కైలాసం బాలచందర్ అలియాస్ కె.బాలచందర్ (K.Balachander) దక్షిణాది చలనచిత్ర పరిశ్రమనే కాకుండా.. భారతదేశ చలన చిత్ర పరిశ్రమనే ప్రభావితం చేసిన గొప్ప దర్శకుడు. సామాజిక స్పృహ కలిగిన అతి కొద్ది మంది దర్శకులలో బాలచందర్ కూడా ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తన చిత్రాలలో మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసిన ఆయన, వైవిధ్యమైన కథాంశాలను, ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులను ఎంచుకున్నారు. సాధారణ మహిళల జీవిత సమస్యలను ఇతివృత్తాలుగానూ తీసుకున్నారు. తన చిత్రాలలో మహిళల పాత్రలను బలంగా తీర్చిదిద్దారు.
అలాంటి చిత్రాలే ఆయనకు అనేక అవార్డులను, రివార్డులను తీసుకొచ్చి పెట్టాయి. అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. సామాన్య జనుల జీవితాల నుండే ఆయన కథలు పుట్టుకొచ్చాయి. ఒక సగటు స్త్రీ ఆశలు, ఆశయాలు, ప్రేమలు, అభిమానాలే ఆయన కథా వస్తువులు. ఈ రోజు కె.బాలచందర్ జయంతి (జులై 9) సందర్భంగా మహిళాభ్యుదయమే ప్రధానంగా ఆయన తీసిన కొన్ని చిత్రాల పరిచయం మీకోసం
తొలి కోడి కూసింది – ఈ సినిమా కథ దేవుడమ్మ అనే ఓ యువతి చుట్టూ తిరుగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. దొరల ఏలుబడి నుండి విముక్తి పొందని గ్రామానికి చెందిన ఆమె వ్యవస్థపై ఏ విధంగా తిరుగుబాటు చేసింది? ఆ గ్రామంలో అన్యాయాన్ని ఏ విధంగా ప్రశ్నించి మార్పు తీసుకొచ్చిందనేది ఈ చిత్రకథ. నటి సరిత ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. 1981లో విడుదలైన ఈ చిత్రం నంది పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
స్త్రీల ఆత్మగౌరవానికి.. అభ్యున్నతికి పెద్దపీట వేసిన “కళా తపస్వి” చిత్రాలు..!
Idi Katha Kadu – Movie Poster (Wikipedia)
ఇది కథ కాదు – ఈ సినిమా సుహాసిని అనే ఓ నర్తకి చుట్టూ తిరుగుతుంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకొని.. ఆ తర్వాత పెద్దల ప్రోద్బలంతో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఓ శాడిస్టు అని తెలిశాక .. తన జీవితం తనకు నచ్చినట్లే ఉండాలని భావించి ఓ కఠిన నిర్ణయం తీసుకున్న యువతి కథ ఇది. మధ్యతరగతి మహిళల జీవితాలకు అద్దం పట్టే చిత్రం ఇది. 1979లో విడుదలైన ఈ చిత్రంలో జయసుధ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
K.Balachander, Rajinikanth, Jayaprada in “Antu Leni Katha” Shooting (Twitter)
అంతులేని కథ – కుటుంబ బాధ్యతలను అన్నింటినీ తన మీదే వేసుకొని.. సంసార నావను ఈదే ఓ సగటు ఉద్యోగిని సరిత కథ ఈ చిత్రం. తన కుటుంబం కోసం ఓ వైపు తన ఆశలను చంపుకుంటూ.. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ.. అన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చే సరిత.. ఆఖరికి తన చెల్లెలి కోసం తన ప్రేమను కూడా త్యాగం చేస్తుంది. ఈ చిత్రంలో జయప్రద ప్రధానపాత్రలో నటించగా.. 1976లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కథానాయిక అన్న పాత్రలో, తాగుడు వ్యసనానికి బానిసైన బాధ్యత లేని వ్యక్తిగా రజనీకాంత్ నటించారు.
మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార
Guppedu Manasu – Movie Poster (Wikipedia)
గుప్పెడు మనసు – ఒక వైవిధ్యమైన కథాంశంతో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. టీనేజీ బాలికలను మాయమాటలతో లోబరుచుకొనే నయవంచకుల మనస్తత్వాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తారు. తన చెల్లెలు దగాపడడానికి కారణం.. తన భర్తే అని తెలుసుకున్న ఓ అభ్యుదయ రచయిత్రి పడిన సంఘర్షణే ఈ చిత్రం. సుజాత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.
అయినా (హిందీ చిత్రం) – తమిళ చిత్రం ఆరంగేట్రంకి రీమేకైన ఈ చిత్రంలో రాజేష్ కన్నా, ముంతాజ్ నటించారు. తన కుటుంబ పరిస్థితులు బాగాలేకపోవడంతో.. సెక్స్ వర్కర్‌గా మారిన ఓ బ్రాహ్మణ యువతి కథ ఈ చిత్రం.
ఇలా చెప్పుకుంటూ పోతే బాలచందర్ సెల్యూలాయిడ్ పై ఆవిష్కరించిన నిజ జీవిత చిత్రాలెన్నో. ఆడవాళ్లు మీకు జోహార్లు, 47 రోజులు, కోకిలమ్మ, కల్కి, సింధు భైరవి.. ఇవన్నీ కూడా మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసిన చిత్రాలే. మరో చరిత్ర లాంటి ప్రేమకథా చిత్రాలతో పాటు.. ఆకలి రాజ్యం లాంటి సోషల్ మూవీస్ తీసిన బాలచందర్.. మహిళా చిత్రాల దర్శకుడిగా కూడా కొన్నాళ్లు తనదైన పంథాలో చిత్రాలు తీయడం గమనార్హం.
ఈ మేటి దర్శకుడి ప్రతిభకు పట్టం కట్టిన అవార్డులు కూడా అనేకం ఉన్నాయి. రెండు సార్లు జాతీయ సమగ్రతా పురస్కారమైన నర్గీస్ దత్ అవార్డును కైవసం చేసుకున్న బాలచందర్.. 1987లో పద్మశ్రీ కూడా పొందారు. తమిళ ప్రభుత్వం నుండి ‘కలైమామణి’ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకున్నారు. 2010 సంవత్సరానికి భారతప్రభుత్వం బాలచందర్‌కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును సైతం బహూకరించింది. దాదాపు 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలచందర్..డిసెంబర్ 23, 2014న కన్నుమూసారు. కానీ ఆయన చిత్రాలు మాత్రం చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉంటాయనడంలో సందేహం లేదు.
మహిళా క్రికెట్ నేపథ్యంలో.. తొలి తెలుగు సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’