బిగ్‌బాస్ తెలుగు: హేమ వెళ్లింది... తమన్నా వచ్చింది...!

బిగ్‌బాస్ తెలుగు: హేమ వెళ్లింది... తమన్నా వచ్చింది...!

వాడీ వేడీగా సాగిపోతున్న బిగ్‌బాస్ (Bigg boss) తెలుగు సీజన్ 3 షోలో.. అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే ఎలిమినేషన్ రోజు రానే వచ్చేసింది. అలాగే అందరూ ఊహించినట్లుగానే ఈ షో నుంచి మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన కంటెస్ట్ హేమ. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చిన హేమ నాగార్జునతోను, మన టీవీ ద్వారా ఇంటి సభ్యులతోనూ సరదాగా ముచ్చటించడమే కాదు.. అందరికీ సలహాలు కూడా చెప్పింది.

అయితే ఇదంతా అందరూ ముందు నుండీ ఊహించిందే. కానీ ఈ రోజు షోలో ఎవరి ఊహకీ అందని విధంగా పెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఇంటి నుంచి హేమను బయటకు పంపిన నాగార్జున వైల్డ్‌కార్డ్ ఎంట్రీ అంటూ మరొకరిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా??

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వార్త.. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు అని. కానీ ఈ వార్తను అసత్యం అని తేలిందిజ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఓ ప్రకటన చేశారు నాగార్జున. ఇంటి సభ్యులతో కలిసి గడిపేందుకు వైల్డ్‌కార్డ్ ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపుతున్నామని, ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా సింహాద్రి అని ప్రకటించారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ కావడంతో బిగ్‌బాస్ షోలో.. ఇప్పటివరకు జరగని ఒక సంచలనం నిన్నటి ఎపిసోడ్‌లో జరిగినట్లుగా మనం చెప్పుకోవచ్చు.

బిగ్ బాస్ షో నుండి హేమ వెళ్లిపోవడానికి కారణాలు ఇవేనా?!

ట్రాన్స్‌జెండర్ అయిన తమన్నా సింహాద్రి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి అంశంలో ఈమె పేరు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్‌ని శ్రీరెడ్డి దూషించిన ఎపిసోడ్‌లో ఈమె బయటపెట్టిన కాల్ రికార్డింగ్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఇక తమన్నా స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ కాగా.. ట్రాన్స్‌జెండర్ అయిన కారణంగా ఆమె కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. దీనితో ఆమె చిన్న వయసులోనే ముంబయికి వెళ్లి.. ఆ తరువాత సినిమాల పై మక్కువతో  హైదరాబాద్‌కి వచ్చి.. తెలుగు చిత్రపరిశ్రమలో అవకాశాలు కోసం ప్రయత్నించసాగారు. అయితే తన పై లింగ వివక్ష చూపుతూ ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వడం లేదని.. చిత్రపరిశ్రమ పై విమర్శలు కూడా చేశారు తమన్నా సింహాద్రి.

ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే.. జనసేన తరపున పోటీ చేస్తా అంటూ ప్రకటించి సరికొత్త సంచలనానికి తెరలేపారు తమన్నా. ఈ వార్త కాస్తో కూస్తో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగారు తమన్నా సింహాద్రి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌..లో ఈమె ఎంట్రీతో షో పై ఇంకాస్త ఆసక్తి పెరిగింది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు షోలో ఒక ట్రాన్స్‌జెండర్‌ని కంటెస్టెంట్‌గా ఎవరూ చూడలేదు. అదే సమయంలో ఇంటి సభ్యులు కూడా తొలివారంలోనే.. ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉంటుందని; దాని ద్వారా ఇంటి లోపలికి వచ్చేది ట్రాన్స్‌జెండర్ అని ఊహించి ఉండకపోవచ్చు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ


ఇలా ఏకకాలంలో ఇటు బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో పాటుగా అటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చారు బిగ్ బాస్. అంతేకదా మరి.. ఇది బిగ్ బాస్ షో ... ఇక్కడ ఏమైనా జరగొచ్చు అని చెప్పే ట్యాగ్ లైన్ దీనికి చక్కగా సరిపోతుంది. ఇదిలావుండగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులతో నాగార్జున సందడి చేశారు. ఇంటి సభ్యులని మూడు గ్రూపులుగా విభజించి వారితో ఆటలాడించారు.

అలా సండే షో ఫండే షోగా మారిపోయింది. ఇక ఇంటి సభ్యులకి ఒక టాస్క్ ఇస్తూ.. "మీకు ఇంటిలో ఉండే గుడ్ , యావరేజ్ & బ్యాడ్ సభ్యులు" ఎవరన్నది చీటీలో ఒక్కొక్క పేరు రాయమని చెప్పగా.. అందులో గుడ్ అని పేర్కొంటూ.. ఎక్కువ మంది బాబా భాస్కర్‌కి ఓటు వేయగా; ఎక్కువమంది జాఫర్‌ని యావరేజ్‌గా పేర్కొన్నారు. కొసమెరుపు ఏంటంటే - ఇంటి సభ్యులు, బిగ్ బాస్ షో చూసే వీక్షకులు కూడా బ్యాడ్ కంటెస్టెంట్‌గా హేమని పేర్కొనడం జరిగింది. ఇలా అందరూ ఏకాభిప్రాయంతో హేమని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించినట్లయింది.

అయితే వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇంటిలో అడుగుపెట్టేందుకు అర్హత సాధించిన తమన్నా ఇంట్లో ఎప్పుడు, ఎలా అడుగుపెట్టనుందో ఇంకా తెలియాల్సి ఉంది.. బిగ్‌బాస్ నుండి సంబంధిత ఆదేశాలు వచ్చే వరకు వేచి చూద్దాం అంటూ నాగార్జున చెప్పడంతో.. ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఏదేమైనా.. బిగ్‌బాస్ నుంచి హేమ బయటకు రావడం.. తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో షో మరింత రసవత్తరంగా మారిందని చెప్పచ్చు. తమన్నా నేటి ఎపిసోడ్‌లో ఇంటిలోకి అడుగుపెట్టనుంది.

బిగ్ బాస్ తెలుగు షో లో కొత్త వివాదం