"మేము ఓటేశాం.. మరి మీరు ? " అంటున్న సెలబ్రిటీలు.. ఫొటోలతో అవగాహన కల్పించే యత్నం

"మేము ఓటేశాం.. మరి మీరు ? " అంటున్న సెలబ్రిటీలు.. ఫొటోలతో అవగాహన కల్పించే యత్నం

ప్రతి అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగ (Elections) రానే వచ్చేసింది. ఈ సారి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు (General Elections 2019) జరగనున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకి (Telugu States) సంబంధించి నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.


ఇక ఈ ఎన్నికల్లో పోలింగ్ (Polling) శాతం పెంచే పనిలో భాగంగా ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతిసారి అత్యల్ప ఓటింగ్ శాతం నమోదవుతుండగా.. దానిని ఈసారి ఎలాగైనా పెంచేందుకు తగు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ప్రముఖ ఫిలిం స్టార్స్ & సెలబ్రిటీల సహాయంతో ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు పలు యాడ్స్ కూడా రూపొందించింది.


అయితే ఇలా ప్రత్యేకమైన ప్రకటనల ద్వారానే కాకుండా.. పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా ఓటు హక్కు అనేది మనందరి ప్రాధమిక బాధ్యత అని.. దీనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే మనకు ప్రశ్నించే హక్కు ఉంటుందని అందరినీ చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక ఈరోజు ఉదయాన్నే పోలింగ్‌లో పాల్గొన్న సెలబ్రిటీల వివరాలు ఇలా ఉన్నాయి -


ఉదయమే అల్లు అర్జున్ (Allu Arjun) తన ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోగా; జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన భార్య ప్రణతి & తల్లి షాలినిలతో కలిసి జూబ్లీ హిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన, కూతురు సుష్మితతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకోగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తన ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మంచు మోహన్ బాబు (Mohan Babu) & విష్ణు తమ స్వగ్రామమైన రంగంపేటలో ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నారు.

వీరితో పాటుగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), ఎం.ఎం. కీరవాణి, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ్ వంటి సినీ ప్రముఖులు సైతం ఉదయాన్నే ఓటు వేసి.. ఇది మన అందరి బాధ్యత అంటూ సోషల్ మీడియా ద్వారా అందరికీ స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. ఇక ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఓటు విలువను తెలుపుతూ ..తాము ఓటు వేసినందుకు గుర్తుగా సిరా రాసిన వేలితో సెల్ఫీలు దిగారు. గుత్తా జ్వాల (Gutta Jwala) కుటుంబం, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), పీవీ సింధు మొదలైనవారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందరికి ఓటు హక్కు పైన అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.


చివరగా.. మనకి ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఎలాగైతే కల్పిస్తుందో.. అలాగే మనల్ని పరిపాలించే పాలకులను లేదా మన తరఫున ప్రాతినిధ్యం వహించే నాయకులను ఎన్నుకునే బాధ్యతను కూడా మనకే అప్పగించింది. కాబట్టి మన కనీస బాధ్యతల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది.. ఇకనైనా మీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలైనంత త్వరగా ముందడుగు వేయండి.. రానున్న ఐదేళ్లు ఎలా ఉండాలనే మీ నిర్ణయాన్ని మీ ఓటు ద్వారా వ్యక్తం చేయండి.


ఇవి కూడా చదవండి


జయలలిత జీవితంలో చివరి 75 రోజులు ఆధారంగా మరో బయోపిక్..!


ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!


అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన 'గీత గోవిందం' హీరోయిన్..!