ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) … తెలుగునాట ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్ని గొప్ప హిట్ సాంగ్స్ పాడారో.. తన గాత్రంతో ఎన్ని మధురమైన గీతాలకు ప్రాణం పోశారో అందరికీ అవగతమే. కాని ఆయన సంగీత దర్శకత్వం (Music Direction) వహించిన సినిమాల వివరాలు చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా… గాన గంధర్వుడు ఎస్పీ బాలు సంగీత దర్శకత్వం వహించిన పలు ముఖ్యమైన చిత్రాల జాబితా మీకోసం..!
తెలుగు, తమిళ, కన్నడ & హిందీ భాషల్లో కలిపి దాదాపు 23 చిత్రాలకి బాలు సంగీత దర్శకత్వం అందించగా వాటిలో జాతీయ అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డులు వరించిన చిత్రాలు కూడా ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఆ చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం –
* తూర్పు వెళ్ళే రైలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘తూర్పు వెళ్ళే రైలు. ఈ చిత్రం 1979లో విడుదల కాగా, ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వం వహించారు.
* హమ్ పాంచ్
ఈ చిత్రంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి కూడా బాపు దర్శకత్వం వహించగా.. హిందీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతైన బోనీ కపూర్ ఈ చిత్రం ద్వారానే నిర్మాతగా మారడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం హిందీ సంగీత దిగ్గజమైన లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో కలిసి బాలు అందించడం జరిగింది. తెలుగు చిత్రం “మన ఊరి పాండవులు” సినిమాకి.. ఈ చిత్రం అధికారిక రీమేక్.
* తుదిక్కుమ్ కారంగల్
తుదిక్కుమ్ కారంగల్ చిత్రంతో బాలసుబ్రహ్మణ్యం తమిళ చిత్రపరిశ్రమలోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. 1983లో ఈ చిత్రం తమిళనాట విడుదలైంది.
* ఊరంతా సంక్రాంతి
దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఊరంతా సంక్రాంతి చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం స్వరాలూ సమకూర్చడం జరిగింది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఏకైక చిత్రం ఇదే.
* మయూరి
క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం మయూరి. ఈ చిత్రంలో నాయిక పాత్రకి సుధా చంద్రన్‌నే నటిగా తీసుకోవడం విశేషం. ఎందరో విమర్శకుల ప్రశంసలతో పాటు.. అవార్డులు సైతం దక్కించుకున్న ఈ చిత్రానికి సంగీతం అందించే అదృష్టం బాలు గారికి దక్కింది. 1985లో ఈ చిత్రం విడుదల కావడం విశేషం.
* నాచే మయూరి
మయూరి చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయగా.. తెలుగు వెర్షన్‌కి సంగీతం అందించిన బాలసుబ్రహ్మణ్యం, ఈ చిత్రానికి మాత్రం కేవలం నేపధ్య సంగీతాన్ని మాత్రమే అందించడం విశేషం. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ “నాచే మయూరి” చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగింది.
* మగధీరుడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించడం జరిగింది. 1986లో విడుదలైన ఈ చిత్రంలో అయిదు పాటలని ఎస్పీబీ స్వరపరచడం జరిగింది.
* లాయర్ సుహాసిని
సుహాసిని ప్రాధాన పాత్రలో ఆమె పేరు పైనే వచ్చిన చిత్రం లాయర్ సుహాసిని. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం చేశారు. 1987లో విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి పేరు వచ్చింది.
* సౌభాగ్య లక్ష్మి
ఈ సౌభాగ్య లక్ష్మి చిత్రంతో బాలసుబ్రహ్మణ్యం తన సంగీత దర్శకత్వ ప్రస్థానాన్ని కన్నడ పరిశ్రమకి కూడా విస్తరింపచేశారు. తెలుగులో విడుదలైన కార్తీక దీపం చిత్రానికి ఇది కన్నడ రీమేక్ కాగా.. 1987లో ఈ చిత్రం విడుదలైంది.
* పడమటి సంధ్యారాగం
తొలిసారిగా ఒక విదేశీయుడు తెలుగు చిత్రంలో హీరోగా నటించిన చిత్రం పడమటి సంధ్యారాగం. అలాగే చిత్రంలో సింహభాగం అమెరికాలోనే చిత్రీకరించడం విశేషం. ఇన్ని విశేషాలు ఉన్న ఈ చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించగా.. జంధ్యాల దర్శకత్వం వహించారు.
* రాము
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘రాము’ చిత్రానికి సంగీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించడం జరిగింది. 1987లో విడుదలైన ఈ చిత్రాన్ని మూవీ మొఘల్ రామానాయుడు నిర్మించారు.
* నీకు నాకు పెళ్ళంట
పడమటి సంధ్యారాగం తరువాత జంధ్యాల తీసిన ఈ ‘నీకు నాకు పెళ్ళంట’ చిత్రానికి కూడా బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం అందించడం జరిగింది. 1988లో ఈ చిత్రం విడుదలైంది.
* రామన్న శామన్న
అంబరీష్ & రవిచంద్రన్‌లు హీరోలుగా నటించిన ‘రామన్న శామన్న’ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ చిత్రం 1988లో కన్నడలో విడుదలైంది.
* చిన్నోడు పెద్దోడు
రేలంగి నరసింహరావు దర్శకత్వం చేసిన చిన్నోడు పెద్దోడు చిత్రం 1988లో విడుదలైంది. ఈ చిత్రంలో హీరోలుగా రాజేంద్రప్రసాద్ & చంద్రమోహన్‌లు నటించగా, బాలు సంగీత దర్శకత్వం వహించారు.
* వివాహ భోజనంబు
జంధ్యాల కలం నుండి జాలువారిన మరో చిత్రం వివాహ భోజనంబు. ఈ చిత్రంలోని హాస్య సన్నివేశాలను ఎవరు మర్చిపోలేరు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని బాలసుబ్రహ్మణ్యం అందించడం జరిగింది.
* కళ్ళు
1988లో విడుదలైన కళ్ళు చిత్రం అనేక అవార్డులని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించి ఆలపించిన ‘తెల్లారింది లేవండోయ్’ అనే పాట ఇప్పటికి కూడా ఒక ఆణిముత్యమే. అటువంటి ఒక పాటకి స్వరాలు సమకూర్చింది బాలసుబ్రహ్మణ్యమే కావడం విశేషం.
* ఉలగమ్ పిరందాదు ఇనక్కగా
తమిళంలో 1990వ సంవత్సరంలో విడుదలైన ఉలగమ్ పిరందాదు ఇనక్కగా అనే చిత్రానికి నేపధ్య సంగీతాన్ని ఎస్పీ బాలు అందించారు. అయితే ఈ చిత్రానికి సంగీతాన్ని మాత్రం లెజెండ్ ఆర్డీ బర్మన్ అందించారు.
* తైయాల్కారన్
1991 లో వచ్చిన తమిళ చిత్రం తైయాల్కారన్. ఈ చిత్రానికి సంగీతం బాలు అందించగా.. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించడం జరిగింది.
* జైత్రయాత్ర
నాగార్జున కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం 1991లో విడుదల కాగా.. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలు సమకూర్చడం జరిగింది.
* సిగరం
బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం సిగరం. ఈ చిత్రం 1991లో విడుదలైంది. ఇక ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తునే బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించడం విశేషం.
* బెళ్ళీయప్ప బంగారప్ప
1992లో వచ్చిన కన్నడ చిత్రం బెళ్ళీయప్ప బంగారప్ప. ఈ చిత్రానికి సంబంధించి రచనా బాధ్యతలు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తీసుకోగా.. బాలసుబ్రహ్మణ్యం స్వరాలూ సమకూర్చడం జరిగింది.
* ముద్దిన మావ
తెలుగులో వచ్చిన మామగారు చిత్రానికి కన్నడ రీమేక్‌గా వచ్చిన చిత్రం ముద్దిన మావ. ఈ చిత్రం 1993లో విడుదలవ్వగా, బాలసుబ్రహ్మణ్యం స్వరాలని అందించడం జరిగింది.
* ఉన్నాయి చరణదయ్యిందేన్
ఇక 2003లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరగా సంగీతం అందించిన చిత్రం ఉన్నాయి చరణదయ్యిందేన్. ఈ చిత్రం 2003లో విడుదల కాగా బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ ఇందులో హీరోగా నటించడం జరిగింది. ఈ చిత్రం విషయంలో ఇదొక ఆసక్తికర అంశం.
ఇవి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే గాన గంధ్వరుడు.. తన సినీ కెరీర్‌లో స్వరాలు సమకూర్చిన చిత్రాల వివరాలు. ఆయన సంగీత ప్రస్థానం ముగింపు లేకుండా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా POPxo తెలుగు తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.
Featured Image: Facebook
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆసక్తికర ప్రకటన
సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” తో.. లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ..!
‘జెర్సీ’ చిత్రంలో మనల్ని కన్నీళ్లు పెట్టించే.. టాప్ 6 సన్నివేశాలు ఇవే..!