జనవరి 26.. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. ఆ రోజు వస్తుందనగానే గుండె నిండా భారతీయత నిండిపోతుంది. రోజంతా ఎక్కడ చూసినా స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పాటలే.. ఎక్కడ చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలే.. అయితే కాలం మారిపోతున్నకొద్దీ స్వాతంత్య్ర దినోత్సవం(Independence day), గణతంత్ర దినోత్సవం (Republic day) జరుపుకునేవారు తక్కువైపోతున్నారు. ఈ రోజును ఒక సెలవురోజుగా భావించేవారూ చాలామందే.. అందుకే భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని కూడా ఓ ప్రత్యేకమైన పండగలా వారు భావించేలా ప్రత్యేకమైన వంటకాలతో అందరినీ సర్‌ప్రైజ్ చేయండి. మరి, రిపబ్లిక్ డే సందర్భంగా చేసే ఆ వంటకాలు కూడా జెండా రంగుల్లో (Tri color Recipes) ఉంటే ఇంకా బాగుంటుంది కదూ.. అందుకే ఓసారి ఇవి ప్రయత్నించండి.
1. ట్రై కలర్ శాండ్‌విచ్
దీన్ని సాధారణ శాండ్‌విచ్‌లాగే తయారుచేయచ్చు.. అయితే రెండు లేయర్లకు బదులుగా మూడు లేయర్లతో ప్రయత్నించాలి. కాషాయం రంగు కోసం క్యారట్, ఎరుపు రంగు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, వేయించిన శెనగపప్పు మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక తెలుపు రంగు కోసం ఉడికించిన బంగాళాదుంపను కాస్త వెన్న వేసి వేయించి అందులో ఉప్పు, కొన్ని పాలు కలుపుకొని పెట్టుకోవాలి. ఆకుపచ్చ మిశ్రమం కోసం కీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వేయించిన శెనగపప్పు, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక్కో మిశ్రమాన్ని ఒక్కో బ్రెడ్‌పై లేయర్‌లా పరుచుకుని అంచులు కట్ చేసుకోవాలి. ఈ మూడింటినీ కలిపి రెండు త్రిభుజాకార ముక్కలు వచ్చేలా మధ్యలోకి కట్ చేస్తే సరి. ట్రై కలర్ శాండ్‌విచ్ సిద్ధం.
2. తిరంగా ఢోక్లా
దీని కోసం మూడు కప్పుల ఇడ్లీపిండిని సిద్ధం చేసుకోవాలి. అన్నింటిలోనూ ఉప్పు సరిచూసుకున్న తర్వాత ఒక్కో కప్పు మిశ్రమాన్ని ఒక్కో బౌల్‌లో వేసుకొని ఒకదానిలో ఉడికించి మిక్సీ పట్టిన పాలకూర మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరోదాన్లో ఉడికించి గుజ్జుగా మార్చిన క్యారట్, టొమాటో మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె రుద్దుకున్న ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఆకుపచ్చ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత తెలుపు రంగు మిశ్రమం, ఆపై కాషాయం రంగు మిశ్రమం పోసి కుక్కర్‌లో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత బయటకు తీసి ముక్కలుగా చేసి సర్వ్ చేస్తే సరి. కావాలంటే దీనిపైన కాస్త పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
3. మువ్వన్నెల కేసరి
ముందుగా పాలు మరిగించుకోవాలి. అందులో వేయించిన రవ్వ వేసి అది ఉడుకుతుండగా చక్కెర, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కేసరి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేసరిని మూడు భాగాలు చేసుకోవాలి. ఈలోపు రెండు బౌల్స్‌లో టీస్పూన్ చొప్పున పాలు తీసుకొని అందులో ఒకదానిలో కాషాయం, మరోదానిలో ఆకుపచ్చ ఫుడ్ కలర్ కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందాక తీసుకున్న మూడు భాగాల కేసరిలో ఒకదానిలో కాషాయం రంగు, మరోదానిలో ఆకుపచ్చ రంగు కలుపుకోవాలి. నెయ్యి రుద్దుకున్న ప్లేట్ లేదా గ్లాస్ తీసుకొని ముందు ఆకుపచ్చ, ఆ తర్వాత ఫుడ్‌కలర్ కలపని కేసరి, ఆపై కాషాయం రంగు వేసిన కేసరి వేసి పైన డ్రైఫ్రూట్స్ పెట్టి సర్వ్ చేసుకుంటే సరి.
4. ఫ్లాగ్ కుకీస్
జెండా రంగులో ఉండే ఈ బిస్కట్లు నోరూరిస్తాయి. ఇందుకోసం ముందుగా వెన్న, చక్కెర తీసుకొని బీట్ చేయాలి. ఆపై అందులో గుడ్లు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ కూడా వేసి బీట్ చేసి కొద్దికొద్దిగా మైదా వేసుకుంటూ మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి. ఒకదానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్, మరోదానిలో గ్రీన్ ఫుడ్‌కలర్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడు భాగాలను చపాతీల్లా కాస్త మందంగా వత్తుకోవాలి. ఒకదానిపై మరొక లేయర్ జెండా రంగులు వచ్చేలా వేసుకొని అవి అతుక్కున్నాక ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని బేక్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే నీలి రంగు క్రీమ్‌తో వీటిపై అశోక చక్రం కూడా గీసుకోవచ్చు.
ఇవే కాదు.. మనసు పెట్టి ప్రయత్నించాలే కానీ ఇంకా ఎన్నో రకాల వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. మీరూ ఓసారి వీటిని ప్రయత్నించి చూడండి.
ఇవి కూడా చదవండి
ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్