చాలామందికి తాము చేసే పనుల్లో అత్యంత ఇష్టమైనవి రెండే పనులుంటాయి. అందులో ఒకటి తిండి(Food) అయితే మరొకటి నిద్ర(Sleep). అవును.. ఎంత డబ్బున్నా.. ఏం చేస్తున్నా కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఈ రెండింటి కోసమే కదా..! తిండి గురించి కాసేపు పక్కన పెడితే నిద్ర మనకెంతో ప్రధానం. కొందరు వ్యక్తులకైతే అదంటే ప్రాణం. ఎంతిష్టం అంటే రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేరే పనులు చేస్తున్నా.. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి పడుకుందామా? అని ఆలోచిస్తూ ఉంటారు..
ఇంకొందరైతే కాస్త తీరిక దొరికితే చాలు..మనం ఎక్కడున్నాం అన్న విషయం కూడా మర్చిపోయి నిద్రపోతుంటారు. చుట్టూ ఉన్నవారికి ఇది కాస్త అసౌకర్యంగా అనిపించినా.. కంటి నిండా నిద్రపోవడం కూడా అదృష్టమే.. ఈ విషయాన్ని చెప్పేందుకే మార్చి 15న ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్ స్లీప్ డే)గా నిర్వహిస్తుంటారు. మరి, మీకూ ఇలా నిద్రంటే ప్రాణమైతే (Sleep lovers) మీకు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి చూద్దాం రండి..
1. రోజు ఉదయాన్నే ఎందుకు ప్రారంభమవుతుంది.. మధ్యాహ్నం మొదలైతే బాగుంటుంది కదా..
మధ్యాహ్నం అయితే ఇంకాస్త ఎక్కువ సేపు పడుకోవచ్చు. మరింత అందంగా మెరిసిపోవచ్చు.
2. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా, ఎలాగైనా పడుకోగలరు..
చాలామందికి రాత్రి బెడ్‌పై దొర్లితే కానీ నిద్రపట్టదు. కానీ మీకు మాత్రం ఎక్కడైనా ఇలా కూర్చుంటే చాలు.. నిద్ర పట్టేస్తుంది. కొందరైతే నిలబడి కూడా నిద్రపోతుంటారు.
3. నిద్ర కోసం చాలా పార్టీలు, ఇతర కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకుంటారు.
ఈ రోజు నా ఆరోగ్యం అంతగా బాలేదు. నేను పార్టీకి రాలేనని చెప్పి నిద్రపోతారు.
4. రాత్రి నిద్రపై ఆధారపడి మీ మరుసటి రోజు ప్లానింగ్ ఉంటుంది.
రాత్రి నుంచి ఉదయం వరకూ మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో లెక్కించుకొని తర్వాత రోజు మీ స్నేహితులతో ఎంత సమయం బయట ఉండాలో నిర్ణయించుకుంటారు. రాత్రి సరిగా నిద్రపోకపోతే కాస్త త్వరగా ఇంటికి వచ్చేసి మళ్లీ నిద్రపోవాల్సిందే.
5. సెలవురోజున బయటకు వెళ్లడం మీకు అస్సలే ఇష్టం ఉండదు..
సెలవురోజంటే చాలామంది షాపింగ్, సినిమా.. ఇలా బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. అలాగే అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలకు హాలిడేకి వెళ్లాలనుకుంటారు. కానీ మీరు మాత్రం ఇంట్లో ఓ చక్కటి బెడ్‌పై పడుకోవాలనుకుంటారు. మీకు కావాల్సిందల్లా చక్కటి వ్యూ ఉన్న గది. అందులో మెత్తని పరుపుతో ఉన్న బెడ్.. అప్పుడప్పుడూ తినడానికి కాస్త భోజనం.. దాన్ని ఆర్డర్ చేసుకోవడానికి యాప్స్ ఉన్నాయి కదా..!
6. భోజనం కోసం బెడ్ బయటకు వెళ్లడం మీకు నచ్చదు..
ఆర్డర్ చేసుకోవడం కాకుండా భోజనం కోసం వంట చేసుకోవాల్సి వచ్చి.. దాని కోసం మీరు బెడ్ దిగాలంటే.. మీకు బద్ధకం. నిద్ర కోసం ఓ రోజు ఏమీ తినకుండా పస్తులుండడం కూడా మీకు ఇష్టమే..
7. మెత్తని పరుపు, దిండు ఉంటే చాలు.. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.
ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆనందం కలుగుతుంది. కొందరికి నచ్చిన ఆహారం ఆనందాన్ని అందిస్తే.. మరికొందరికి వారికి నచ్చిన ప్రదేశాన్ని చూస్తే ఆనందమేస్తుంది. కానీ మీకు మాత్రం మెత్తని పరుపు, దిండ్లను చూస్తే ఎంతో ఆనందంగా వాటిపై పడిపోవాలనిపిస్తుంది.
8. మీకు చలికాలం అంటే ఎంతో ఇష్టం..
ఆ కాలంలో వాతావరణం బాగుంటుందని కాదు.. బయట చలిగా ఉంటే వెచ్చగా దుప్పటి కప్పుకొని బెడ్‌పై పడుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా.. అందుకన్నమాట.
9. కానీ ఉదయం మాత్రం నచ్చదు..
వేసవి కంటే శీతకాలం ఆలస్యంగా తెల్లారుతుంది. కాబట్టి.. అయితే ఆలస్యంగా నిద్రలేచి హడావిడి పడాలి… లేదా తెల్లవారక ముందే నిద్రలేవాల్సిందే..
10. రేపటికి అలారం అవసరం లేదంటే ఎంత ఆనందమో..
ఈ ప్రపంచంలో అన్నింటికంటే – రేపు ఉదయం అలారం పెట్టుకొని ఉదయాన్నే లేవాల్సిన అవసరం లేదన్న వార్త మీకు ఎక్కువగా ఆనందాన్ని అందిస్తుంది.
11. మీకు నచ్చిన సమయం అంటే మధ్యాహ్నం నిద్రపోయే సమయమే..
మధ్యాహ్నం నిద్రపోయే అవకాశం దొరికితే అంతకంటే మంచి రోజు మీకుండదు.
12. నైట్ పార్టీలు ఎందుకుంటాయో మీకు అర్థం కాదు..
ఈ పార్టీలు ఉదయం చేసుకోవచ్చు కదా.. రాత్రి నిద్ర చెడగొట్టుకొని మరీ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది?
13. వీకెండ్స్‌లో ఏం చేస్తావు? అంటే మీ సమాధానం ఒకటే..
అందరిలాగే మీరూ వారాంతం కోసం వేచి చూస్తారు. ఏదైనా కొత్త పని చేయడానికో.. ఎక్కడికైనా వెళ్లడానికో కాదు.. నిద్రపోవడానికి.. వారాంతాల్లో డిస్టర్బ్ చేసేవారితో మీరు స్నేహం చేయడం కూడా మానేస్తారు.
14. రాత్రుళ్లు ఎప్పుడూ బయటకు రావు.. అంటే మా ఇంటికే వచ్చేయండి ఇంట్లో పార్టీ చేసుకుందాం అంటారు..
నోరూరించే ఫుడ్, మంచి గాసిప్‌తో పాటు కంటి నిండా నిద్ర కూడా ఉంటుంది కదా.. అందుకే అది మీకిష్టం.
15. బెడ్ నుంచి బయటకు రావడం బ్రేకప్‌లా అనిపిస్తుంది.
ఉదయాన్నే లేవక తప్పని పరిస్థితి కానీ మీ బెడ్ నుంచి బయటకు రావడం మీకు నచ్చదు. ఇది మిమ్మల్ని, మీ బాయ్‌ఫ్రెండ్‌ని ఎవరో విడదీస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి.
మీరూ వర్క్ హోలిక్ అయితే ఇవి మీ జీవితంలోనూ జరుగుతుంటాయి..
మగాళ్లకు నెలసరి వస్తే.. ఎలా ఉంటుందో మీకు తెలుసా??
ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?