిసినవారే.
అయితే వీరిలో కొందరు మాత్రం రియల్ లైఫ్‌లో కూడా ట్యాటూ వేయించుకున్నారు. మరి, వారు వేయించుకున్న ట్యాటూలు, అవి ఉన్న ప్రదేశాలను మీరు కూడా చూస్తే మీరు వేయించుకోవాలనుకుంటున్న ట్యాటూ విషయంలో ఓ స్పష్టత రావచ్చేమో.. ఓసారి ట్రై చేసి చూడండి.
ట్యాటూ వేసుకున్న టాలీవుడ్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన క్యూట్ బ్యూటీ సామ్ నుంచే మొదలుపెట్టాలి. మనసిచ్చి, మనువాడిన సామ్, చైతూ తమ ప్రేమకు నిదర్శనంగా..
ఇరువురి చేతులపైనా బాణం గుర్తులను ట్యాటూగా వేయించుకున్నారు. సమంత కుడి చేతి మణికట్టు దగ్గర ఈ ట్యాటూని మనం చూడవచ్చు. ఇది సింపుల్‌గా ఉంటూనే ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.
త్రిష.. తెలుగు, తమిళ సినీపరిశ్రమల్లో తన సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ కూడా తన ఎడమచేతి బొటనవేలు కింది ప్రాంతంలో ఒక ట్యాటూ వేయించుకుంది. అది ఒక చిన్న డిజైన్.
తండ్రి వారసత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న శృతిహాసన్‌కు కూడా ట్యాటూ వేయించుకోవడం అంటే చాలా ఇష్టం, ఆమె మొట్టమొదట తన పేరుని తమిళంలో ఎడమ భుజం వెనుక భాగంలో ట్యాటూగా వేయించుంది. అలాగే ఎడమ చేతి మణికట్టు దగ్గర కూడా ఒక పువ్వును ట్యాటూగా వేయించుకుంది.
తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించడంతో పాటు, ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతోంది సంజనా గల్రానీ. ఆమె కూడా నెవర్ గివప్ అనే పదాలను కుడిచేతి మణికట్టు వద్ద ట్యాటూగా వేయించుకుంది.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే దీపికా పదుకొణె తన కాలిపై వేయించుకున్న ఒక అందమైన మోటిఫ్ గురించి మనం చెప్పుకుని తీరాలి. ఎందుకంటే అది కేవలం చక్కని డిజైన్ మాత్రమే కాదు. అందులో తన పేరుని డిపి అనే అక్షరాలతో ట్యాటూగా వేయించుకుందీ అందాల సుందరి.
దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటిన సోనాక్షి సిన్హా ఎంత స్టైలిష్‌గా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందాన్ని మరింత పెంచి చూపించే విధంగా మెడకు కింది భాగంలో కుడివైపు ఒక స్టార్‌ని ట్యాటూగా వేయించుకుందీ భామ.
గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రపంచ సుందరి సైతం ఒక సింపుల్ ట్యాటూ ద్వారా తన తండ్రిపై ఉన్న ప్రేమను అందరికీ చాటి చెప్పింది. కుడి చేతి మణికట్టు వద్ద డాడీస్ లిల్ గర్ల్ అని ట్యాటూ వేయించుకున్న పీసీ దాదాపు చాలా ఫొటోల్లో అది చక్కగా కనిపించేలా జాగ్రత్తపడుతుంది.
బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ జాబితాలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే కంగనకు కూడా ట్యాటూ ఉందండోయ్. అయితే ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
ఎందుకంటే ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎంతో ముచ్చటపడి మెడ వెనుక భాగంలో ఆ ట్యాటూ వేయించుకున్నప్పటికీ.. అది కంగనకు అంతగా నప్పలేదు. అందుకే ఆమె చాలా వరకు తన డ్రస్సింగ్‌తో దానిని కవర్ చేసేస్తూ ఉంటుంది.
చూశారుగా.. కొందరు వెండితెర ముద్దుగుమ్మలకు ఉన్న అందమైన ట్యాటూలు.. వీరే కాదు.. తాప్సీ, ప్రియమణి, శిల్పాశెట్టి, సిమ్రన్, ఖుష్బూ, నయనతార.. తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
మరి, వీరిని ప్రేరణగా తీసుకొని మీరు కూడా మీకు నచ్చిన ట్యాటూని అందంగా వేయించుకొని అందరి దృష్టినీ ఆకర్షించండి. కానీ జాగ్రత్త సుమా..! శాశ్వతంగా ఉండే ట్యాటూలు కాకుండా తాత్కాలికంగా ఉన్నవి వేయించుకుంటే మంచిది.
ఇవి కూడా చదవండి
పొట్టి వారే.. కానీ ఆత్మస్థైర్యంలో గట్టివారు..!
హైదరాబాద్ మెట్రో రైల్.. ఓ అమ్మాయి అనుభవం..!
ఆలుమగల ఆనంద దాంపత్యానికి అద్దం పట్టే.. అద్భుత చిత్రాలు..!