మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార

మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి : నయనతార

"కొలైయుదిర్ కాలం" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధా రవి హీరోయిన్ నయనతారపై (Nayanthara) అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా మారాయి. తమిళ నటీనటులంతా ఈ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.


తమిళ నడిగర్ సంఘం సైతం ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ పార్టీ నుంచి రాధా రవిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన వ్యాఖ్యలకు నయనతార ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ ద్వారా రాధా రవిపై నిరసన తెలియజేశారు. దాని సారాంశం ఏంటంటే ..


‘నేను పెద్దగా మాట్లాడను. నేను చేస్తున్న పనే నా గురించి మాట్లాడాలని భావిస్తాను. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోంది. ఈ రోజు నా మీద ఒకరు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పడంతో పాటు మహిళల పై వివక్ష చూపిస్తున్నవారిపై నిరసన తెలియజేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.


వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసిన రాధా రవిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ధన్యావాదాలు.


మహిళలను కించపరుస్తూ మాట్లాడే పురుషులంతా.. రాధా రవితో సహా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.  మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరంతా వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను తక్కువ చేయాలని చూస్తున్నారు. ఇలా చేయడం గొప్ప అని భావిస్తున్నారు.


 రాధా రవి మంచి అనుభ‌వ‌జ్ఞులు, పెద్దవారు. ఆయన యువతరానికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా వారిని తప్పుదారి పట్టించకూడదు. ఇలా హీనంగా మాట్లాడకూడదు. మహిళలను వక్రబుద్ధితో చూడకూడదు. ప్రస్తుతం మహిళలు తమంతట తాము నిలదొక్కుకొనేందుకు చాలా కష్టపడుతున్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాధా రవి లాంటి వారు పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు.


ఇలాంటి అసహ్యకరమైన ప్రసంగానికి, మహిళలను కించ పరిచే మాటలకు చప్పట్లు కొడుతూ ఎలా నవ్వగలుగుతున్నారో తెలియడం లేదు. వివక్షాపూరితమైన మాటలకు చప్పట్లు చరిచేవారు ఉన్నంత కాలం మహిళలపై జోక్స్ వేస్తూనే ఉంటారు. నా అభిమానులను, ప్రజలను రాధా రవి చేసిన వ్యాఖ్యలకు అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వవద్దని కోరుతున్నా. మహిళలపై.. ముఖ్యంగా నాపై రాధా రవి చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా.


ఆ భగవంతుని దయ వల్ల నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా నేను నటించడం ఆపను. సీత, దేవత, దెయ్యం, స్నేహితురాలు, భార్య, ప్రేమికురాలు.. ఇలా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ నా అభిమానులను అలరిస్తూనే ఉంటా.


చివరిగా నడిగర్ సంఘానికి ఓ విన్నపం. సుప్రీం కోర్ట్ సూచించిన విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం నటీనటులతో  కూడిన ఓ ఇంటర్నల్ కంప్లైట్ కమిటీని ఏర్పాటు చేయండి.


మరొక్కసారి నాకు తోడుగా నిలిచిన వారందరికీ మన:పూర్వక కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నా.’ అని నయనతార సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన చేశారు.


క్షమాపణ చెప్పిన రాధా రవి: తన వ్యాఖ్యలపై రేగిన వివాదంపై స్పందించిన రాధా రవి.. నయనతారను కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు. ‘నా వ్యాఖ్యలు నయనతార, ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌కు బాధ కలిగించి ఉంటే దానికి నేను బాధపడుతున్నా. నా మాటల్లోని అంతరార్థాన్ని విఘ్నేష్ నా వద్దకు వస్తే వివరిస్తాను. లేదా నన్ను రమ్మన్నా సరే. నేనే తన దగ్గరకు వెళ్లి వివరణ ఇస్తాను’ అని అన్నారు. అంతేకాదు డీఎంకే నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.


నయనతారపై తమిళ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ఇక్కడ చదవండి.


ఇవి కూడా చదవండి:


రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?


మహిళా చైతన్యానికి మారుపేరు.. హైదరాబాద్ మహిళా పోలీసుల "విమెన్ ఆన్ వీల్స్"


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో మహిళలకు సంబంధించిన కథనాలు చదవచ్చు.