ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పొట్టి దుస్తులు వేసుకుంటే.. రేప్ చేయాల్సిందే: గుర్గావ్‌లో ఓ మహిళ షాకింగ్ స్టేట్‌మెంట్

పొట్టి దుస్తులు వేసుకుంటే.. రేప్ చేయాల్సిందే: గుర్గావ్‌లో ఓ మహిళ షాకింగ్ స్టేట్‌మెంట్

మన దేశంలో అమ్మాయిలకు తగినంత స్వేచ్ఛ, భద్రత… రోజు రోజుకీ కరువవుతోందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ ఆడపిల్లలను (Girls) అబ్బాయిల కంటే తక్కువగా చూసే సంఘటనలు కూడా జరగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నవారు తమ.. తోటి మహిళలైనా తమకు తోడుగా నిలుస్తారని కోరుకోవడం సహజం.

కానీ అలా తోటి మహిళలు తమకు తోడు నిలవాలని కోరుకోవడం కూడా తప్పని నిరూపించే.. సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే గుర్గావ్‌లో జరిగింది. గుర్గావ్‌కి చెందిన ఓ మధ్య వయస్కురాలు రెస్టరెంట్‌లో భోజనానికి వెళ్లిన అమ్మాయిలు పొట్టి దుస్తులు (Short dresses) వేసుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి అమ్మాయిలను రేప్ (rape) చేయాల్సిందే అంటూ అక్కడున్న మగవాళ్లకు హితవు పలికింది.

ఈ సంఘటన అసలు రేప్ కల్చర్ గురించి.. అమ్మాయిల స్వేచ్ఛకు మన దేశంలో ఉన్న విలువ గురించి తిరిగి చర్చించుకోవాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. అందుకే తొమ్మిది నిమిషాల పాటు సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారుతోంది.

ఈ వీడియోలో ఐదుగురు అమ్మాయిలు.. ఓ మహిళ వెనుక వెళుతూ.. ఆమె చేసిన కామెంట్లకు గాను క్షమాపణ చెప్పమని కోరడం కనిపిస్తుంది. రెస్టరెంట్లో పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలను చూసిన ఆమె.. “వారిని రేప్ చేయాల్సిందే” అంటూ తన అసహనాన్ని ఆమె వెళ్లగక్కడం గమనార్హం. తర్వాత ఆమె అక్కడి నుండి.. పక్కనే ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించింది. ఈ అమ్మాయిలు కూడా ఆమె వెనుకే వెళ్లి.. చేసిన నీచమైన కామెంట్లకు గాను క్షమాపణ చెప్పమని వాదించారు. కానీ తన మాటలకు ఏమాత్రం సిగ్గుపడని ఆ మహిళ తను మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించింది.

ADVERTISEMENT

ఈ సంఘటనకు సంబంధించిన వాదనలను విన్న మరో మహిళ ఆ అమ్మాయిలకు సపోర్టుగా మాట్లాడింది. “ఏ దుస్తులు వేసుకున్నారన్నది వారి ఇష్టం..  వారి తల్లిదండ్రులు కానంతవరకూ వారి దుస్తుల గురించి కామెంట్ చేయకూడదు.. అలాంటివి వేసుకోవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు..” అని ఆమె తెలిపింది.

అంతేకాదు.. తన కూతురు కూడా షార్ట్స్ వేసుకుంటుందని.. జనరేషన్‌తో పాటు ఫ్యాషనబుల్‌గా ఉండాలన్న వారి కోరికను తానెప్పుడూ కాదనలేదని చెప్పిందీ మహిళ. ఇంత గొడవ జరుగుతున్నా.. షాపింగ్ మాల్‌లో ఉన్న ప్రతిఒక్కరూ తనదే తప్పని చెబుతున్నా.. ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినామె మాత్రం అసలు వెనక్కి తగ్గలేదు. పైగా తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ..అక్కడ మాట్లాడుకుందామని చెప్పడం విశేషం. అంతేకాదు.. గొడవ చివరలో కూడా తాను చెప్పిన మాటలనే ఆమె మరోసారి రిపీట్ చేసింది.

“హలో.. మీరు రికార్డ్ చేస్తున్నారు కదా.. ఈ అమ్మాయిలు పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని ప్రతిఒక్కరూ తమని చూడాలని కోరుకుంటున్నారు. తమవైపు చూసేలా అబ్బాయిలను ప్రోత్సహిస్తున్నారు. ఈ అమ్మాయిలందరూ పొట్టి దుస్తులు వేసుకొని నగ్నంగా రోడ్లపై నడుస్తూ రేప్కి గురవుతారు. అందుకే ఈ వీడియో ఒకవేళ తల్లిదండ్రులు చూస్తుంటే.. మీ పిల్లలను అదుపులో ఉంచుకోండి. వారికి ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పండి. అంతేకాదు.. పెద్దవాళ్లతో ఇలా గొడవ పెట్టుకోకుండా మర్యాదగా మాట్లాడడం నేర్పించండి..” అంటూ ఆమె చెప్పడం గమనార్హం.

ఈ వీడియోని శివానీ గుప్తా అనే దిల్లీకి చెందిన అమ్మాయి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోతో పాటు సంఘటనను పూర్తిగా వివరించింది శివానీ. “ఈ రోజు నన్ను, నా స్నేహితులను పొట్టి డ్రస్ వేసుకున్నందుకుగాను ఈ మహిళ వేధింపులకు గురి చేసింది. రెస్టరెంట్లో ఉన్న మరో ఏడుగురు అబ్బాయిలను పిలిచి మమ్మల్ని రేప్ చేయమని చెప్పింది. మేం పొట్టి దుస్తులు వేసుకున్నాం.. కాబట్టి రేప్కి గురి కావాలని తన అభిప్రాయం.”

ADVERTISEMENT

“అందుకే తనని అక్కడితో వదలాలని మేం భావించలేదు. జరిగిన విషయం నుంచి మేం తేరుకునేలోపే తను పక్కనే ఉన్న షాపింగ్ సెంటర్లోకి వెళ్లింది. మేమంతా ఆమెను అనుసరించి.. అక్కడికి వెళ్లి తనని మాకు క్షమాపణ చెప్పమని కోరాం. కానీ ఏం చేసినా తను మాత్రం తన మాటపైనే నిలబడి ఉంది.. అక్కడే ఉన్న మరో మహిళ అసలు విషయం తెలుసుకొని తనని నిందించినా తన మైండ్ సెట్ మారలేదు. ఇలాంటి వాళ్ల మనస్తత్వాలు మారేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి “అంటూ పోస్టు చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు నలభై వేల మంది దానిని షేర్ చేయడం విశేషం.

వీడియో వైరల్‌గా మారిన తర్వాత సంఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు వెల్లడించింది శివానీ. “రెస్టరెంట్‌కి వెళ్లగానే తను నన్ను తన దగ్గరికి రమ్మంది. నేను వెళ్లగానే నన్ను కూర్చోమని చెప్పింది. కోపంగా ఉన్న తన గొంతుకను చూసి కాస్త ఇబ్బందిగా.. అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారని ప్రశ్నించాను.

“ఇంత పొట్టి దుస్తులు వేసుకున్నావు.. అబ్బాయిలు చూస్తున్నారని సిగ్గుగా కూడా అనిపించడం లేదా?” అంటూ అరవడం ప్రారంభించింది.  అంతేకాదు.. మీరు ఇలాంటి దుస్తులు వేసుకొని అబ్బాయిల్లో కోరికలు పెంచుతారు కాబట్టి.. వేరే మహిళలు రేప్కి గురవుతారు అంటూ తిట్టడం ప్రారంభించింది. మేం రెస్టరంట్ మేనేజర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పి ఫిర్యాదు చేశాం. అతడు వచ్చి ఆమెను వెళ్లిపొమ్మని కోరినా తను వెళ్లలేదు. దీంతో ఆయన మమ్మల్ని పై ఫ్లోర్‌లో భోజనం చేయాల్సిందిగా కోరారు. ఇంతటితో ఆమె ఊరుకోలేదు. పక్కనే కూర్చున్న అబ్బాయిలకు మమ్మల్ని ఉద్దేశిస్తూ “రేప్ చేయండి” అని చెప్పడం మాకు కోపాన్ని కలిగించింది. అక్కడి నుంచి ఆమెను అనుసరిస్తూ షాపింగ్ సెంటర్‌కి వెళ్లాం..” అంటూ శివానీ చెప్పుకొచ్చింది.

ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ విపరీత ధోరణిలో మాట్లాడిన.. ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ క్షమాపణ చెప్పాలని కోరారు

ADVERTISEMENT

“తను మాట్లాడిన మాటలు మన సమాజంలోని వేళ్లూనుకుపోయిన మూసధోరణికి అద్ధం పడుతున్నట్లు వారంతా చెబుతున్నారు. ఓ సంఘటన జరిగిప్పుడు.. ఆ ఘటనలో బాధితురాలు వేసుకున్న దుస్తులు, చేసే పని, ఆ పనిని ప్రోత్సహించేలా ఏదైనా ప్రవర్తన ఉందేమో అంటూ ఎన్నో రకాలుగా చెప్పే సమాజానికి ఈ మహిళ ప్రతినిధిగా కనిపిస్తోంది.” 

ఈ మహిళ పై కూడా పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌ ప్రభావం ఉంది. స్త్రీల ప‌ట్ల చుల‌క‌న‌భావం ఆమె వైఖరిలో కనిపిస్తోంది. ఎంతమంది ఎన్ని చెబుతున్నా తన అభిప్రాయాన్ని మార్చుకోని ఆమె తత్వాన్ని చూస్తుంటే మన దేశంలో రేప్ కల్చర్ గురించి అట్టడుగు స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. స్కూల్ స్థాయి నుంచే అమ్మాయిలను గౌరవించడం గురించి నేర్పిస్తే అటు అబ్బాయిలనే కాదు.. ఇటు అమ్మాయిలను కూడా మంచి మనుషులుగా మార్చే వీలుంటుంది.

అయితే వీటన్నింటి మధ్యలో గొడవకు దిగిన అమ్మాయిలు చేసిన ఓ తప్పును కూడా గుర్తించి.. దాన్ని తప్పుబట్టిందో అమ్మాయి. ఈ క్రమంలో.. ఆ విపరీత వ్యాఖ్యలు చేసిన మహిళ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని కూడా పలువురు షేర్ చేశారు. ఆమెను ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వస్తున్న కామెంట్ల నేపథ్యంలో శివానీ సైతం ఈ వీడియోను డిలీట్ చేయడం విశేషం.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల వర్షం కారణంగానో లేక ట్రోల్స్ వల్లో లేక తన మనసు మార్చుకోవడం వల్లో ఆఖరికి క్షమాపణలు చెప్పిందా మహిళ

ADVERTISEMENT

“ఆ అమ్మాయిలకే కాదు.. మహిళలందరికీ నేను క్షమాపణ కోరుతున్నా. నేను మాట్లాడిన మాటలు చాలా కఠినంగా, తప్పుగా ఉన్నాయని నేను అర్థం చేసుకున్నా. ఆ అమ్మాయి భద్రత పట్ల నాకున్న భయాన్ని నేను తనతో నెమ్మదిగా, వ్యక్తిగతంగా చెప్పాల్సింది. ప్రస్తుతం ప్రోగ్రెసివ్ జనరేషన్‌లో కూడా నేను చాలా రిగ్రెసివ్‌గా ఆలోచించాను. ఒక తల్లిగా, సోదరిగా, తల్లిగా ముఖ్యంగా ఓ మహిళగా ప్రతి మహిళ గౌరవాన్ని నేను గౌరవిస్తున్నా. నా మాటల వల్ల బాధపడిన అమ్మాయిలందరికీ క్షమాపణలు చెబుతున్నా” అంటూ తన ఫేస్బుక్ వేదికగా క్షమాపణలు వెల్లడించిందామె.

సమస్యకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం మంచిదే. కానీ సమస్యకు పరిష్కారం కావాలంటే కేవలం ఈ మహిళ ఒక్కరినే ట్రోల్ చేయడం వల్ల అది సాధ్యం కాదు. అలాంటి మూస ఆలోచనలలోనే మగ్గిపోతున్న ఆమెలాంటి వారందరికీ సరైన అవగాహన కల్పించడం వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మీరేమంటారు మరి??

ఇవి కూడా చదవండి.

తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!

ADVERTISEMENT

అమ్మా.. నా జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్స్: సినీనటి సంగీత

“కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..” అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?

02 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT